అకౌంట్స్‌ బ్లాక్‌ చేసిన అనసూయ

నటి, బుల్లితెర ప్రముఖ వ్యాఖ్యత అనసూయ ట్విటర్‌, ఇన్‌స్టాలో ఖాతాల్లో తనని ఫాలో అవుతోన్న పలు అకౌంట్స్‌ను బ్లాక్‌ చేశారు. తాను పెట్టిన ట్విట్లను అపార్థం చేసుకుని.. అనవసరమైన కామెంట్లు చేస్తున్న వారిని దూరం పెట్టాలనే ఆలోచనతో అనసూయ ఈ విధంగా చేశారు... 

Updated : 23 Mar 2020 15:01 IST

కారణమేమిటంటే

హైదరాబాద్‌: నటి, బుల్లితెర ప్రముఖ వ్యాఖ్యాత అనసూయ ట్విటర్‌, ఇన్‌స్టాలో ఖాతాల్లో తనని ఫాలో అవుతోన్న పలు అకౌంట్స్‌ను బ్లాక్‌ చేశారు. తాను పెట్టిన ట్విట్లను అపార్థం చేసుకుని.. అనవసరమైన కామెంట్లు చేస్తున్న వారిని దూరం పెట్టాలనే ఆలోచనతో అనసూయ ఈ విధంగా చేశారు. ఇంతకీ అనసూయ ఈ విధంగా ఎందుకు చేశారంటే.. కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా మార్చి 31వ తేదీ వరకూ రాష్ట్రాన్ని లాక్‌ డౌన్‌ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి పనుల్లేక ఆర్థికంగా ఇబ్బందిపడుతోన్న సామాన్యులకు రూ.1500 ఆర్థికసాయం కింద అందచేయనున్నట్లు కేటీఆర్‌ ఆదివారం సాయంత్రం ట్వీట్‌ చేశారు. దీంతో అనసూయ తన ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ‘సర్‌.. మీరు మరికొన్ని వృత్తులను సైతం పరిశీలించాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మేము కనుక వర్క్‌ చేయకపోతే మాకు ఆదాయం ఉండదు. కానీ ఇంటి అద్దె, కరెంట్‌ బిల్లు, ఈఎంఐలు, ఇలాంటివి కట్టాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులను మీరు పరిశీలించాలని అభ్యర్థిస్తున్నాను’ అని ట్వీట్‌ పెట్టారు. దీంతో పలువురు నెటిజన్లు అనసూయను విపరీతంగా ట్రోల్స్‌ చేశారు. ‘ఎంతో బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉండే మీరే ఇలా మాట్లాడితే.. సామాన్యులు ఏమైపోవాలి’ అని పేర్కొంటూ కామెంట్లు పెట్టారు. అనసూయ సైతం వారందరికీ తనదైన శైలిలో రిప్లై కూడా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో తాజాగా అనసూయ.. ‘అయ్యబాబోయ్‌!! ఏంటి ఇంతమందా!! ఇంత మంది బుర్రలేనివాళ్లా.. ఇంతమంది వితండవాదులా!! ‘మేము’ అంటే ‘నేను’ అని అర్థం చేసుకుని.. ఏంచేస్తాంలేండి.. కామన్స్‌ సెన్స్‌ ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. రాబోయే రోజుల్లో అర్థం చేసుకునేవాళ్ల గురించి నేను భయపడుతున్నా. నిన్నటి నుంచి ట్విటర్‌, ఇన్‌స్టాలో అకౌంట్స్‌ బ్లాక్‌ చేసి చేసి వేళ్లు నొప్పిపుడుతున్నాయంటే నమ్మండి.. తప్పదు కదా.. నా పేజ్‌లో వాళ్ల బుర్రలేనితనం ఏంటి.. నన్ను అర్థం చేసుకోని వాళ్లని నేను అర్థం చేసుకుని.. దూరంగా పెడుతున్నా. గుడ్‌ మార్నింగ్‌.. ఈరోజు నుంచి అయినా నేను అని కాకుండా మనం అని ఆలోచిద్దాం. అన్ని సర్దుకుంటాయ్‌.. ప్రపంచాన్ని మంచిగా మార్చుకుంద్దాం’ అని అనసూయ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని