Actors turned Directors: ధనుష్‌, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...

స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే?

Published : 19 Mar 2024 09:51 IST

దర్శకుడు కోరిన విధంగా అభినయించడం నటుల పని. యాక్టర్‌ నుంచి నటన రాబట్టుకోవడంతోపాటు అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ సినిమాని పూర్తి చేయడం దర్శకుడి బాధ్యత. ఇలా ఒకదానితో మరోదానికి సంబంధంలేకపోయినా పలువురు నటులు.. స్వీయ దర్శకత్వంలో నటించి సత్తా చాటారు. నాటి నందమూరి తారక రామారావు, కృష్ణ, కమల్‌ హాసన్‌ నుంచి నేటి విజయ్‌ ఆంటోనీ, విశ్వక్‌ సేన్‌ వరకు చాలామంది ఈ ‘రెండు పడవలపై ప్రయాణం’ చేసి, విజయం అందుకున్నారు. ఆ ట్రెండ్‌ మళ్లీ కనిపిస్తోంది. ఆ కొత్త చిత్రాలేంటి? నటులెవరంటే?

ధనుష్‌ డ్రీమ్‌ ప్రాజెక్టు..

తన మైలురాయి చిత్రాన్ని (50వ) స్వయంగా తెరకెక్కిస్తున్నారు కోలీవుడ్‌ ప్రముఖ నటుడు ధనుష్‌ (Dhanush). ఆ డ్రీమ్‌ ప్రాజెక్టు టైటిల్‌ ‘రాయన్‌’ (Raayan). యాక్షన్‌కు ప్రాధాన్యమున్న ఈ సినిమాలో  సందీప్‌ కిషన్‌, కాళిదాస్‌, అపర్ణా బాలమురళి, సెల్వ రాఘవన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీలో ఈ ఏడాదే విడుదల కానుంది. ధనుష్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న రెండో చిత్రమిది. ఇంతకుముందు ‘పా. పాండి’ (Pa. Paandi)కి దర్శకత్వం వహిస్తూ నటించారు. 2017లో విడుదలైంది. మరోవైపు, టాలీవుడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘కుబేర’లో ధనుష్‌ హీరోగా నటిస్తున్నారు.

ఉపేంద్ర.. మరో వెరైటీ టైటిల్‌తో

కన్నడ నటుడు ఉపేంద్ర (Upendra) సినిమాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో వాటి పేర్లు, అందులోని పాటలు అంతే వెరైటీగా ఉంటాయి. ఆ తరహాలోదే తాజా చిత్రం ‘యూఐ’ (UI). స్వీయ దర్శకత్వంలో ఈ ఫాంటసీ మూవీలో నటించారాయన. రీష్మా హీరోయిన్‌. దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ పాన్‌ ఇండియా సినిమాని ఏప్రిల్‌ 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో వచ్చిన ‘ఎ’, ‘ఉపేంద్ర’తదితర చిత్రాలతో ఉపేంద్ర డైరెక్టర్‌గా, యాక్టర్‌గా తెలుగులోనూ విశేష క్రేజ్‌ దక్కించుకున్నారు. ఉపేంద్రలా సినిమాలు తీయడం ఎవరికీ సాధ్యంకాదని ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఉపేంద్ర తన ఫేవరెట్‌ డైరెక్టర్‌ అని తెలిపారు. 

కంగన.. అప్పుడలా ఇప్పుడిలా

నాయికా ప్రాధాన్య చిత్రాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే వారిలో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ఒకరు. స్వీయ దర్శకత్వంలో ఆమె నటించిన సినిమా ‘ఎమర్జెన్సీ’ (Emergency). భారత రాజకీయ చరిత్రలో కీలక ఘట్టమైన ఎమర్జెన్సీ ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమాలో కంగన.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీగా నటించారు. జయప్రకాశ్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్‌ తల్పాడే కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జూన్‌ 14న విడుదల కాబోతుంది. ఇంతకుముందు ‘మణికర్ణిక’ కోసం కంగన మెగాఫోన్‌ పట్టారు. ఆ హిస్టారికల్‌ మూవీకి ముందుగా క్రిష్‌ దర్శకత్వం వహించి, తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చారు.

కాంతార ప్రీక్వెల్‌తో రిషబ్‌ బిజీ

‘కాంతార’ (Kantara)తో కథానాయకుడిగా, దర్శకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి (Rishab Shetty). రూ. 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఆ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.390 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడా చిత్రానికి ప్రీక్వెల్‌ ‘కాంతార 2’ (Kantara 2)ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు రిషబ్‌. పార్ట్‌ 1 కథ ఎక్కడైతే ప్రారంభమైందో దానికి ముందు జరిగిన సంఘటనలను పార్ట్‌ 1లో చూపించనున్నారు. ఈ సినిమాలోని పాత్ర కోసం రిషబ్‌ గుర్రపు స్వారీ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని సమాచారం. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. గతంలో ‘కిరిక్‌ పార్టీ’ తదితర చిత్రాలకు రిషబ్‌ దర్శకత్వం వహించారుగానీ వాటిల్లో ఆయన నటించలేదు.

విశాల్‌ కల..

‘‘25 ఏళ్ల తర్వాత నా అసలు ప్రయాణం మొదలైంది. నా కల ఎట్టకేలకు నెరవేరుతోంది. అవును, ఇప్పుడు నేను కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నా’’ అంటూ దర్శకుడిగా మారడంపై సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు విశాల్‌ (Vishal). ఈయన హీరోగా దర్శకుడు మిస్కిన్‌ తెరకెక్కించిన చిత్రం ‘తుప్పరివాలన్‌’ (తెలుగులో డిటెక్టివ్‌) (Thupparivaalan) కోలీవుడ్‌, టాలీవుడ్‌లో విజయాన్ని అందుకుంది. దాని సీక్వెల్‌ ‘తుప్పరివాలన్‌2/డిటెక్టివ్‌2’ (Thupparivaalan 2) కూడా మిస్కిన్‌ డైరెక్షన్‌లోనే రూపొందాల్సి ఉందిగానీ అనివార్య కారణాల వల్ల ఆయన వైదొలిగారు. దీంతో విశాలే ఆ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తూ నటించేందుకు సిద్ధమయ్యారు. అతి త్వరలోనే లండన్‌లో షూటింగ్‌ ప్రారంభం కానుంది.

మరికొన్ని సంగతులు..

కమెడియన్‌ ధన్‌రాజ్‌ ‘రామం రాఘవం’తో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇందులో ఆయనతోపాటు సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. విశ్వక్‌ సేన్‌ స్వీయ దర్శకత్వంలో ‘ఫలక్‌నుమా దాస్‌’ (2018), ‘దాస్‌ కా ధమ్కీ’ (2023)లతో సందడి చేశారు. గతేడాది విడుదలైన ‘బిచ్చగాడు 2’కు హీరో విజయ్‌ ఆంటోనీనే దర్శకత్వం వహించారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని