DilRaju: ఏ పార్టీలోకి వెళ్లినా నేను ఎంపీగా గెలుస్తా: దిల్‌ రాజు కీలక వ్యాఖ్యలు

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల నేపథ్యంలో దిల్‌రాజు (Dil Raju) తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తన ప్యానెల్‌ సభ్యులతో కలిసి ప్రెస్‌ ముందుకు వచ్చిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

Updated : 29 Jul 2023 19:00 IST

హైదరాబాద్‌: తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (TFCC) ఎన్నికల్లో ఈ సారి అధ్యక్షుడి పదవికి పోటీ పడుతున్నారు ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, సి.కల్యాణ్‌. ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన ప్యానెల్‌ సభ్యులతో దిల్‌రాజు (Dil Raju) ప్రెస్‌ ముందుకు వచ్చారు. ఏ రాజకీయ పార్టీ తరఫున నిలబడినా తాను ఎంపీగా గెలుస్తానని చెప్పిన ఆయన.. తన ప్రాధాన్యత మాత్రం ఎప్పటికీ సినిమా రంగానికే ఉంటుందన్నారు. సీనియర్లు ముందుకు రాకపోవడంతోనే ఈ సారి తాను ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగినట్లు చెప్పారు. ఒకవేళ తాను అధ్యక్షుడిగా ఎన్నికైనా కిరీటాలు పెట్టరని, తనకు కొత్త సమస్యలు వచ్చినట్టేనని తెలిపారు. అయితే, సినీ పరిశ్రమ అభివృద్ధి, సంక్షేమం కోసమే తాను ఈ సారి ఎన్నికల్లో నిలబడినట్లు పేర్కొన్నారు.

‘‘ఈ ఎన్నికల పోటీలో ఎలాంటి వివాదాలు లేవు. ఫిల్మ్ ఛాంబర్‌ను బలోపేతం చేసేందుకే మేము ముందుకు వచ్చాం. పరిశ్రమలోని నాలుగు సెక్టార్లకు ఫిల్మ్ ఛాంబరే సుప్రీం. ప్రతి విభాగంలోనూ సమస్యలున్నాయి. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న నిర్మాతలందరూ మా ప్యానెల్‌లో ఉన్నారు. దిల్‌రాజు ప్యానెల్‌ యాక్టివ్‌ ప్యానెల్‌. అలాగే, ఈ ఎన్నికలు మాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే కొవిడ్‌ తర్వాత సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. జులైలో ‘సామజవరగమన’, ‘బేబీ’ లాంటి చిన్న చిత్రాలు సినీ పరిశ్రమను కాపాడాయి. ఎగ్జిబిటర్లకు ప్రభుత్వాలతో కొన్ని సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించడానికి సరైన టీమ్‌ కావాలి. సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. సరైన పద్ధతిలో సినిమా షూటింగ్స్ జరగాలి. నటీనటులకు ఎలాంటి సమస్య వచ్చినా మా అసోసియేషన్‌తో సమన్వయం చేసుకోవాలి’’

‘‘తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపును మరింత ముందుకు కొనసాగించాలి. 1560 మంది నిర్మాతలు సభ్యులుగా ఉన్నా రెగ్యులర్‌గా సినిమాలు తీసేవాళ్లు 200 మంది మాత్రమే. సినీ పరిశ్రమను బలోపేతం చేసుకోవాలంటే అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎవరినీ కించపర్చాలని మాకు లేదు. సత్యనారాయణ, అభిషేక్ నామా అంగీకరించకపోయినా వాళ్ల  ఫోటోలను అవతలి ఫ్యానెల్‌ వాళ్లు ముద్రించుకున్నారు. ఇండస్ట్రీలో ఓటు రాజకీయం ఎక్కువ.  నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్‌లో ఒక నిర్ణయం తీసుకోవడానికి సమస్య ఎదురైన సమయంలో యాక్టివ్‌గా 21 మంది సభ్యులతో గిల్డ్ ఏర్పాటు చేశాం. మిగతా 80 మంది అసోసియేట్ సభ్యులుగా ఉన్నారు. గిల్డ్ పై ఎన్ని విమర్శలు వచ్చినా మౌనంగా ఉన్నాం. ఫిల్మ్ ఛాంబర్ బైలాస్‌లో కొన్ని మార్పులు చేయాలి. ఛాంబర్‌లో సరైన వ్యక్తులు ఉంటేనే న్యాయం జరుగుతుంది’’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు