Mohan Raja: తమిళ దర్శకుడిగా వచ్చా.. ఆనందంతో వెళ్తున్నా: మోహన్‌రాజా

‘గాడ్‌ఫాదర్‌’కు సూపర్‌హిట్‌ అందించిన తెలుగు ప్రేక్షకులకు దర్శకుడు మోహన్‌రాజా ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు.

Published : 14 Oct 2022 15:28 IST

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవితో (Chiranjeevi) ‘గాడ్‌ఫాదర్‌’ (Godfather) తెరకెక్కించి సూపర్‌హిట్‌ అందుకున్నారు దర్శకుడు మోహన్‌రాజా (MohanRaja). సినిమా పూర్తైన నాటి నుంచి ప్రమోషన్స్‌, ఇంటర్వ్యూలు, సక్సెస్‌ మీట్‌లతో ఫుల్‌ బిజీగా ఉన్న ఆయన తాజాగా తిరిగి తన సొంతూరుకు వెళ్లారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

‘‘గాడ్‌ఫాదర్‌’ పనులన్నింటినీ ముగించుకుని చెన్నైకు వెళ్తున్నా. ఈ ప్రయాణం నాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే, సుమారు రెండేళ్ల క్రితం ఒక తమిళ దర్శకుడిగా ఇక్కడికి వచ్చాను. కానీ ఈరోజు ఎయిర్‌పోర్ట్‌లో ప్రతిఒక్కరూ నన్ను గుర్తుపట్టి, అభినందిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. త్వరలో మళ్లీ వస్తా’’ అని ఆయన పేర్కొన్నారు.

ప్రముఖ ఎడిటర్‌ మోహన్‌ కుమారుడిగా మోహన్‌రాజా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘హనుమాన్‌ జంక్షన్‌’తో దర్శకుడిగా తొలి అడుగులు వేశారు. అనంతరం తెలుగులో సూపర్‌హిట్‌ అందుకున్న ‘జయం’, ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలను తమిళంలోకి రీమేక్‌ చేసి.. రీమేక్‌ కింగ్‌గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘గాడ్‌ఫాదర్‌’తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని