Cinema News: సంక్షిప్త వార్తలు

నరసింహ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అమ్మాయిలు అర్థం కారు’. అల్లం శ్రీకాంత్‌, ప్రశాంత్‌, కమల్‌, మీరావలి కథానాయకులుగా నటించారు.

Updated : 14 Dec 2022 07:51 IST

జీవితాల్ని తారుమారుచేసే డబ్బు

నరసింహ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అమ్మాయిలు అర్థం కారు’ (Ammayilu Ardham Karu). అల్లం శ్రీకాంత్‌, ప్రశాంత్‌, కమల్‌, మీరావలి కథానాయకులుగా నటించారు. సాయిదివ్య, ప్రియాంక, స్వాతి, శ్రావణి కథానాయికలు. నందిరెడ్డి విజయలక్ష్మిరెడ్డి, కర్ర వెంకటసుబ్బయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ, బసిరెడ్డి, ప్రసన్నకుమార్‌, మేడికొండ వెంకట మురళీకృష్ణ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘‘మధ్య తరగతి జీవితాల్లో డబ్బు ఎలాంటి పాత్ర పోషిస్తుందో, దాంతో జీవితాలు ఎలా తారుమారవుతాయో ఇందులో చర్చించాం’’ అన్నారు దర్శకుడు.


‘అవతార్‌2’కి అవసరాల మాటలు

జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి ‘అవతార్‌’. ఆ చిత్రానికి సీక్వెల్‌గా 13 ఏళ్ల తర్వాత ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ (Avatar 2) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో సిద్ధమైన ఈ చిత్రం ఈ నెల 16న తెలుగులోనూ విడుదలవుతోంది. తెలుగు సినిమాకి ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల (Srinivas Avasarala)  మాటలు రాశారు.


శాసనసభతో కల నెరవేరింది

‘‘ఈ శుక్రవారం ‘అవతార్‌2’తో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంటుంది. ఆ పండగలో నా సినిమా కూడా భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు ఇంద్రసేన. ‘కిక్‌2’, ‘ధృవ’, ‘సైరా నరసింహారెడ్డి’ తదితర చిత్రాల్లో కీలకపాత్రలు పోషించిన ఆయన కథానాయకుడిగా ‘శాసనసభ’ (Sasanasabha) తెరకెక్కింది. వేణు మడికంటి దర్శకత్వం వహించారు. పాన్‌ ఇండియా స్థాయిలో పలు భాషల్లో ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇంద్రసేన మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘పన్నెండేళ్లుగా పరిశ్రమలో కొనసాగుతూ... కొన్ని చిత్రాల్లో కీలకమైన పాత్రలు చేస్తూ వచ్చా. ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు నాలుగు రోజులైనా సరే, సంభాషణ చెప్పే అవకాశం రాలేదు. అప్పుడే హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదల ఏర్పడింది. ఆ సందర్భంలోనే నన్ను ఎప్పట్నుంచో గమనిస్తున్న మిత్రుడు రాఘవేందర్‌రెడ్డి కలిసి తను సిద్ధం చేసిన ‘శాసనసభ’ కథ వినిపించారు. నాకు చాలా బాగా నచ్చింది. కథ విని నా మిత్రుడు షణ్ముగం ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఓ యువకుడు సంధించిన ప్రశ్నే ఈ చిత్రం’’.

* ‘‘దర్శకుడు సురేందర్‌ రెడ్డి నన్ను ప్రోత్సహించి పలు చిత్రాల్లో అవకాశాలు ఇచ్చారు. ఆయన దర్శకత్వం వహించిన ‘సైరా నరసింహారెడ్డి’లో యుద్ధ వీరుడిగా కనిపిస్తా. భవిష్యత్తులో నాకు యాక్షన్‌ హీరోగానే అవకాశాలు వస్తాయి. అంతగా ఈ సినిమా ప్రభావితం చేస్తుంది. రాజేంద్రప్రసాద్‌, సోనియా అగర్వాల్‌ తదితరులతో కలిసి నటించడం గొప్ప అనుభవం. నేను కన్న కల నెరవేరిన అనుభూతి కలిగింది.’’.


సుందరాంగుడి సెల్ఫీ

పాత్రను బట్టి ఆ గెటప్‌లోకి ఇట్టే మారిపోతారు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar). నిత్యం షూటింగులతో బిజీగా ఉండే ఆయన ఐదారు చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా ‘సెల్ఫీ’ సినిమా సెట్లో సందడి చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఆ పాటకు సంబంధించిన ఓ ఫొటోను పంచుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించారు అక్షయ్‌. ఆ ఫొటో చూసి నెటిజన్లు అక్షయ్‌ చాలా అందంగా ఉన్నారని, రొమాంటిక్‌ హీరో అని, సెల్ఫీ సుందర్‌ అని ఇలా రకరకాలుగా స్పందించారు. మలయాళ చిత్రం ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’కు ఇది హిందీ రీమేక్‌ ఇది. ఇమ్రాన్‌ హష్మీ మరో కీలక పాత్రలో నటిస్తోన్న రాజ్‌ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


టింగిల్‌ మింగిల్‌ అని పెట్టండి

తన భర్త రణ్‌బీర్‌కపూర్‌ నటిస్తున్న సినిమాకు ఓ కొత్త పేరు సూచించింది అలియాభట్‌ (Alia Bhatt). రణ్‌బీర్‌ కపూర్‌, శ్రద్ధాకపూర్‌ జంటగా లవ్‌ రంజన్‌ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా పేరుకు సంబంధించిన ‘టీజేఎమ్‌ఎమ్‌’ అంటూ నాలుగు అక్షరాలతో ఓ టైటిల్‌ను పెట్టింది చిత్రబృందం. దీన్నిబట్టి అసలు సినిమా పేరేంటో ఊహించండి అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. వాళ్లతో పాటు అలియా కూడా ఓ పేరుని సూచించింది. ‘టింగిల్‌ జింగిల్‌ మింగిల్‌ మింగిల్‌’ అని పెట్టండి రాసింది. అలియా ఫన్నీ కామెంట్‌పై కూడా నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆటపట్టించడం కాకపోతే సినిమా పేరేంటో అలియాకు చెప్పకుండా ఉంటాడా రణ్‌బీర్‌ పోస్టులు పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని