Janhvi Kapoor: ‘మైదాన్‌’ ఆరేళ్ల కష్టం..మా నాన్నకు సినిమాలంటే అంత ఇష్టం: జాన్వీ కపూర్‌

బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ ‘మైదాన్’ సినిమా ట్రైలర్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

Published : 08 Mar 2024 00:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) హిందీ, తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.  తాజాగా ఆమె తండ్రి బోనీకపూర్‌కు సినిమాలపై ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) ‘మైదాన్‌’(Maidaan) సినిమా ట్రైలర్‌ను పోస్ట్‌ చేశారు. ‘‘ ‘మైదాన్‌’ సినిమా కోసం చిత్ర బృందం ఆరేళ్లు కష్టపడింది. కరోనా సమయంలో సమస్యలు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. ఎందుకంటే కథపై ఉన్న నమ్మకం అటువంటిది. మా నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. ‘ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలంటే సినిమా నిర్మించాలి. కానీ అది చిన్నవిషయం కాదు. అందులో రిస్క్‌ ఉంటుంది. సినిమా హిట్‌ అయినా కాకున్నా మంచి అనుభవాన్ని మాత్రం ఇస్తుంది. నిర్మాతగా ఆడియన్స్‌కు మంచి సినిమాలు అందించాలి. అందులోనే నాకు ఆనందం ఉంది. అందుకే ఎన్ని సమస్యలు ఎదురైనా ‘మైదాన్‌’ నిర్మించాను’ అని తెలిపారు. ప్రస్తుతం మైదాన్‌ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. మంచి సినిమా చూశామన్న భావన కలుగుతుంది. సినిమా విజయం సాదించాలని ఆశిస్తున్నా’’ అని జాన్వీ కపూర్‌ పేర్కొన్నారు. 

భారత్‌ ప్రముఖ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం ‘మైదాన్‌’. అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో అమిత్‌ శర్మ రూపొందించారు. జీ స్టూడియోస్‌, బోనీకపూర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

మరోవైపు జాన్వీకపూర్‌ ఎన్టీఆర్‌ ‘దేవర’లో నటిస్తున్నారు.  సముద్రతీరం నేపథ్యంలో సాగే ఈ యాక్షన్‌ డ్రామాను కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. సైఫ్ అలీఖాన్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. దీనితో పాటు రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబినేషన్‌లో రానున్న చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా తెలిపింది. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని