Cinema News: ‘కెప్టెన్‌ మిల్లర్‌’.. వస్తున్నాడు

ఈ ఏడాది ‘సార్‌’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించారు కథానాయకుడు ధనుష్‌. ఇప్పుడీ జోష్‌లోనే కొత్త ఏడాదిలో ‘కెప్టెన్‌ మిల్లర్‌’గా యాక్షన్‌ హంగామా రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

Updated : 31 Dec 2023 12:16 IST

ఏడాది ‘సార్‌’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించారు కథానాయకుడు ధనుష్‌. ఇప్పుడీ జోష్‌లోనే కొత్త ఏడాదిలో ‘కెప్టెన్‌ మిల్లర్‌’గా యాక్షన్‌ హంగామా రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు. అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని జి.శరవణన్‌, సాయి సిద్ధార్థ్‌ సంయుక్తంగా నిర్మించారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ కథానాయిక. శివ రాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా సెన్సార్‌ పనులు పూర్తయినట్లు తెలియజేసింది.


యథార్థ సంఘటనల స్ఫూర్తితో..

గాయని సునీత తనయుడు ఆకాశ్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. దర్శకుడు కె.రాఘవేంద్రరావు నిర్మించిన ఈ సినిమాని గంగనమోని శేఖర్‌ తెరకెక్కించారు. భావన కథానాయిక. ఈ సినిమా జనవరి 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో శనివారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో ఆకాశ్‌ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌కు ఈ చిత్రం తొలి అడుగు. ఇందులో నేను ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తాను. సమాజానికి మంచి చేయాలనే తాపత్రయం ఓవైపు.. కుటుంబం, స్నేహితుల నుంచి ఎదుర్కొనే సంఘర్షణ మరోవైపు నా పాత్రకు అన్ని ఎమోషన్స్‌ తీసుకొస్తాయి. మా ప్రయత్నాన్ని ఆదరించి ఆశీర్వదిస్తారి ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘బలమైన కథతో రూపొందించిన చిత్రమిది. యథార్థ సంఘటనల స్ఫూర్తితో.. 90వ దశకం నేపథ్యంలో దీన్ని తెరకెక్కించాం. సందేశం, వినోదం రెండు కలిసి ఉన్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు దర్శకుడు శేఖర్‌. ఈ కార్యక్రమంలో భావన, మధులత, మహాదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.


25మంది కొత్త నటుల పరిచయం

హీరో విష్వక్‌ సేన్‌ కొత్త కబురు వినిపించారు. తన సొంత కథతో ‘#కల్ట్‌’ పేరుతో ఓ చిత్రం నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాతో తాజుద్దీన్‌ దర్శకుడిగా తెరకు పరిచయం కానున్నారు. ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌ను హైదరాబాద్‌లో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో విష్వక్‌ సేన్‌ మాట్లాడుతూ.. ‘‘వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఈ కథని రాశాను. ఇది వినోదాత్మకంగా ఉంటూనే మంచి సందేశమిస్తుంది. ఈ చిత్రంతో తాజుద్దీన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నా. నేను ముంబయి యాక్టింగ్‌ స్కూల్‌కు వెళ్లకముందు తనే నాకు నటన నేర్పించారు. ఈ చిత్రం ద్వారా 25మంది కొత్త నటీనటుల్ని తెరకు పరిచయం చేయనున్నాం’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు