కాజోల్‌ అన్న మాటలకు షారుఖ్‌ అహం దెబ్బతింది.. భుజం పట్టేసింది

Dilwale Dulhania Le Jayenge: షారుఖ్‌ఖాన్‌, కాజోల్‌ జంటగా నటించిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ చిత్రీకరణ సందర్భంగా జరిగిన ఆసక్తికర సంఘటనను కాజోల్‌ పంచుకున్నారు.

Published : 01 Aug 2023 16:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: షారుఖ్‌ఖాన్‌ (Shah Rukh Khan), కాజోల్‌ (Kajol) జంటగా నటించిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ (డీడీఎల్‌జే) (Dilwale Dulhania Le Jayenge) బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌లో వచ్చిన క్లాసిక్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇక డీడీఎల్‌జే అంటే మన కళ్ల ముందు మెదిలే వాటిల్లో కాజోల్‌ను షారుఖ్‌ తన భుజంపై ఎత్తుకున్న ఫొటో ఒకటి. ఈ ఫొటో షూట్‌ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. తాను షారుఖ్‌తో అన్నమాటలకు అతని అహం దెబ్బతిని, తనని అలాగే భుజంపై మోయడంతో అది కాస్తా పట్టేసిందని ఇటీవల కాజోల్‌ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

‘‘సినిమా స్టిల్స్‌ తీసే క్రమంలో ఒక ఫొటో కోసం నన్ను షారుఖ్‌ ఎత్తుకుని తన భుజంపై వేసుకోవాలి. ఒకరిని ఒకరు చూస్తూ నవ్వుతూ ఫొటో దిగాలి. అసలు నన్ను ఎలా ఎత్తుకుని భుజంపై వేసుకుంటాడా? అనిపించింది. షారుఖ్‌ను ఇదే విషయం అడిగాను. ‘నువ్వు నన్ను ఎత్తుకోగలవా’ అని అడిగా, ‘ఏం భయం లేదు. నేను చాలా బలంగా ఉన్నా’ అని సమాధానం ఇచ్చాడు. ‘నన్ను చాలా సేపు భుజంపై మోయాలి’ అన్నాను. నేను పదే పదే ఈ ఇలాగే అడుగుతుండటంతో అతనికి చిరాకు వచ్చింది. నేను అన్న మాటలకు ఒక పురుషుడిగా అతని అహం దెబ్బతిన్నది. ‘పదే పదే అదే విషయాన్ని నాతో ఎందుకు చెబుతున్నావ్‌. నేను అబ్బాయిని’ అని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా నన్ను భుజంపై వేసుకుని ఫొటో దిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి షారుఖ్‌ భుజం పట్టేసింది’’ అని కాజోల్‌ నవ్వుతూ చెప్పుకొచ్చింది.

ఆదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ 1995లో విడుదలై సంచలన విజయం సాధించింది. అటు షారుఖ్‌, ఇటు కాజోల్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే విజయాన్ని అందించింది. భారతీయ సినీ చరిత్రలో అత్యధికకాలం ప్రదర్శితమైన చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఆ తర్వాత షారుఖ్‌, కాజోల్‌ కలిసి, ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’, ‘కభీ ఖుషి కబీ గమ్‌’, ‘మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌’, ‘దిల్‌వాలే’ చిత్రాల్లో నటించారు. డీడీఎల్‌జే విడుదలై 27ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీమేక్‌పై షారుఖ్‌ స్పందిస్తూ ‘అదొక ప్రత్యేక చిత్రం’ అన్నారు. ‘ఆ సినిమా చేసే సమయంలో మాతో సహా ఆదిత్య చోప్రా, కరణ్‌ జోహార్‌ అందరం యువకులం. నేను ఇప్పటికీ యువకుడినే అనుకోండి. మీరు తీయాలనుకుంటే ‘దిల్‌వాలే దుల్హనియా ఫిర్‌సే లేజాయేంగే’ తీయొచ్చు’’ అని సమాధానం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని