Ooru Peru Bhairavakona: అలాంటి తప్పులు రిపీట్‌కాకుండా ప్రయత్నిస్తున్నాం: నిర్మాత అనిల్‌ సుంకర

సందీప్‌ కిషన్‌ హీరోగా దర్శకుడు వి.ఐ. ఆనంద్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ని నిర్మాత అనిల్‌ సుంకర పంచుకున్నారు.

Published : 17 Oct 2023 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మేం కొన్ని భారీ తప్పులు చేశాం. ఇకపై అలాంటివి జరగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ప్రముఖ నిర్మాత అనిల్‌ సుంకర (Anil Sunkara) తెలిపారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాకు సంబంధించి దర్శకుడు వి.ఐ. ఆనంద్‌ పెట్టిన పోస్ట్‌పై ఆయన స్పందించారు. సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) హీరోగా ఆనంద్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి (Ooru Peru Bhairavakona) అనిల్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. రాజేశ్‌ దండా నిర్మాత. ఇంతకీ దర్శకుడు ఏమన్నారంటే.. ‘‘ఏ విధంగాను ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాకు ‘విరూపాక్ష’తో సంబంధం ఉండదు. నేపథ్యం ఒక్కటైనంత మాత్రాన కథలు ఒకేలా ఉండవు. వీఎఫ్‌ఎక్స్‌ విషయంలో మేం రాజీపడట్లేదు. ఆ పనులు కొలిక్కి వచ్చాక విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని తెలిపారు. ఈ సినిమా నేపథ్యం, విడుదల తేదీ తదితర వాటిపై రూమర్స్‌ రాగా ఆయన స్పష్టతనిచ్చారు. 

దర్శకుడు పోస్ట్‌ను రీట్వీట్‌ చేసిన అనిల్‌ సుంకర.. గతంలో జరిగిన తప్పులు రిపీట్‌కాకుండా చూస్తున్నామన్నారు. ‘ఊరు పేరు భైరవకోన’లాంటి చిత్రాలకు వీఎఫ్‌ఎక్స్‌ ప్రాధాన్యమని, దానికి సమయం పడుతుందని పేర్కొన్నారు. సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రెండో పాట విడుదల తేదీ వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు. అఖిల్‌ అక్కినేని ‘ఏజెంట్‌’ (Agent), చిరంజీవి ‘భోళా శంకర్‌’ (Bhola Shankar) సినిమాలతో అనిల్‌ సుంకర వరుస పరాజయాలు పొందిన సంగతి తెలిసిందే. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆయన పైవిధంగా వ్యాఖ్యానించినట్టు సమాచారం. అనిల్‌ ఈ ఏడాది నిర్మాతగా వ్యవహరించిన చిత్రాలు హిట్‌కాకపోయినా ప్రెజెంటర్‌గా వ్యవహరించిన ‘సామజవరగమన’ (Samajavaragamana) విజయాన్ని అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని