Oscars 2023: పుతిన్‌ ప్రత్యర్థిపై సినిమాకు ఆస్కార్‌.. ఎవరీ నవానీ?

జైలు శిక్ష అనుభవిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రత్యర్థి అలెక్సీ నవానీ (Navalny) జీవితంపై తెరకెక్కిన చిత్రానికి గానూ ఆస్కార్‌ (Oscars 2023) పురస్కారం లభించింది. ఇంతకీ ఎవరీ నవానీ..?

Updated : 13 Mar 2023 13:40 IST

ఆస్కార్‌ అందుకున్న చిత్ర బృందంతో నవానీ సతీమణి (ఎరుపు దుస్తుల్లోని వ్యక్తి)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ (Oscars 2023) పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. లాజ్‌ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 95వ అకాడమీ అవార్డులను నేడు ప్రకటించారు. ఇందులో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో ‘నవానీ (Navalny)’ చిత్రం ఆస్కార్‌ అందుకుంది. ఈ సినిమాకో ప్రత్యేకత ఉంది. రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) విమర్శకుడు, ఆ దేశ ప్రతిపక్ష నేత అలెక్సీ నవానీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న నాయకుడే అలెక్సీ నవానీ (Alexei Navalny). అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా ఆయనకు ఆదరణ లభించింది. ఈ క్రమంలోనే 2020లో సెర్బియా పర్యటనలో ఉన్నప్పుడు ఆయనపై విషప్రయోగం జరగడం సంచలనం సృష్టించింది. నవానీ (Alexei Navalny) నరాల్లోకి విషపూరిత ఇంజెక్షన్‌ను ఎక్కించడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జర్మనీలో కొన్ని నెలల పాటు చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడ్డ ఆయన.. 2021 జనవరిలో రష్యాకు తిరిగొచ్చారు. అయితే, వచ్చీ రాగానే రష్యా పోలీసులు ఆయనను ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు. నిధుల దుర్వినియోగం సహా పలు అభియోగాలపై ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అప్పట్లో రష్యా అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత ఆయనను కోర్టులో హాజరుపర్చగా జైలు శిక్ష విధించింది. 46 ఏళ్ల నవానీ గత రెండేళ్లుగా జైల్లోనే ఉన్నారు.

ఈ పరిణామాలన్నీ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఈ క్రమంలోనే నవానీ (Alexei Navalny) రాజకీయ జీవితం, ఆయనపై విష ప్రయోగం, అరెస్టు తదితర నిజజీవిత అంశాలను ఆధారంగా చేసుకుని కెనడాకు చెందిన దర్శకుడు డేనియల్‌ రోహెర్‌ ‘నవానీ’ పేరుతో ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను తెరకెక్కించారు. ఈ ఏడాది ఈ చిత్రం ఆస్కార్‌ (Oscars 2023)కు నామినేట్‌ అవగా.. తాజాగా ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌గా అకాడమీ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం.

అవార్డును అందుకున్న తర్వాత ఆస్కార్‌ వేదికపై దర్శకుడు రోహెర్‌ మాట్లాడుతూ.. ‘‘పుతిన్‌ (Putin)పై పోరాటానికి గానూ జైలుకెళ్లారు అలెక్సీ నవానీ. ఇప్పుడు ఇక్కడ ఆయన ఉండి ఉంటే.. ఉక్రెయిన్‌పై పుతిన్‌ సాగిస్తున్న అరాచక దురాక్రమణపై కచ్చితంగా గళమెత్తేవారు’’ అని తెలిపారు. నవానీ సతీమణి యూలియా నవనయా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నిజాలను మాట్లాడినందుకు.. ప్రజాస్వామ్య పరిరక్షణకై పోరాటం చేసినందుకు గానూ నా భర్త ఇప్పుడు జైల్లో ఉన్నారు’’ అంటూ ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని