Kanulu Therichinaa Kanulu Moosinaa review: రివ్యూ: కనులు తెరిచినా కనులు మూసినా

Kanulu Therichinaa Kanulu Moosinaa review: సాయి రోనక్‌ (Sai Ronak), దేవికా సతీశ్‌ (Devika Satheesh) జంటగా దర్శకుడు సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం.. ‘కనులు తెరిచినా కనులు మూసినా’. ఈ మూవీ స్టోరీ ఏంటి? ఎలా ఉందంటే?

Published : 16 Jun 2023 20:25 IST

Kanulu Therichinaa Kanulu Moosinaa: చిత్రం: కనులు తెరిచినా కనులు మూసినా; నటీనటులు: సాయి రోనక్‌, దేవికా సతీశ్‌, అనీశ్‌ కురువిల్లా, అర్జున్‌ ఆనంద్‌, ఉషాశ్రీ తదితరులు; మ్యూజిక్‌: గౌర హరి; ఎడిటింగ్‌: శశాంక్‌ మాలి; సినిమాటోగ్రఫీ: దాము నర్రావుల; ప్రొడ్యూసర్‌: ఎస్‌.ఎన్‌. స్వామి; డైరెక్టర్‌: సందీప్‌ రెడ్డి కట్కూరి; విడుదల: ‘ఈటీవీ విన్‌’ యాప్‌ (16-06-2023).

రూ.1కే 24 గంటల వినోదమంటూ ‘ఈటీవీ విన్‌’ యాప్‌ (ETV Win).. పలు కార్యక్రమాలు, సీరియల్స్‌లతోపాటు నెలకొక కొత్త సినిమాని విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. అలా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం.. కనులు తెరిచినా కనులు మూసినా. సాయి రోనక్‌ (Sai Ronak), దేవికా సతీశ్‌ (Devika Satheesh) జంటగా దర్శకుడు సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ స్టోరీ ఏంటి? ఎలా ఉందంటే? ఈ రివ్యూ చదివేయండి (anulu Therichinaa Kanulu Moosinaa Review).

ఇదీ స్టోరీ: పునీత్‌ (సాయి రోనక్‌) ఓ రాక్‌స్టార్‌. పెళ్లి సంబంధాల విషయంలో తండ్రితో గొడవపడి ఇంటిని వదిలేసి వెళ్లిపోతాడు. తన కలల రాణి ఎలా ఉండాలనుకుంటాడో ఆ లక్షణాలున్న అమ్మాయి అదితి (దేవికా శర్మ)ని ఓ పార్టీలో చూస్తాడు. పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. ఓరోజు అదితి కిడ్నాప్‌కాగా ఆమె స్నేహితుడు హర్ష రక్షిస్తాడు. హర్ష రాకతో పునీత్‌ జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది?హర్షని ఏం చేశాడు? అదితితో తన బంధాన్ని మునుపటిలానే కొనసాగించాడా, లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే (anulu Therichinaa Kanulu Moosinaa Review).

ఎలా ఉందంటే: తెరపై చూసే కొన్ని కథలు ఎప్పుడో విన్నట్టో, ఎక్కడ చూసినట్టో అనిపిస్తుంటాయి. ఈ సినిమా విషయంలోనూ అదే జరుగుతుంది. అయితే, పాత కథే అయినా ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు సందీప్‌ రెడ్డి మంచి మార్కులే కొట్టేశారు. సూపర్‌హిట్‌ పాటను టైటిల్‌గా పెట్టి, స్టోరీనీ ఆకట్టుకునేలా చెప్పారు. తండ్రి మాట కాదని హీరో ఇంటి నుంచి వెళ్లిపోవడం, హీరోయిన్‌తో పరిచయం పెంచుకోవడం, రాక్‌స్టార్‌గా పలు ప్రముఖ సంస్థల నుంచి అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నాలు చేయడం, ఊహించని విధంగా హర్ష పాత్ర ఎంట్రీ ఇవ్వడం తదితర సన్నివేశాలతో ప్రథమార్ధం సాగింది. హీరో క్లోజ్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ కడుపుబ్బా నవ్విస్తుంది. హీరో, అతడి బ్యాచ్‌ మధ్య వచ్చే సరదా సన్నివేశాలు ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ తదితర సినిమాల్లోని సీన్లను గుర్తుచేస్తాయి. కొంచెం కామెడీ, కొంచెం రొమాంటిక్‌గా సాగిపోతోందనకున్న ప్రేక్షకుడికి ద్వితీయార్ధంలో మంచి ట్విస్ట్‌ ఎదురవుతుంది. అసలు కథ అప్పుడే మొదలవుతుంది (anulu Therichinaa Kanulu Moosinaa Review).

ఇద్దరి ప్రేమికుల మధ్యలోకి మూడో వ్యక్తి ప్రవేశిస్తే ఏం జరుగుతుందో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూశాం. ఇందులోనూ అదే తరహా సన్నివేశాలు కనిపిస్తాయి. ఇవి కాస్త సాగదీతగా అనిపిస్తాయి. అయితే, హీరో బాధపడడంలో తప్పులేదనే విధంగా హీరోయిన్‌ క్యారెక్టర్‌ని నెగెటివ్‌గా చూపిస్తూ.. మరోవైపు పాజిటివ్‌గా చూపించడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. హీరో వ్యక్తిగత సమస్యని వివరించేందుకు అల్లుకున్న పలు సన్నివేశాల్లో స్పష్టత లోపించింది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. సినిమా చూస్తున్నంత సేపూ ఈ పాత్రలన్నీ మన నిజ జీవితంలో చుట్టూ చూస్తున్నవే కదా అనిపించేంత సహజంగా తీర్చిదిద్దారు. భార్యాభర్తల మధ్యగానీ, ప్రేమికుల మధ్యగానీ ఏదైనా సమస్య వస్తే.. ఆ ఇద్దరూ కలిసి సమస్యపై పోరాడాలి తప్ప ఒకరితో ఒకరు పోట్లాడుకోకూడదు అనే సందేశాన్ని ఇచ్చారు. సీక్వెల్‌ తీసే విధంగా క్లైమాక్స్‌ సీన్‌ని సెట్‌ చేశారు (anulu Therichinaa Kanulu Moosinaa Review).

ఎవరెలా చేశారంటే: రాక్‌స్టార్‌గా, ప్రేమికుడిగా సాయి రోనక్‌ అలరిస్తాడు. సంభాషణలు స్పష్టంగా పలకడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. దేవికా సతీశ్‌ తన అందంతో ఆకట్టుకుంది. అనీశ్‌ కురువిల్లా పాత్ర నిడివి తక్కువే ఉన్నా తండ్రిగా ఒదిగిపోయారు. ఇతరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్‌ విషయంలో ఇంకొంత శ్రద్ధ తీసుకోవాల్సింది. తొలి ప్రయత్నమే అయినా సందీప్‌ రెడ్డి అనువజ్ఞుడిలా తెరకెక్కించారు (anulu Therichinaa Kanulu Moosinaa Review).

  • బలాలు:
  • + హీరో పాత్ర తీర్చిదిద్దిన విధానం
  • + ద్వితీయార్ధంలో వచ్చే ట్విస్ట్‌
  • బలహీనతలు:
  • - కొన్ని సన్నివేశాల్లో స్పష్టత లోపించడం
  • - నెమ్మదిగా సాగే కథనం
  • చివరిగా: ‘కనులు తెరిచినా కనులు మూసినా’.. తెలిసిన కథే అయినా.. కొత్తగా ఉంటుంది.
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు