ntr: చిరకాలం గుర్తుండే నాయకుడు ఎన్టీఆర్‌

‘‘తెలుగు సినిమా రంగంపై ఎన్టీఆర్‌ వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది. ఆయన రాజకీయ రంగంలోనూ చిరకాలం గుర్తుండిపోయే నాయకుడు.

Updated : 19 Jan 2024 09:31 IST

‘‘తెలుగు సినిమా రంగంపై ఎన్టీఆర్‌ వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది. ఆయన రాజకీయ రంగంలోనూ చిరకాలం గుర్తుండిపోయే నాయకుడు. ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్ని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులూ కొనసాగించారు. అలా అన్ని రంగాల్లో స్ఫూర్తిని నింపి  తెలుగు జాతి అభివృద్ధికి బాటలు వేశార’’న్నారు ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు. ఆయన గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఎన్టీఆర్‌ 28వ వర్ధంతి, ‘మనదేశం’ 75ఏళ్ల విజయోత్సవ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్‌ సెంటీనరీ సెలబ్రేషన్స్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ తొలి చిత్రమైన ‘మనదేశం’ నిర్మాత కృష్ణవేణి, ఆ చిత్ర దర్శకుడైన ఎల్వీ ప్రసాద్‌ తనయుడు రమేశ్‌ ప్రసాద్‌, పూర్ణా పిక్చర్స్‌ అధినేత విశ్వనాథ్‌లను ఈ   వేదికపై సత్కరించారు. ఈ సందర్భంగా సెలబ్రేషన్స్‌ కమిటీ ఛైర్మన్‌ జనార్దన్‌ మాట్లాడుతూ ‘‘ఎంతోమంది నాయకులు వస్తారు, వెళతారు. కానీ ప్రజలకి సేవ చేసినవాళ్లే చిరకాలం గుర్తుంటారు. అలాంటి గొప్ప నాయకుడు ఎన్టీఆర్‌. 40ఏళ్ల తర్వాత దేశానికి ఎలాంటి అవసరాలు ఉంటాయో ముందే ఊహించి చెప్పిన గొప్ప దూరదృష్టి గల నేత ఆయన’’ అన్నారు. ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ ‘‘వజ్రాన్ని కూడా సానబట్టాలి. అలా ఎన్టీఆర్‌కు ‘మనదేశం’ సినిమాలో అవకాశం ఇచ్చి, ఆయనలోని నటుడికి మెరుగులు దిద్దిన గొప్ప దర్శకనిర్మాతలు ఎల్వీ ప్రసాద్‌, కృష్ణవేణి. వారికి మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంద’’న్నారు. ‘‘ఎన్టీఆర్‌ని మేం పరిచయం చేయడం ఎంతో గర్వంగా ఉంది. మేం నిర్మించిన ‘మనదేశం’ 75ఏళ్ల విజయోత్సవ వేడుకని నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు కృష్ణవేణి. ఈ కార్యక్రమంలో టి.ప్రసన్నకుమార్‌, హైదరాబాద్‌ మింట్‌ అధికారి శ్రీనివాస్‌, భగీరథ, దొప్పలపూడి రామమోహనరావు, అట్లూరి  నారాయణరావు, విక్రమ్‌ పూల, మండవ సతీశ్‌, శ్రీపతి సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని