National Awards 2023: జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌.. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీళ్లే!

National Awards 2023: భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Updated : 24 Aug 2023 20:21 IST

దిల్లీ: భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను (National Awards 2023) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ ‘పుష్ప: ది రైజ్‌’లో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్‌ (Allu arjun) సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తమ నటి అవార్డును ఈసారి ఇద్దరు పంచుకున్నారు. అలియా భట్‌ (గంగూభాయి కాఠియావాడి), కృతిసనన్‌(మిమి)లకు దక్కాయి. 31 విభాగాల్లో ఫీచర్‌ ఫిల్స్మ్‌కు, 24 విభాగాల్లో నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌కు, 3 విభాగాల్లో రచనా విభాగానికి అవార్డులు ప్రకటించారు. 2021 సంవత్సరానికి 281 ఫీచర్‌ ఫిల్మ్‌లు వివిధ విభాగాల్లో ఈసారి జాతీయ అవార్డుల కోసం స్క్రూటినీకి వచ్చినట్లు జ్యూరీ కమిటీ ప్రకటించింది. ఉత్తమ చిత్ర విమర్శకుడు కేటగిరిలో పురుషోత్తమచార్యులు (తెలుగు)కు అవార్డు దక్కింది.

2021 సంవత్సరానికి గానూ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ (Uppena) ఎంపికైంది. ఇక ఉత్తమ హిందీ చిత్రంగా సర్దార్‌ ఉద్ధమ్‌, ఉత్తమ గుజరాతీ చిత్రం ‘ఛల్లో షో’ (భారత్‌ నుంచి అధికారికంగా ఆస్కార్‌కు వెళ్లింది), ఉత్తమ కన్నడ చిత్రంగా ‘777 చార్లీ’, ఉత్తమ మలయాళీ చిత్రంగా ‘హోమ్‌’ ఎంపికయ్యాయి. హిందీ నుంచి ‘గంగూబాయి కాఠియావాడి’, తెలుగు నుంచి ‘పుష్ప’, ‘ఆర్ఆర్‌ఆర్‌’ అత్యధిక కేటగిరిల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఉత్తమ నటుడు సహా, ఉత్తమ  డ్యాన్స్‌ కొరియోగ్రఫీ (ప్రేమ్‌ రక్షిత్‌), ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ (కింగ్‌ సాలమన్‌- ఆర్ఆర్‌ఆర్‌), ఉత్తమ గేయ రచయిత (చంద్రబోస్‌ -కొండపొలం), ఉత్తమ నేపథ్య గాయకుడు (కాల భైరవ- కొమురం భీముడో), ఉత్తమ సంగీత దర్శకుడు (దేవిశ్రీ ప్రసాద్‌- పాటలు), ఉత్తమ సంగీత దర్శకుడు (ఎం.ఎం.కీరవాణి- నేపథ్యం) అవార్డులు దక్కించుకున్నారు.

జాతీయ అవార్డుల విజేతలు వీరే

  • ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప: ది రైజ్‌)
  • ఉత్తమ నటి: అలియా భట్‌ (గంగూబాయి కాఠియావాడి), కృతిసనన్‌ (మీమీ)
  • ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌ (హిందీ)
  • ఉత్తమ దర్శకుడు: నిఖిల్‌ మహాజన్‌ (గోదావరి -మరాఠీ)
  • ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది కశ్మీర్ ఫైల్స్‌-హిందీ)
  • ఉత్తమ సహాయ నటుడు: పంకజ్‌ త్రిపాఠి (మిమి-హిందీ)
  • ఉత్తమ యాక్షన్‌ డైరక్షన్‌: కింగ్‌ సాలమన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
  • ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్‌రక్షిత్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
  • ఉత్తమ గీత రచన: చంద్రబోస్‌ (కొండపొలం)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే: నాయట్టు (మలయాళం)
  • ఉత్తమ సంభాషణలు, అడాప్టెడ్‌: సంజయ్‌లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి- హిందీ)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: సర్దార్‌ ఉద్దమ్‌ (అవిక్‌ ముఖోపాధ్యాయ)
  • ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయఘోషల్‌ (ఇరివిన్‌ నిజాల్‌ - మాయావా ఛాయావా)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: కాల భైరవ (ఆర్‌ఆర్‌ఆర్‌- కొమురం భీముడో)
  • ఉత్తమ బాల నటుడు: భావిన్‌ రబారి (ఛల్లో షో-గుజరాతీ)
  • ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం :ఆర్‌ఆర్‌ఆర్‌ (రాజమౌళి)
  • ఉత్తమ సంగీతం(పాటలు): దేవిశ్రీ ప్రసాద్‌ (పుష్ప)
  • ఉత్తమ సంగీతం(నేపథ్య): కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్‌)
  • ఉత్తమ మేకప్‌: ప్రీతిశీల్‌ సింగ్‌ డిసౌజా (గంగూబాయి కాఠియావాడి)
  • ఉత్తమ కాస్ట్యూమ్స్‌: వీర్‌ కపూర్‌ (సర్దార్‌ ఉద్దమ్‌)
  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: సర్దార్‌ ఉద్దమ్‌ (దిమిత్రి మలిచ్‌, మన్సి ధ్రువ్ మెహతా)
  • ఉత్తమ ఎడిటింగ్‌: సంజయ్‌ లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి)
  • ఉత్తమస్పెషల్‌ ఎఫెక్ట్స్‌: శ్రీనివాస మోహన్‌ (ఆర్‌ఆర్ఆర్‌)
  • ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్‌ డిజైనింగ్‌): అనీష్‌ బసు (చైవిట్టు-మలమాళం)
  • ఉత్తమ ఆడియోగ్రఫీ (రీరికార్డింగ్‌): సినోయ్‌ జోసెఫ్‌ (ఝిల్లి డిస్కర్డ్స్‌- బెంగాలీ)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని