BRO: నాకు సంస్కారం ఉంది.. వాటి గురించి మాట్లాడను: అంబటి రాంబాబు వ్యాఖ్యలపై టీజీ విశ్వప్రసాద్‌ క్లారిటీ

‘బ్రో’ సినిమాని ఉద్దేశిస్తూ అంబటి రాంబాబు చేసిన ఆరోపణలపై చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన.. మంత్రి ఆరోపణలపై మాట్లాడారు.

Updated : 02 Aug 2023 16:00 IST

హైదరాబాద్‌: ‘బ్రో’ (BRO)లోని ఓ సన్నివేశాన్ని ఉద్దేశిస్తూ గత కొన్నిరోజుల నుంచి జరుగుతోన్న వివాదంపై చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ (TG Viswaprasad) స్పందించారు. సినిమాలోని సాంగ్‌ సీక్వెన్స్‌లో పృథ్వీరాజ్‌పై చిత్రీకరించిన సీన్స్‌ కేవలం వినోదం కోసమే తీశామని, ఏ ఇతర వ్యక్తులను ఇమిటేట్‌ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ‘బ్రో’ విడుదలైన నాటి నుంచి ఇప్పటివరకూ తాను ఎన్నోసార్లు ఆ సన్నివేశాన్ని చూశానని కేవలం ఒక హ్యుమర్‌ సీన్‌లాగే అనిపించిందని చెప్పారు. నెగెటివ్‌గా ఎక్కడా కనిపించలేదని అన్నారు.

‘‘సినిమా ఖర్చు, పవన్‌కల్యాణ్‌ రెమ్యునరేషన్‌ను ఉద్దేశిస్తూ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఆరోపణల్లో నిజం లేదు. ఆయన వ్యాఖ్యలు నిరాధారమైనవి. దాదాపు ఐదేళ్ల నుంచి మేము సినీ నిర్మాణంలో ఉన్నాం. ‘బ్రో’ మా 25వ చిత్రం. లార్జ్‌ స్కేల్‌లో దీన్ని తెరకెక్కించాం. నెట్‌ఫ్లిక్స్‌, జీ స్టూడియోస్‌తో ఒప్పందం పెట్టుకున్నాం. థియేటర్‌లోనూ మంచి వసూళ్లు వచ్చాయి. అయితే, సినిమా కలెక్షన్స్‌, హీరో రెమ్యునరేషన్‌ను మేము బయటపెట్టం. అది మాకూ సదరు వ్యక్తికి ఉన్న వ్యక్తిగత వ్యవహారం. బయటవాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో పృథ్వీ చేసిన డ్యాన్స్‌కు ఆయన డ్యాన్స్‌కు సంబంధం లేదు. ఆయన్ని ఉద్దేశిస్తూ మేము ఆ సీన్స్‌ క్రియేట్‌ చేయలేదు. కేవలం వినోదం కోసమే దాన్ని చిత్రీకరించాం. పొలిటికల్‌ ఫోకస్‌గా ఈ సినిమాలో ఏదీ జరగలేదు’’ అని విశ్వ ప్రసాద్‌ స్పష్టం చేశారు.

పవన్‌ నన్ను కించపరిచే విధంగా సినిమాలు తీస్తున్నారు: అంబటి రాంబాబు

సినిమా రంగంలో హీరోగా రాణించి, మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుని, రాజకీయాల్లోకి వచ్చిన ఓ వ్యక్తి కథతో మేము కూడా సినిమా చేయాలనుకుంటున్నాం. వాటికి ‘నిత్య పెళ్లి కొడుకు’, ‘బహు భార్య ప్రవీణ్యుడు’, ‘పెళ్లిళ్లు పెటాకులు’, ‘తాళి-ఎగతాళి’, ‘మూడు ముళ్లు-ఆరు పెళ్లిళ్లు’, బ్రో లాగా మ్రో (మ్యారేజెస్‌, రిలేషన్స్‌, అఫెండర్‌) ఇలా టైటిల్స్‌ అనుకుంటున్నామంటూ ఇటీవల ప్రెస్‌మీట్‌లో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై విశ్వప్రసాద్‌ స్పందిస్తూ..‘‘నాకు సంస్కారం ఉంది. వ్యక్తిగత విషయాల గురించి నేను ఎప్పుడూ మాట్లాడను’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని