77th Independence Day 2023: తెరపై దేశభక్తి.. మదిలో స్ఫూర్తి శక్తి

స్వతంత్ర సంగ్రామంలో ఉరికొయ్యల్ని ముద్దాడిన వీరుల జీవితాలకు చిత్ర పరిశ్రమ ముందునుంచీ బ్రహ్మరథం పడుతూనే ఉంది.

Updated : 15 Aug 2023 08:14 IST

స్వతంత్ర సంగ్రామంలో ఉరికొయ్యల్ని ముద్దాడిన వీరుల జీవితాలకు చిత్ర పరిశ్రమ ముందునుంచీ బ్రహ్మరథం పడుతూనే ఉంది. స్వేచ్ఛా వాయువుల కోసం తిరుగు బావుటా ఎగరేసిన చరితను తెరకెక్కిస్తూనే ఉంది. దేశభక్తే కథాంశంగా, మువ్వన్నెల పతాకమే మూలకథగా వచ్చిన చిత్రాలకు జనం నీరాజనం పడుతూనే ఉన్నారు. దేశభక్తి కథలకు ప్రేక్షకుల హృదయాలను కదిలించే సత్తా ఉండటం.. బాక్సాఫీసు దగ్గర కాసులు కురిపించే మార్గం కావడంతో దర్శక నిర్మాతలు ఈ తరహా సినిమాలు రూపొందించడానికి ఉత్సాహ పడుతుంటే.. నటీనటులు తమ హీరోయిజం ప్రదర్శించడానికి ఉవ్విళ్లూరడం ఒక ఆనవాయితీగా మారుతోంది.

దేశభక్తి కథతో తెరకెక్కిన చిత్రాలు నిరాశ పరిచిన సందర్భాలూ తక్కువే. ఆనాటి ‘మదర్‌ ఇండియా’ నుంచి నేటి ‘మేజర్‌’ దాకా ప్రేక్షకుల మది గెలుస్తూ.. మంచి వసూళ్లు అందుకున్నాయి. ‘బోర్డర్‌’, ‘లగాన్‌’, ‘రంగ్‌ దే బసంతీ’, ‘మంగళ్‌పాండే’, ‘షేర్షా’, ‘గదర్‌ ఏక్‌ ప్రేమ్‌ కథా’, ‘ఎల్‌వోసీ’, ‘ఎయిర్‌లిఫ్ట్‌’, ‘లక్ష్య’, ‘ది లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌సింగ్‌’, ‘యురి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’, ‘రాజీ’ లాంటి చిత్రాలు భారీ విజయాలు మూటగట్టుకున్నాయి. ఈ రోజు జెండా పండగ సందర్భంగా జనం గుండెల్ని గెలవడానికి ముస్తాబవుతున్న మరిన్ని దేశభక్తి ప్రధాన సినిమాల విశేషాలివి.


సమర సేనాని శ్యామ్‌ బహదూర్‌

1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ముందుండి గెలిపించిన వ్యూహకర్త, త్రివిధ దళాల అధిపతి శ్యామ్‌ బహదూర్‌ మానెక్‌షా. ఆయన జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘శ్యామ్‌ బహదూర్‌’. విక్కీ కౌశల్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తున్నారు. ఫాతిమా సనా షేక్‌, సాన్యా మల్హోత్రా, మనోజ్‌ బాజ్‌పేయిలు కీలక భూమికల్లో నటిస్తున్నారు. మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రోనీ స్క్రూవాలా నిర్మాత. డిసెంబరు 1న థియేటర్లలోకి వస్తోంది.


భారత్‌ - పాక్‌ పోరాటం పిప్పా

ఇషాన్‌ ఖట్టర్‌, మృణాల్‌ ఠాకూర్‌ నాయకానాయికలుగా ‘ఎయిర్‌లిఫ్ట్‌’ ఫేం రాజా కృష్ణమీనన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పిప్పా’. 1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన బ్రిగేడియర్‌ బల్‌రామ్‌ సింగ్‌ మెహతా స్వానుభవాల సమాహారమే ఈ సినిమా. రోనీ స్క్రూవాలా, సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబరు 2న విడుదలవుతోంది.


సైనికుడి సీక్రెట్‌ ఆపరేషన్‌ యోధ

సిద్ధార్థ్‌ మల్హోత్రా, దిశా పటానీ, రాశీ ఖన్నా ప్రధాన పాత్రధారులుగా దర్శకద్వయం సాగర్‌ ఆంబ్రే, పుష్కర్‌ ఓఝాలు ముస్తాబు చేస్తున్న చిత్రం ‘యోధ’. భారత సైన్యానికి చెందిన ఒక సైనికుడు తీవ్రవాదుల ఆట కట్టించడానికి చేసిన సీక్రెట్‌ ఆపరేషనే కథ. కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా, శశాంక్‌ ఖైతాన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబరు 15న విడుదలవుతోంది.


విజయాల ‘మైదాన్‌’

ఫుట్‌బాల్‌లో అట్టడుగున ఉన్న భారత జట్టును మేటిగా మలచి, భారత పతాకను రెపరెపలాడించిన కోచ్‌.. సయ్యద్‌ అబ్దుల్‌ రహీం.ఈ స్థాయికి చేర్చడానికి తన జీవితాన్నే త్యాగం చేశారు. ఆయన బయోపిక్‌గా, స్పోర్ట్స్‌ డ్రామాగా ‘మైదాన్‌’ ముస్తాబవుతోంది. అజయ్‌ దేవగణ్‌, ప్రియమణి, గజ్‌రాజ్‌రావు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని అమిత్‌ శర్మ తెరకెక్కిస్తున్నారు. అనేకసార్లు వాయిదా పడుతూ వస్తున్న సినిమా విడుదల తేదీ ఇంకా స్పష్టంగా ప్రకటించలేదు.


క్విట్‌ ఇండియా నేపథ్యంతో ఏ వతన్‌ మేరే వతన్‌

దర్శకుడు కన్నన్‌ అయ్యర్‌ తెరకెక్కిస్తున్న మరో దేశభక్తి ప్రధాన చిత్రం ‘ఏ వతన్‌ మేరే వతన్‌’. సారా అలీఖాన్‌ ప్రధాన పాత్రధారి. స్వాతంత్రోద్యమ సమయంలో క్విట్‌ ఇండియా ఉద్యమానికి ప్రభావితురాలైన ఒక యువతి తన జీవితాన్ని ఎలా దేశానికి అంకితం చేసిందో ఇందులో చూపించనున్నారు. కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 30న విడుదలవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని