Kiran Rao: ‘యానిమల్‌’ సినిమా చూడాలనుకుంటున్నా: కిరణ్‌రావ్‌

ఆమిర్‌ఖాన్‌ మాజీ భార్య కిరణ్‌రావ్‌ ‘యానిమల్‌’ సినిమా చూడాలనుకుంటున్నట్లు తెలిపారు.

Published : 13 Mar 2024 18:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ‘యానిమల్‌’ (Animal) మంచి విజయాన్ని అందుకుంది. దీనిని సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించారు. త్వరలోనే దీనికి సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ రానుంది. ఈ సినిమాపై గతంలో ఆమిర్‌ ఖాన్‌ మాజీ భార్య కిరణ్‌ రావ్‌ (Kiran Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రం గురించి మాట్లాడారు. ‘‘కబీర్‌సింగ్‌’, ‘యానిమల్‌’ స్త్రీలపై ద్వేషం, వేధింపులు ప్రోత్సహించేలా ఉందని విమర్శించాను. కేవలం ఇది సందీప్‌రెడ్డి సినిమా అని నేను  ఆ వ్యాఖ్యలు చేయలేదు. స్త్రీలను ద్వేషించే వారికి వ్యతిరేకంగా ఇదివరకే మాట్లాడాను. స్త్రీలపై ద్వేషాన్ని పెంచే సినిమాలు ఎవరు చేసినా విమర్శిస్తాను. ఇప్పుడు నేను ఈ సినిమా చూడాలనుకుంటున్నా. ఎందుకంటే ప్రేక్షకులు యాక్షన్‌ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందరూ మెచ్చే సన్నివేశాలు అందులో ఏం ఉన్నాయో తెలుసుకోవాలని ఉంది. అప్పుడే ఆడియన్స్‌కు నచ్చేలా సినిమాలు రూపొందించగలను. సందీప్‌ రెడ్డి వంగా ఈ సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దారని విన్నాను. రణ్‌బీర్‌ అద్భుతమైన నటుడు’’ అని కిరణ్ రావ్‌ వెల్లడించారు. 

కిరణ్‌రావ్‌ దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్‌’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఆమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌, జియో స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా మంచి ఆదరణ పొందినందుకు ఆనందంగా ఉందని కిరణ్‌ రావ్‌ పేర్కొన్నారు. ఈ సినిమా తనను ఎంతగానో కదిలించిందంటూ కథానాయిక జెనీలియా దేశ్‌ముఖ్‌ ప్రశంసలు కురిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని