MAA, CINTAAల మధ్య ఒప్పందం.. ఒకే కుటుంబంలా ఉండాలన్న మంచు విష్ణు

అన్ని చిత్ర పరిశ్రమలు కలిసి ఓ కుటుంబంలా ఉండాలని ‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు ఆకాంక్షించారు. బాలీవుడ్‌కి చెందిన CINTAAతో ఒప్పందం కుదిరిన అనంతరం ఆయన మాట్లాడారు.

Updated : 22 Jun 2023 23:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతదేశంలోని చిత్ర పరిశ్రమలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు ‘మా’ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) ముందడుగేశారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ( Movie Artists Association- MAA), బాలీవుడ్‌కి చెందిన సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (Cine And TV Artistes Association- CINTAA)ల మధ్య ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి ‘మా’ కోశాధికారి శివ బాలాజీతో కలిసి జూన్‌ 17న ముంబయి వెళ్లి, CINTAA వారితో ఆయన చర్చించారు. ఇరు అసోసియేషన్లు కలిసి ఉండాలనే ‘మా’ ప్రతిపాదనను CINTAA అంగీకరించింది. ఈ మేరకు ఒప్పంద పత్రంపై ఇరు సంఘాల అధ్యక్షులు సంతకం చేశారు.

ఈ సందర్భంగా ‘మా’ ప్రెసిడెంట్ విష్ణు మాట్లాడుతూ.. ‘‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్, సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ల మధ్య ఒప్పందం ప్రకారం తెలుగు చిత్రాల్లో పని చేసే బాలీవుడ్ నటులకు ‘మా’ సభ్యత్వం, తెలుగు నటీనటులు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తే వాళ్లకి CINTAA అసోసియేషన్ సభ్యత్వం లభిస్తుంది. ఈ విషయంలో ఏవైనా వివాదాలు తలెత్తితే ‘మా’ వారికి అండగా ఉంటుంది. త్వరలోనే ఇతర సినీ పరిశ్రమలతోనూ ఒప్పందం జరుగుతుంది. అన్ని ఇండస్ట్రీలు కలిసి ఒకే కుటుంబంగా ఉండాలి’’ అని ఆయన ఆకాంక్షించారు.

2021లో జరిగిన ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విష్ణు.. ‘మా’ సభ్యత్వ నమోదులో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. నటుల ఆరోగ్యానికి పెద్ద పీట వేశారు. పలుమార్లు హెల్త్‌ క్యాంపులు నిర్వహించి, హెల్త్‌ కార్డ్స్‌ అందించారు. మహిళా కళాకారులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ.. వారి భద్రత కోసం ఓ ప్యానెల్‌ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి గౌరవ అధ్యక్షురాలిగా పద్మశ్రీ సునీతా కృష్ణన్‌ను ఎంపిక చేశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీ ప్రో ఛాన్సలర్‌గా ఉన్న విష్ణు.. వారి విద్యాసంస్థల్లో ప్రవేశం కోరుకునే నటుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, ట్యూషన్ ఫీజులో రాయితీలను ప్రకటించారు. ‘మా’ సొంత భవనం కలను సాకారం చేస్తానని వాగ్దానం చేసిన ఆయన అది త్వరలో నెరవేరే అవకాశం ఉందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని