BRO Movie: పవన్‌ నన్ను కించపరిచే విధంగా సినిమాలు తీస్తున్నారు: అంబటి రాంబాబు

Ambati Rambabu: పవన్‌కల్యాణ్‌ ‘బ్రో’ మూవీలో పృథ్వీ నటించిన శ్యాంబాబు పాత్ర తనని ఉద్దేశించి క్రియేట్‌ చేసినదని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.

Updated : 01 Aug 2023 18:06 IST

అమరావతి: సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) తనని కించపరిచే విధంగా సినిమాలు తీస్తున్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) విమర్శించారు. సినిమాకు కలెక్షన్లు తగ్గుతుండటంతోనే ‘బ్రో’ సినిమాలోని నటీనటులతో తనపై విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు. పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌తేజ్‌ కీలక పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రో’ (BRO Movie). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్‌లలో సందడి చేస్తోంది. ముఖ్యంగా తెరపై పవన్‌ నటించిన తీరు అభిమానులను అలరిస్తోంది. ఈ సినిమాలో నటుడు పృథ్వీ.. శ్యాంబాబు పాత్ర పోషించారు. ఓ పబ్‌లో డ్యాన్స్‌ చేస్తున్న అతనిపై పవన్‌ సెటైర్లు వేస్తారు. ఆ పాత్ర ఏపీ మంత్రి అంబటి రాంబాబును పోలి ఉందని సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలో మంత్రి అంబటి స్పందించారు.

రాంబాబు X శ్యామ్‌బాబు.. అంబటి వ్యాఖ్యలపై స్పందించిన పృధ్వీరాజ్‌

‘‘బ్రో’ సినిమాలో ఒక పాత్ర పేరు శ్యాంబాబు అని పెట్టి సీన్‌ తీశారు. ఆ పాత్రను పవన్‌కల్యాణ్‌గారు దూషించి, కించపరిచే ఉద్దేశంతో సృష్టించారని నేను అభిప్రాయపడుతున్నా. దానికి ఇటీవల వివరణ కూడా ఇచ్చాను. అంతటితో ఆగకుండా, ఆ సినిమాలో నటించిన నటీనటులు సదరు సన్నివేశంపై మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని వివాదం చేయడం ద్వారా సినిమాకు ప్రచారం కల్పించి కలెక్షన్లు రాబట్టుకోవాలని చూస్తున్నారు.  ‘బ్రో’ ఫ్లాప్‌ మూవీ. ఈ సినిమా కలెక్షన్లు చూసుకుంటే నిన్నటి వరకూ రూ.55.27కోట్లు షేర్‌ కలెక్ట్‌ చేసింది. ఇవి ట్రేడ్‌ లెక్కలు. శ్యాంబాబు, రాంబాబు అంటూ ప్రచారం చేసుకుంటే, ఇంకాస్త కలెక్షన్లు పెరుగుతాయని అనుకుంటున్నారు. ఒకరిని విమర్శించాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశారు. పవన్‌, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ కూర్చొని నాపై స్క్రిప్ట్‌ రాశారు. నాకున్న సమాచారం ప్రకారం పవన్‌ కల్యాణ్‌ పారితోషికం రూ.50కోట్లపై మాటే. ఇలా చూసుకుంటే, ఆయన రెమ్యునరేషన్‌ కూడా వచ్చే పరిస్థితి లేదు’’

‘‘పవన్‌కల్యాణ్‌ సినిమాలు ఇక ఆడవని గతంలో నేను చెప్పాను. ఎందుకంటే వారాహి వంటి పవిత్ర పేరును తన వాహనానికి పెట్టుకుని, దానిపై ఎక్కి అబద్ధాలు, విమర్శలు చేస్తున్నారు. వారాహి అమ్మవారి శాపం తగులుతుంది. పవన్‌ పూర్తిస్థాయి పొలిటికల్‌ సినిమా తీసి ఉంటే, తప్పు లేదు. కానీ, ఒక కమర్షియల్‌ సినిమాలో కావాలని  ఒక పాత్రను సృష్టించి తన కక్ష తీర్చుకోవాలనుకున్నారు. ఈ విషయంలో నిర్మాత విశ్వప్రసాద్‌ జాగ్రతగా ఉండాల్సింది. విశ్వప్రసాద్‌కు అమెరికాలో చాలా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఉన్నాయి. చంద్రబాబునాయుడు, ఆయన ముఠా సభ్యులు అమెరికాలో డబ్బులు కలెక్ట్‌ చేసి, విశ్వప్రసాద్‌కు ఇస్తే, ప్యాకేజీకి జమ చేయడం కోసం పవన్‌కు ఇస్తున్నారు. రాజకీయాల్లో ఉండి సినిమాలు తీయొచ్చు. కానీ, సినిమాల్లో ఉండి రాజకీయాలు చేస్తూ సినిమాలు వదలకపోతే అటు సినిమాలు ఇటు రాజకీయాలు నాశనం అవుతాయి’’

‘‘ఎన్టీఆర్‌లాంటి వ్యక్తి రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఒకట్రెండు సినిమాలు తప్ప పెద్దగా చేయలేదు. చిరంజీవి కూడా రాజకీయాల్లో ఉండగా సినిమాలు చేయలేదు. కానీ, పవన్‌కల్యాణ్‌ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు చేస్తున్నారు. సినిమా రంగంలో హీరోగా రాణించి, మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుని, రాజకీయాల్లోకి వచ్చిన ఓ వ్యక్తి కథతో మేము కూడా సినిమా చేయాలనుకుంటున్నాం. వాటికి ‘నిత్య పెళ్లి కొడుకు’, ‘బహు భార్య ప్రవీణ్యుడు’, ‘పెళ్లిళ్లు పెటాకులు’, ‘తాళి-ఎగతాళి’, ‘మూడు ముళ్లు-ఆరు పెళ్లిళ్లు’, బ్రో లాగా మ్రో (మ్యారేజెస్‌, రిలేషన్స్‌, అఫెండర్‌) ఇలా టైటిల్స్‌ అనుకుంటున్నాం. పేరు పెట్టిన తర్వాత అందరికీ చెబుతాం. ‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు అని పెట్టకుండా రాంబాబు అని పెట్టుకున్నా నేనేమీ అనుకునేవాడిని కాదు. పైగా నా డ్యాన్స్‌సింక్‌ కాలేదని అంటున్నారు. నేనేమీ డ్యాన్స్‌ మాస్టర్‌ను కాదు కదా. ఈ విమర్శలపై ప్రజలందరూ ఆలోచించాలి. తెలుగు చలన చిత్ర సీమలో ఉన్న నటులు, నిర్మాతలు, దర్శకులకు, తివిక్రమ్‌ వంటి రచయితలకు ఒక విషయం చెబుతున్నా. మళ్లీ మళ్లీ ఇలాంటి సన్నివేశాలు తీస్తే, తగిన గుణపాఠాలు చెప్పాల్సి వస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలని ఒక రాజకీయ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తున్నా’’ అని అంబటి విమర్శలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని