Sai Dharam Tej: మావయ్య నుంచి నేర్చుకున్నది అదే!

మా మావయ్య పవన్‌కల్యాణ్‌. నేను నటుడిని కావడానికి సహకారం అందించింది, నన్ను ప్రోత్సహించింది ఆయనే. నేను గురువులా భావించే మావయ్యతో కలిసి నటించే అవకాశం రావడమే అన్నిటికంటే ప్రత్యేకం.

Updated : 27 Jul 2023 13:59 IST

విజయాల బాటలో ప్రయాణం చేస్తున్న కథానాయకుడు సాయి ధరమ్‌ తేజ్‌. ‘విరూపాక్ష’తో ఘన విజయాన్ని అందుకున్న ఆయన... ఇటీవల తన మావయ్య పవన్‌కల్యాణ్‌తో కలిసి ‘బ్రో’లో నటించారు. మార్క్‌ అలియాస్‌ మార్కండేయగా ఆయన తెరపై సందడి చేయనున్నారు. చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా తేజ్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘బ్రో’లో నటించడానికి మిమ్మల్ని ఎక్కువగా ప్రేరేపించిన అంశం ఏమిటి?

మా మావయ్య పవన్‌కల్యాణ్‌. నేను నటుడిని కావడానికి సహకారం అందించింది, నన్ను ప్రోత్సహించింది ఆయనే. నేను గురువులా భావించే మావయ్యతో కలిసి నటించే అవకాశం రావడమే అన్నిటికంటే ప్రత్యేకం. దాంతో కథ కూడా వినకుండా సినిమా చేయడానికి అంగీకారం తెలిపా. నన్ను నేను నిరూపించుకునే అవకాశంగా, నా కెరీర్‌కి నాకు నేను ఇచ్చుకునే ఓ కానుకగా భావించి నటించా.

పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించిన తొలి రోజు అనుభవాల్ని పంచుకుంటారా?

నేనైతే కంగారుపడ్డాను. ఒక దశలో వణికిపోయాను. మావయ్య ‘నేనే కదా, ఎందుకు కంగారు పడుతున్నావు’ అంటూ నాతో మాట్లాడారు. దాంతో ఒత్తిడంతా మాయమైంది. దర్శకుడు సముద్రఖని కూడా చాలా సహకారం అందించారు. సెట్‌లో గడిపిన ప్రతిక్షణం గుర్తుండిపోయేదే. మావయ్యతో అన్ని రోజులు సమయం గడిపే అవకాశం వచ్చింది. సినిమా మొదలైనప్పట్నుంచి పూర్తయ్యేవరకూ నన్ను సరదాగా ఆటపట్టిస్తూనే ఉన్నారు. తెరపై కూడా మా ఇద్దరి మధ్య సన్నివేశాలు అలాగే ఉంటాయి. చిన్నప్పుడు కల్యాణ్‌ మావయ్యతోనే ఎక్కువ గడిపేవాణ్ని. దాంతో ఆయనతో ఓ ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. నాతో ఇప్పటికీ అలాగే ఉంటారు.

ఈ ప్రయాణంలో ఆయన్నుంచి నేర్చుకున్న ప్రత్యేకమైన విషయం ఏదైనా ఉందా?

ఆయన రాజకీయాల్లో కొనసాగుతూనే ఈ సినిమా చేశారు. బయట ఎన్ని ఒత్తిడులు ఉన్నా సరే, ఒక్కసారి సెట్‌కి వచ్చారంటే చేస్తున్న పాత్రే ఆయన ప్రపంచం అవుతుంది. బయట ఎన్ని పనులున్నా సరే, చేస్తున్న సన్నివేశానికి ఏం అవసరమో అది ఇవ్వడం ఎలాగో ఆయన్ను చూస్తూ నేర్చుకున్నా. వృత్తినీ, వ్యక్తిగత జీవితాన్నీ ఎలా వేరు చేసి చూడాలో తెలుసుకున్నా. ఈ సినిమా చిత్రీకరణ ఎంత వేగంగా సాగినా ఏ రోజూ ఒత్తిడిగా అనిపించలేదు. మావయ్యతో గడిపే సమయం నాకు చాలా విలువైనది.  

ఈ కథ మీ వ్యక్తిగత జీవితంపై ఏ మేరకు ప్రభావం చూపించింది?

ఈ క్షణంలో బతకడం గురించి చెప్పే కథ ఇది. ప్రతి ఒక్కరికీ ఓ విధి ఉంటుందనీ... మన పనిని మనం చిత్తశుద్ధితో చేస్తూ వెళ్లాలని చెబుతుందీ కథ. వ్యక్తిగతంగా నాపైన ఈ సినిమా ప్రభావం అంటే... ఈ సినిమాకి ముందు నుంచే నాకు ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించడం అలవాటైంది. అందుకు సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉంటాను. టైమ్‌ విషయంలో మాత్రం చాలా కనెక్ట్‌ అయ్యాను. స్వతహాగా నేను నా కుటుంబంతో కలిసి సమయం గడపడాన్ని ఇష్టపడతాను. అమ్మ, నాన్న, స్నేహితులతో ఉదయమో, మధ్యాహ్నమో, రాత్రో ఏదో ఒక సమయంలో కలిసి కాసేపైనా గడుపుతా. ‘చిత్రలహరి’కి ముందు కొన్ని పరాజయాలు పలకరించాయి. నా పని అయిపోయిందని మాట్లాడుకున్నారు. ఆ సమయంలోనే చేసిన ‘చిత్రలహరి’ పరాజయాలపై నాకున్న అభిప్రాయాలన్నిటినీ మార్చేసింది.

త్రివిక్రమ్‌ ఏమైనా సలహాలు ఇచ్చారా?

ఆయన సెట్లో ఎప్పుడూ సలహాలు ఇవ్వలేదు. కథ పరంగా మాత్రం ఆయన చాలా సలహాలు ఇచ్చారు. త్రివిక్రమ్‌ లాంటి గొప్ప రచయిత రాసిన సన్నివేశాల్లో నేను నటించడం తృప్తినిచ్చింది. నాకూ, కల్యాణ్‌ మావయ్యకీ మధ్య సంభాషణలు కట్టిపడేసేలా ఉంటాయి. అవి తేలికైన పదాలతోనే ఉంటాయి, కానీ వాటిలో లోతైన భావం ఉంటుంది. తమన్‌ సంగీతం ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తుంది.

ఈ సినిమా తర్వాత కొన్నాళ్లు విరామం తీసుకుంటున్నారట కదా?

‘విరూపాక్ష’ తర్వాతే విరామం తీసుకోవాలనుకున్నా. అంతలోనే ‘బ్రో’ అవకాశం వచ్చింది. గత సినిమాకీ, ఈ సినిమాకీ చాలా మెరుగయ్యాను. మరో ఆరు నెలలు విశ్రాంతి తీసుకుని మరింత ధృఢంగా తిరిగి రావాలనుకుంటున్నా. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ‘గాంజా శంకర్‌’కి తగ్గట్టుగా నేను కనిపించాలంటే విశ్రాంతి అవసరం.

పవన్‌కల్యాణ్‌ మావయ్యతో కలిసి సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు మీ కుటుంబంలో ఎవరెలా స్పందించారు?

అందరూ చాలా సంతోషించారు. నాకు దక్కిన ఓ అదృష్టం అది. వరుణ్‌తేజ్‌ మొన్న వేడుకలో అలా అన్నా తను చాలా సంతోషించాడు. చిరంజీవి మావయ్య అయితే ‘మీ గురు శిష్యులకి బాగా కుదిరిందిరా’ అన్నారు.  

కుటుంబ కథానాయకులతో కాకుండా... వేరే హీరోలతో కలిసి సినిమా చేయడానికి సిద్ధమేనా?

నాకు అందరు హీరోలతో కలిసి నటించాలని ఉంది. మా కుటుంబంలో కాకుండా నాకు బాగా ఇష్టమైన కథానాయకులంటే రవితేజ, ప్రభాస్‌, కల్యాణ్‌రామ్‌, తారక్‌. మంచి కథ కుదిరితే వీళ్లతో కలిసి నటిస్తా. మంచు మనోజ్‌తో కూడా సినిమా చేస్తా. మా మావయ్యలతో కలిసి నటించాలని నాకు ఎప్పట్నుంచో ఉండేది. నాగబాబు మావయ్యతో ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ సినిమాలో నటించా. కల్యాణ్‌ మావయ్యతో ‘బ్రో’. ఇప్పుడు చిరంజీవి మావయ్యతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా.

‘‘బైక్‌ నడపడం అంటే నాకు ఇష్టం, అంతే కానీ వేగంగా వెళ్లడం కాదు. నేనెప్పుడూ బైక్‌పై  నిదానంగానే వెళ్తా. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుంటా. రోడ్డు ప్రమాదం తర్వాత మళ్లీ బైక్‌ ఎక్కా. ‘నా కొడుకు పిరికివాడిలా ఉండకూడదు, దేనికైతే భయపడ్డాడో... దాన్ని అధిగమించాలి’ అంటూ మా అమ్మ బైక్‌ తాళాలు తెచ్చి ఇచ్చింది. నేను అంతే ధైర్యంగా మా పార్కింగ్‌ స్థలంలోనూ.. అమ్మకి తెలియకుండా ఇంకొంచెం దూరం ప్రయాణం చేసి వచ్చా’’.

ప్రమాదం సమయంలో మిమ్మల్ని కాపాడిన అబ్దుల్‌ ఫర్హాన్‌కి ఏమైనా సాయం చేశారా?

సామాజిక మాధ్యమాల్లో దాని గురించి తప్పుడు ప్రచారం చేశారు. అతనికి కొంత డబ్బు ఇచ్చి చేతులు దులుపుకునే ఆలోచన నాకు లేదు. అతను నా ప్రాణాన్ని కాపాడాడు. అందుకే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానని చెప్పా. నెల కిందే అతన్ని కలిశా. నా బృందం ఎప్పుడూ అతనికి అందుబాటులో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని