Updated : 23 May 2022 06:59 IST

Cinema News: శర్వా.. కొత్త కబురు

టీవలే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు శర్వానంద్‌. దీని తర్వాత ఆయన మరో కొత్త  కబురేదీ వినిపించలేదు. అయితే, ఇప్పుడాయన ఓ కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు  సమాచారం. దర్శకుడు కృష్ణచైతన్య చెప్పిన కథకు ఆయన ఓకే చెప్పారని తెలిసింది. ఈ ప్రాజెక్ట్‌ను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించేందుకు సిద్ధమైంది. చైతన్య మార్క్‌ విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతుందని, శర్వా నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయని తెలిసింది. ఇది జూన్‌లో లాంఛనంగా ప్రారంభం కానుంది. జులై నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్‌ నటించిన ‘ఒకే ఒక జీవితం’ విడుదలకు సిద్ధమవుతోంది.


‘చిత్తం మహారాణి’ ప్రేమకథ

‘ఇప్పడు జరిగేవన్నీ ప్రేమ పెళ్లిల్లే సార్‌.. సక్సెస్‌ అయితే మనం ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటాం...లేదంటే  ఇంకొకడు ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటాం’ అని కొత్త ప్రేమ సూత్రాలు చెబుతూ మన ముందుకు రానున్నాడు నూతన కథానాయకుడు యజుర్వేద్‌. తను హీరోగా నటించిన కొత్త చిత్రం ‘చిత్తం మహారాణి’. రచన ఇందర్‌ కథా నాయిక. సునీల్‌, హర్షవర్థన్‌, సత్య, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే యువ కథానాయకుడు విశ్వక్‌సేన్‌ చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్‌ విడుదల అయింది. ప్రచార చిత్రాన్ని చూస్తుంటే దర్శకుడు కాశీ విశ్వనాథ్‌ ఒక అందమైన పల్లెటూరి ప్రేమకథను చెప్పనున్నారని తెలుస్తోంది. జె.ఎస్‌ మణికంఠ, ప్రసాద్‌ రెడ్డి టి.ఆర్‌    నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గౌర హరి, కూర్పు: కార్తీక శ్రీనివాస్‌, ఛాయాగ్రహణం: విశ్వనాథ్‌ రెడ్డి.


‘ఇంద్రాణి’ జోరు

యానియా భరద్వాజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సూపర్‌గర్ల్‌ చిత్రం ‘ఇంద్రాణి’. స్టీఫెన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఫ్రనైట జిజిన కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి ఫ్రనైట ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత స్టీఫెన్‌ మాట్లాడుతూ.. ‘‘మూడు పాత్రల చుట్టూ తిరిగే సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రమిది. ఇందులో యానియా సూపర్‌గర్ల్‌గా టైటిల్‌ పాత్రలో కనిపించనుంది. ఆమెకు దీటైన పాత్రను ఫ్రనైట పోషిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. దీన్ని ఈ ఏడాది అక్టోబర్‌ 27న విడుదల చేయనున్నాం’’ అన్నారు. సంగీతం: సాయి కార్తీక్‌,   ఛాయాగ్రహణం: చరణ్‌ మాధవనేని.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని