bigg boss 7: ‘SPY’ అనే కంపెనీ నేనేమైనా పెట్టానా.. జనాలేమైనా పిచ్చోళ్లా? ఇక్కడ ఉంచడానికి...!

Published : 27 Nov 2023 16:02 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-7 (Bigg Boss Telugu 7) తుది దశకు వచ్చేసింది. మరో మూడు వారాల్లో ఈ సీజన్‌ ముగియనున్న నేపథ్యంలో ఈ వారం నామినేషన్స్‌లో వాడీ వేడి చర్చ జరిగింది. గతవారం నిర్వహించిన చివరి కెప్టెన్సీ టాస్క్‌ రద్దు కావడానికి ప్రధాన కారణమైన శివాజీ, శోభాలను ఇంటి సభ్యులు టార్గెట్‌ చేశారు. ముఖ్యంగా శివాజీకి వరుస నామినేషన్స్‌ పడ్డాయి. ‘‘మీ దృష్టిలో నామినేషన్‌ అనే నరకాన్ని ఎదుర్కొనే ఇద్దరు ఇంటి సభ్యులను నిర్ణయించి, అందుకు తగిన కారణాలు చెప్పి, పెయింట్‌ను వారి ముఖానికి పూయాల్సి ఉంటుంది’ అని బిగ్‌బాస్‌ సూచించాడు. దీంతో గౌతమ్‌, ప్రియాంక, అర్జున్‌లు శివాజీని నామినేట్‌ చేశారు. ‘మీరు నా గేమ్‌ను చాలా సార్లు ప్రోత్సహించారు. దాని కన్నా కూడా నాపై ఎక్కువ నెగెటివిటీ పెట్టుకున్నారు’ అని ప్రియాంక కారణం చెప్పింది. ‘నీకు నచ్చకపోతే ఎదుటి వాళ్లను నువ్వు నెగెటివ్‌ చేస్తావు’ అని శివాజీ ఆమెకు సమాధానం ఇచ్చాడు.

అనంతరం శివాజీని అర్జున్‌ నామినేట్‌ చేస్తూ ‘‘నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అది నాగ్‌ సర్‌ నోటి నుంచి వచ్చేసింది’ అని అనగా, ‘ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ అంటే, నేను నిజంగానే వేసుకున్నా. ఇది ఇంకా ఉంచుకుంటే, గేమ్‌ ఆడుతున్నామనే విషయం తెలుసుకోలేను. ఆ రోజు నువ్వొక మాట అన్నావు. ‘తెలియని మిత్రుడి కంటే, తెలిసిన శత్రువు బెటర్‌’. నీకు ఆ పాయింట్‌ మీద ఆసక్తి (రెండోసారి కెప్టెన్‌ కావాలనుకోవడం) లేకపోతే, అప్పుడే చెప్పేస్తే చాలా సంతోషపడేవాడిని’’ అంటూ శివాజీ కౌంటర్‌ ఇచ్చాడు. దీంతో స్పందించిన అర్జున్‌ ‘నేను డ్రాప్‌ అయిపోతానన్న విషయం మీకు చెప్పకపోవడం నాదే మిస్టేక్‌’ అంటూ వివరణ ఇచ్చుకున్నాడు.

ఇక శివాజీని గౌతమ్‌ నామినేట్‌ చేస్తూ, ‘మీరు అన్నమాట ప్రకారం.. బలహీనుల పక్కన నిలబడరు. మీరు రాజకీయంగా కరెక్ట్‌ కావచ్చేమో కానీ, మోరల్లీ కరెక్ట్‌కాదు.’ అని అనగా, ‘వాళ్లిద్దరి (ప్రశాంత్‌, యావర్‌) విషయంలో ఇక నుంచి నేను కలగజేసుకోను. ఇదే నా ఛాలెంజ్‌’ అని శివాజీ కౌంటర్‌ సమాధానం ఇచ్చారు. అలాగే శివాజీ, ప్రశాంత్‌, యావర్‌ల గ్రూప్‌ను ‘SPY’ అనడంపైనా శివాజీ మండిపడ్డారు. తానేమైనా ఆ కంపెనీ పెట్టానా? అంటూ గౌతమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్స్‌ సందర్భంగా ప్రశాంత్‌ను అమర్‌ నామినేట్‌ చేయడంతో భావోద్వేగానికి గురయ్యాడు. మరి ఈ వారం ఎవరెవరు నామినేషన్స్‌లో ఉంటారో చూడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని