కరోనా‌: చిన్న కథ చెప్పిన మోహన్‌బాబు

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ నివారణ ప్రస్తుతం మందు లేదు. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో

Updated : 30 Mar 2020 20:09 IST

హైదరాబాద్‌: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ నివారణ ప్రస్తుతం మందు లేదు. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నాయి. సినీ ప్రముఖులు సైతం సామాజిక మాధ్యమాల వేదికగా కరోనా తీవ్రత గురించి చెబుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా మోహన్‌బాబు తన ట్విటర్‌ వేదికగా ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

పెద్దలు చెప్పే మాటలను ప్రతి పౌరుడు గౌరవించాలని మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. ప్రకృతిని, పెద్దల మాటలను విస్మరిస్తే ఎలాంటి వినాశనం జరిగిందో చాలా సంఘటనలు నిదర్శనంగా నిలిచాయని పేర్కొన్న ఆయన.. వాలీ-సుగ్రీవుడు, సీత కథలను గుర్తుచేస్తూ అవగాహన కల్పించారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు రావడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన మోహన్ బాబు.. పెద్దల మాటలను గౌరవించకపోతే పెను ప్రమాదం తప్పదని హెచ్చరించారు. తొందరలోనే కరోనా నుంచి బయటపడేలా భగవంతున్ని ప్రార్థించాలని మోహన్ బాబు ప్రజలను కోరారు. 

వారు గుర్తొచ్చి నిద్ర పట్టడం లేదు: గాయని స్మిత

లాక్ డౌన్ వల్ల ఐదు రోజులు చాలా బాగా గడిచిందని, ఆరో రోజు నుంచి నిరుపేదల గుర్తొచ్చి నిద్రకూడ పట్టడం లేదని ప్రముఖ పాప్ గాయని స్మిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండి సాటి మనిషికి సాయపడాలని స్మిత విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు రానున్న కీలకమైన రోజుల్లో పిల్లలు, పెద్దలంతా పసుపు, తులసి, వాముతో వేడినీళ్లు కాచి తాగాలని సూచించారు. ఏప్రిల్ 14 తర్వాత కరోనా నుంచి విముక్తి కలుగుతుందని భావించవద్దని కొన్ని రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని స్మిత కోరారు. అంతేకాదు ‘2020ని అన్‌ ఇన్‌స్టాల్‌ చేయొచ్చా? ఎందుకంటే ఈ వెర్షన్‌కు వైరస్‌ సోకింది’ అంటూ ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని