రివ్యూ: త్రీ మంకీస్‌

బుల్లి తెర - వెండితెర‌ రెండూ వేర్వేరు వినోద మాధ్య‌మాలు. కాక‌పోతే వీటిని చూసే ప్రేక్ష‌కులు మాత్రం ఒక్క‌టే. అలాగ‌ని వాళ్ల అభిరుచులూ ఒకేలా ఉంటాయ‌నుకోకూడ‌దు. అందుకే బుల్లితెర‌పై స్టార్లుగా వెలిగిన వాళ్లు, వెండి తెర‌పై రాణించ‌లేక‌పోతుంటారు. కొన్నిసార్లు వెండి తెర‌ని ఏలిన...

Updated : 07 Feb 2020 18:52 IST

చిత్రం: త్రీ మంకీస్‌

నటీనటులు: సుడిగాలి సుధీర్‌, గెటప్‌ శ్రీను, రామ్‌ ప్రసాద్‌, షకలక శంకర్‌, కారుణ్య తదితరులు

సంగీతం: జి.కుమార్‌

సినిమాటోగ్రఫీ: సన్నీ దోమల

ఎడిటర్‌: ఉదయ్‌ కుమార్‌ 

నిర్మాత: నాగేష్‌

దర్శకత్వం: జి.అనిల్‌ కుమార్‌

బ్యానర్‌: ఓరుగల్లు  సినీ క్రియేషన్స్‌

విడుదల తేదీ: 07-02-2020

బుల్లి తెర - వెండితెర‌ రెండూ వేర్వేరు వినోద మాధ్య‌మాలు. కాక‌పోతే వీటిని చూసే ప్రేక్ష‌కులు మాత్రం ఒక్క‌టే. అలాగ‌ని వాళ్ల అభిరుచులూ ఒకేలా ఉంటాయ‌నుకోకూడ‌దు. అందుకే బుల్లితెర‌పై స్టార్లుగా వెలిగిన వాళ్లు, వెండి తెర‌పై రాణించ‌లేక‌పోతుంటారు. కొన్నిసార్లు వెండి తెర‌ని ఏలిన వాళ్లు, బుల్లి తెర‌పై ప్ర‌భావం చూపించ‌లేరు కూడా. ‘జ‌బ‌ర్దస్త్’ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల్ని న‌వ్వించి, పాపుల‌ర్ అయ్యారు సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను, రాంప్ర‌సాద్‌. బుల్లి తెర‌పై వీళ్ల కెమిస్ట్రీ సూప‌ర్ హిట్టు. ఇప్పుడు ఈ ముగ్గురూ క‌లిసి చేసిన సినిమా ‘త్రీ మంకీస్’.  మ‌రి  టీవీ స్టార్లు, వెండి తెర‌పై ఎలాంటి మ్యాజిక్ చేశారు?  ఈ మూడు కోతులు చేసిన విన్యాసాలేంటి?  దాంతో ఏర్ప‌డిన ప‌ర్యావ‌స‌నాలు ఏమిటి?

క‌థేంటంటే..: సంతోష్ (సుడిగాలి సుధీర్‌), ఫ‌ణి (గెట‌ప్ శ్రీ‌ను), ఆనంద్ (రాంప్రసాద్‌).. ఈ ముగ్గురూ చిన్ననాటి స్నేహితులు. క‌లిసి పెరుగుతారు, క‌లిసే బ‌తుకుతుంటారు. అల్ల‌రెక్కువ‌. ముగ్గురూ క‌లిశారంటే... ర‌చ్చ ర‌చ్చ చేస్తుంటారు. అలాంటి ఈ ముగ్గురూ అనుకోకుండా ఓ హత్య కేసులో ఇరుక్కుంటారు. అందులో నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి దారుల‌న్నీ మూసుకుపోతాయి. మ‌రోవైపు ఓ పాప‌ని కాపాడాల్సిన బాధ్య‌త వీళ్ల‌పై ప‌డుతుంది. హత్య కేసులో వీళ్లెలా ఇరుక్కున్నారు?  అస‌లు ఆ హ‌త్య చేసిందెవ‌రు?  పాప‌కీ వీళ్ల‌కూ ఉన్న సంబంధం ఏమిటి?  అనేది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

ఎలా ఉందంటే..: సుధీర్‌, రాంప్ర‌సాద్‌, శ్రీ‌ను.. ఈ ముగ్గురి గురించి, వాళ్ల శైలి గురించీ అంద‌రికీ తెలుసు. వీళ్లు చేసే అల్ల‌రి కూడా ప‌రిచ‌యమే. వాళ్ల నుంచి ప్రేక్ష‌కులు ఏం ఆశిస్తారో ద‌ర్శ‌కుడికి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. అందుకు త‌గ్గ‌ట్టే ఓ స‌ర‌దా క‌థ‌ని ఎంచుకుని, అందులో ఓ క్రైమ్ మిక్స్ చేసి, బ‌ల‌మైన ఎమోష‌న్లు జోడించాల‌నుకున్నాడు. ఈ ముగ్గురిలో ప్రేక్ష‌కులు చూడ‌ని కోణాల్ని కూడా చూపిద్దాం అని ఆశ ప‌డ్డాడు. అయితే కొన్ని చోట్ల మాత్రమే ద‌ర్శ‌కుడు విజ‌యం సాధించాడ‌నిపిస్తుంది.  ముగ్గురు స్నేహితుల్ని చిన్ననాటి ఎపిసోడ్ల ద్వారా చూపిస్తూ సినిమాని ప్రారంభించ‌డం బాగుంది. క‌థ‌ని ఆస‌క్తిగానే మొద‌లెట్టాడు. ముగ్గురి అల్ల‌రి, వాటి చుట్టూ పుట్టే వినోదంతో తొలి స‌న్నివేశాలు స‌ర‌దాగానే సాగుతాయి. అయితే క్ర‌మంగా కథ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ వైపు ప‌రుగెడుతుంది. ముగ్గురు స్నేహితుల్ని ఓ హ‌త్య కేసులో ఇరికించ‌డం మంచి లాక్‌. అయితే.. దాని చుట్టూ వ‌చ్చే స‌న్నివేశాలు మాత్రం అంత ఆస‌క్తిగా సాగ‌వు. ఎప్పుడైతే క‌థ క్రైమ్ జోన‌ర్‌లో ప్ర‌వేశిస్తుందో అక్క‌డ ద‌ర్శ‌కుడు తేలిపోయాడు.

ఎప్పుడైనా థ్రిల్ల‌ర్ జోన‌ర్‌ని న‌డ‌ప‌డం అంత తేలిక కాదు. ప్రేక్ష‌కుడికి క్లూలు అంద‌కుండా చేస్తూ, ఒక్కో ముడినీ బిగిస్తూ, చివ‌రికి అన్ని ముడులూ ఒకేసారి విప్పాలి. అంత మ్యాజిక్ ఈ క‌థ‌, క‌థ‌నాల్లో లేవు. అలాగ‌ని పూర్తిగా ఈ సినిమాని థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలోనూ న‌డ‌ప‌లేదు. ముగ్గురు క‌మెడియ‌న్లు ఉన్నారు, వాళ్ల‌తో కామెడీ చేయించ‌క‌పోతే బాగోద‌ని, మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఆ ప్ర‌య‌త్నం కూడా చేశారు. దాంతో ఈ క‌థ దేనికీ న్యాయం చేయ‌లేక‌పోయింది. ఎమోష‌న్ సీన్లు కూడా అంతంత మాత్రంగానే పండ‌డంతో  ఈ క‌థ ఏ ఉద్దేశంతో మొద‌లైందో, దాన్ని అందుకోలేకుండా పోయింది. అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలతో సినిమా సాగింది త‌ప్ప‌, ఫ‌లితం క‌నిపించ‌లేదు.

ఎవ‌రెలా చేశారంటే..: సుధీర్‌, రాంప్ర‌సాద్‌, శీను.. వీళ్ల కామెడీ టైమింగ్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌ని లేదు. స‌న్నివేశంలో బ‌లం లేన‌ప్పుడు సైతం - అనుభ‌వాన్ని ఉప‌యోగించి న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. దాంతో కొన్ని పంచ్‌లు బాగా పేలాయి. అయితే రిపీటెడ్ స‌న్నివేశాలెక్కువ అవ్వ‌డంతో కొన్ని చోట్ల బోర్ కొట్టించారు. ఎమోష‌న్ సీన్ల‌లోనూ బాగా న‌టించ‌గ‌ల‌ర‌ని నిరూపించే అవ‌కాశం ఈ సినిమాతో ద‌క్కింది. న‌టీన‌టుల ప‌రంగా ఎవ్వ‌రూ, ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ష‌క‌ల‌క శంక‌ర్‌, కారుణ్య చౌద‌రి... వీళ్లంతా ఓకే అనిపిస్తారు. ప‌రిమిత వ‌న‌రుల‌తో తెర‌కెక్కించిన చిత్ర‌మిది. సాంకేతికంగా ఫ‌ర్వాలేద‌నిపిస్తుందంతే. ముగ్గురు హాస్య‌న‌టుల్ని ఒకే సారి వెండితెర‌పై చూడ‌డం ‘జ‌బర్‌ద‌స్త్’ అభిమానుల‌కు న‌చ్చుతుంది. అయితే వాళ్ల‌లోని ప్ర‌తిభ‌ని పూర్తిస్థాయిలో ఆవిష్క‌రించే క‌థ మాత్రం కాదు. కేవ‌లం ఫ‌న్‌పై దృష్టి పెట్టి ఉంటే ఇంకాస్త బాగుండేది.

బ‌లాలు బలహీనతలు
+ అక్క‌డ‌క్క‌డ పేలిన పంచ్‌లు - క‌థ‌, క‌థ‌నం
+ జబర్దస్త్‌ గ్యాంగ్‌ - సాగ‌దీత‌గా అనిపించే సన్నివేశాలు

చివ‌రిగా: కొన్ని పంచ్‌లకే పరిమితమైన ‘త్రీ మంకీస్‌’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని