Prithviraj Sukumaran: కుటుంబ సభ్యులు ఆందోళన చెందినా అర్థం చేసుకున్నారు

విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. ఇప్పుడాయన ‘ది గోట్‌ లైఫ్‌’ (ఆడు జీవితం) అనే మరో ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు.

Updated : 27 Mar 2024 11:30 IST

వైవిధ్యభరితమైన పాత్రలకు.. విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. ఇప్పుడాయన ‘ది గోట్‌ లైఫ్‌’ (ఆడు జీవితం) అనే మరో ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రంతో పృథ్వీరాజ్‌ 16ఏళ్లు సుదీర్ఘ ప్రయాణం చేయడం విశేషం. దీనికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే పృథ్వీరాజ్‌ ఈ చిత్ర విశేషాల్ని మీడియాతో పంచుకున్నారు.

16 ఏళ్ల ప్రయాణామిది

 ‘‘ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించే ఆసక్తికర సర్వైవల్‌ థ్రిల్లర్‌ ఇది. దీంట్లో నేను ‘సలార్‌’కు పూర్తి భిన్నమైన పాత్ర చేశాను. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన నజీబ్‌ అనే వ్యక్తి జీవిత కథ ఈ చిత్రానికి ఆధారం. 16ఏళ్ల క్రితం ఈ చిత్రంతో నా ప్రయాణం మొదలైంది’’.

సవాళ్లతో సాగిన చిత్రీకరణ

‘‘ఈ సినిమా చిత్రీకరణను 2018లో ప్రారంభించాం. తొలుత దీన్ని రాజస్థాన్‌ ఎడారిలో షూట్‌ చేయాలని అనుకున్నాం. కానీ, అక్కడ అరబ్‌ దేశాల వాతావరణం కనిపించలేదు. దాంతో జోర్డాన్‌ వెళ్లి చిత్రీకరణ జరిపాం. సరిగ్గా ఆ సమయంలోనే లాక్‌డౌన్‌ వచ్చింది. అప్పుటికి మేమంతా జోర్డాన్‌లోనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు ఆపేయడంతో అక్కడి నుంచి బయట పడటానికి వీలు లేకుండా పోయింది. దీంతో అందరం రెండు నెలల పాటు అక్కడే గడపాల్సి వచ్చింది. ఏడాదిన్నర తర్వాత అల్జీరియా సహారా ఎడారిలో చిత్రీకరణ తిరిగి ప్రారంభించాం. ఇలా ఆద్యంతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అరుదైన ప్రదేశాల్లో దీని చిత్రీకరణను పూర్తి చేశాం. ఈ చిత్రం కోసం మేము చేసిన సుదీర్ఘ ప్రయాణంలో మమ్మల్ని నడిపించిన గొప్ప విషయం మేమొక గొప్ప సినిమా చేస్తున్నామనే నమ్మకమే’’.

ఆ ఎడారి కష్టాలను ఊహించుకుంటూ పాత్రలోకి!

‘‘ఈ సినిమా ఒప్పుకున్నప్పుడే దీనికోసం చాలా కష్టపడాలని, సుదీర్ఘ సమయం వెచ్చించాల్సి వస్తుంది నాకు తెలుసు. ఈ చిత్రం కోసం నజీబ్‌ పాత్రలా మారేందుకు నేను ఎన్నోరోజుల పాటు కఠినమైన ఆహార నియమాలు పాటించి 31కిలోల బరువు తగ్గాను. ఇలా బరువు తగ్గే క్రమంలో నా ఆరోగ్యం గురించి మా కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందారు. నా భార్య, పాప సినిమా కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని అర్థం చేసుకొని అండగా నిలిచారు. చిత్రీకరణ ఆద్యంతం నజీబ్‌ ఎడారిలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొని ఉంటాడని ఊహించుకుంటూ ఈ పాత్రలో లీనమయ్యా. తప్పకుండా నా పాత్ర శరీరాకృతి ద్వారా ప్రేక్షకులు ఆ కథను, పాత్రను అనుభూతి చెందుతారు’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని