Elvish Yadav: పాము విషం ఏర్పాటు చేశా.. కీలక విషయాలు వెల్లడించిన బిగ్‌బాస్‌ ఓటీటీ విజేత..!

పాము విషంతో రేవ్‌పార్టీలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలపై అరెస్టై రిమాండ్‌లో ఉన్నారు యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఓటీటీ విజేత ఎల్విష్‌ యాదవ్‌. విచారణలో అతడు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

Updated : 18 Mar 2024 13:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాము విషంతో రేవ్‌పార్టీలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌-2(హిందీ) విజేత ఎల్విష్‌ యాదవ్‌ (Elvish Yadav)పై యూపీ పోలీసులు గతేడాది కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా పరారీలో ఉన్న అతడిని ఆదివారం నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా అతడు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. రేవ్‌ పార్టీల కోసం అతడు పాములు, వాటి విషాన్ని ఆర్డర్‌ చేసినట్టు తేలిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన నిందితులతో అతడికి పరిచయం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

నోయిడాలోని సెక్టార్‌ 49లో జరుగుతున్న ఓ రేవ్‌పార్టీపై గతేడాది నవంబర్‌లో పోలీసులు దాడి చేశారు. ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అప్పట్లో ఎల్విష్‌ యాదవ్‌ (Elvish Yadav) పేరునూ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. కొన్ని పాములు, 20 ఎంఎల్‌ విషాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఎల్విష్‌ ఒక పామును చేత్తో పట్టుకొన్న వీడియో బయటకు రావడంతో అతడిపై కేసు పెట్టినట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడి సందర్భంగా అరెస్టు చేసిన వారిని ప్రశ్నించగా అసలు విషయం బయటకు వచ్చింది. అతడు నిర్వహించే పార్టీలకు తరచూ పాములను సరఫరా చేస్తుంటామని వారు వెల్లడించారు. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటామని అంగీకరించారు. కేసు నమోదు చేసిన విషయం బయటకు రాగానే ఎల్విష్‌ పరారయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని