Custody: కస్టడీ.. ఓ కొత్త ప్రయత్నం

నాగచైతన్య, కృతిశెట్టి జంటగా వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కస్టడీ’. శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. అరవింద్‌ స్వామి, శరత్‌ కుమార్‌, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated : 14 May 2023 12:53 IST

నాగచైతన్య (Naga Chaitanya), కృతిశెట్టి (Krithi Shetty) జంటగా వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కస్టడీ’ (Custody). శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. అరవింద్‌ స్వామి, శరత్‌ కుమార్‌, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవలే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో శనివారం సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. ‘‘సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి మౌత్‌ టాక్‌ వస్తోంది. అందుకే వాళ్లందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. మేము ఏదైతే నమ్మి యాక్షన్‌ సీక్వెన్స్‌లు తీశామో.. వాటికి ప్రశంసలు దక్కుతున్నాయి. నటుడిగా ఓ కొత్త ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో ఈ చిత్రం చేశాను. ఆ ప్రయత్నాన్ని అందరూ మంచిగా ప్రోత్సహిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నాకు నటించడానికి ఆస్కారమున్న మంచి పాత్ర ఇచ్చారు వెంకట్‌ ప్రభు. ఆ పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ బాగుంది. మా సినిమాని ఇంత చక్కగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు’’ అంది నాయిక కృతి శెట్టి. దర్శకుడు వెంకట్‌ ప్రభు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకి తెలుగుతో పాటు తమిళం నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం కోసం మేము వంద రోజులకు పైగా చాలా కష్టపడ్డాం. థియేటర్లలో ప్రేక్షకులు సినిమాని చూసి ఎంజాయ్‌ చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. ముఖ్యంగా ఆరంభంలో వచ్చే నాలుగు నిమిషాల సింగిల్‌ షాట్‌ ఫైట్‌ సీక్వెన్స్‌ కోసం చైతన్య చాలా కష్టపడ్డాడు. దాన్ని చిత్రీకరించడానికి మాకు రెండు రోజుల సమయం పట్టింది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్‌ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా బయ్యర్స్‌ అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు’’ అన్నారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని