Kotabommali: ‘కోట బొమ్మాళి’ రీమేక్‌ కాదు.. అలా చేస్తే జానపదం ఎక్కడికో వెళ్తుంది: నిర్మాత బన్నీ వాసు

శ్రీకాంత్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు తేజ మార్ని తెరకెక్కిస్తున్న చిత్రం ‘కోటబొమ్మాళి పి.ఎస్‌’. ఈ సినిమాలోని ‘లింగి లింగి లింగిడి’ సాంగ్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.

Published : 20 Sep 2023 22:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై తాను నిర్మిస్తున్న ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’ (Kotabommali PS).. మలయాళ హిట్‌ చిత్రం ‘నాయట్టు’ (Nayattu)కు రీమేక్‌ కాదని నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) స్పష్టం చేశారు. ఈ సినిమాలోని ‘లింగి లింగి లింగిడి’ (Lingi Lingi Lingidi) పాటకు శ్రోతల నుంచి మంచి ఆదరణ దక్కడంతో హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఆ వేడుకలోనే.. ‘కోట బొమ్మాళి’ రీమేక్‌ అంటూ వస్తున్న రూమర్స్‌పై ఆయన స్పందించారు. శ్రీకాంత్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నారు.

ఆ ఏడాది నాతో సమానంగా సినిమాలు చేసిన ఏకైక హీరో ఆయనే: రాశి

వేడుకనుద్దేశించి బన్నీ వాసు మాట్లాడుతూ.. ‘‘జానపదాన్ని ఈ సినిమాలో పెట్టేందుకు నిర్మాతగా నేను పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఫోక్‌ సాంగ్‌ రైట్స్‌ తీసుకోవడంకంటే సాధారణ పాటను రూపొందించుకోవడమే బెటర్‌ అనిపించింది. హక్కుల విషయంలో కళాకారులు నాలెడ్జ్‌ పెంచుకుని సినిమాని వేదికగా చేసుకుంటే తెలుగు జానపదం ఎక్కడికో వెళ్తుంది. ‘ఇది మాది. అది మాది’ అని అనుకుంటే జానపదాన్ని ఎక్కడికీ తీసుకెళ్లలేం. జానపదం నీది, నాది కాదు తెలుగుది. కొందరు అవగాహన లేకుండా ‘ఆ పాట ఫలానా వారిది’, ‘ఇది అక్కడి పాట’ అని అంటుంటారు. సొంతగా రాసిన పాట అయితే ఓకే. కానీ, 90 సంవత్సరాలు దాటిన ఏ గీతానికైనా హక్కులు ఉండవు. దాన్ని ఎవరైనా వినియోగించుకోవచ్చు. అది తెలియని కొందరు భయపెడుతుండడంతో మాలాంటి నిర్మాతలు చాలామంది వెనకడుగు వేయాల్సి వస్తోంది. ‘రేలారే రేలా’ రఘు నుంచి ఈ సినిమాలోని ‘లింగిడి’ పాట తీసుకున్నాం’’ అని తెలిపారు.

‘‘ఇది మలయాళ సినిమా నాయట్టు రీమేక్‌ అని చాలామంది అనుకుంటున్నారు. ఆ చిత్రంలోని రెండు సన్నివేశాలను స్ఫూర్తి తీసుకున్నామంతే. అందులోని పాత్రలు, ‘కోట బొమ్మాళి’లోని పాత్రలకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇది పక్కా తెలుగు కమర్షియల్‌ సినిమా. నాయట్టు.. ఓ అద్భుతం. దాన్ని రీ క్రియేట్‌ చేయాలని మేం అనుకోలేదు. అక్టోబరు 13 లేదా నవంబరు 24న ఈ సినిమాని విడుదల చేయానుకుంటున్నాం. కాపీ సిద్ధమైన సమయాన్ని బట్టి వాటిల్లో ఏదోక డేట్‌ ఫిక్స్‌ చేస్తాం’’ అని అన్నారు. ‘రాబోయే ఎన్నికల్లో జనసేన తరఫున రంగంలోకి దిగుతారా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఒకవేళ పవన్‌ కల్యాణ్‌ అవకాశం ఇస్తే తప్పకుండా వస్తా’’ అని సమాధానమిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని