Rajasekhar: అందరి ఆశీర్వాదాలే బతికించాయి

‘కొవిడ్‌ టైమ్‌లో నేను బతుకుతానా? లేదా? అనిపించింది. ఇక నా జీవితం అయిపోయింది.. నేను సినిమాలు చేస్తానా లేదా అనుకున్నా! ఎందుకంటే అప్పటికి నేను ఆస్పత్రిలో  నడవలేని స్థితిలో ఉన్నా. అయితే అందరి ప్రార్థనలు, ఆశీర్వాదాల

Updated : 07 Dec 2022 16:23 IST

‘‘కొవిడ్‌ టైమ్‌లో నేను బతుకుతానా? లేదా? అనిపించింది. ఇక నా జీవితం అయిపోయింది.. నేను సినిమాలు చేస్తానా లేదా అనుకున్నా! ఎందుకంటే అప్పటికి నేను ఆస్పత్రిలో  నడవలేని స్థితిలో ఉన్నా. అయితే అందరి ప్రార్థనలు, ఆశీర్వాదాల వల్లే ప్రాణాలతో బతికి బయటపడగలిగా. ఈరోజు మీ ముందు నేనిలా నిల్చోగలిగా’’ అన్నారు కథానాయకుడు   రాజశేఖర్‌. ఇప్పుడాయన నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘శేఖర్‌’. జీవితా రాజశేఖర్‌ తెరకెక్కించారు. బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజశేఖర్‌,   శివాత్మిక రాజ   శేఖర్‌, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం రాజశేఖర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘‘కిన్నెరా.. ఓ కిన్నెరా’’ అనే గీతాన్ని విడుదల చేశారు. అనంతరం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ‘‘కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత నేనీ సినిమా చేశా. పది చిత్రాలకు పడేంత కష్టాన్ని.. మేము ఈ ఒక్క సినిమా కోసం పడ్డాం. జీవిత వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘ఎంతో కష్టపడి, ఇష్టంగా ఈ చిత్రం చేశాం. నిర్మాణాంతర పనులు పూర్తయ్యాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు జీవితా రాజశేఖర్‌. నటి, నిర్మాత శివాని మాట్లాడుతూ.. ‘‘నన్ను అందరూ ఓటీటీ స్టార్‌ అంటూ  .. ‘ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్‌ అవుతుందా?’ అని అడుగుతున్నారు. దీన్ని త్వరలో థియేటర్లలోనే విడుదల చేయనున్నాం. నా ఫస్ట్‌ థియేటర్‌ మూవీ ఇది. నన్ను, ఈ చిత్రాన్ని  ఆదరించి పెద్ద హిట్‌ చేయాలని కోరుతున్నాను’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సమీర్‌, భరణి శంకర్‌, రవి వర్మ, అనూప్‌ రూబెన్స్‌, నిరంజన్‌, మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని