Jayanthi: బండపిల్లా.. ఎలా నటించాలో కూడా తెలీదా?అన్నారు
అమాయకత్వం, కోపం, బాధ, ప్రేమ, కరుణ.. ఇలా ఎలాంటి భావాన్నైనా తన కళ్లలో అలవోకగా పలికించి ‘అభినయ శారద’గా గుర్తింపు తెచ్చుకున్న నటి జయంతి. బాలనటిగా, నటిగా...
ప్రముఖ నటి జయంతి మధుర జ్ఞాపకాలు
ఇంటర్నెట్‌డెస్క్: అమాయకత్వం, కోపం, బాధ, ప్రేమ, కరుణ.. ఇలా ఎలాంటి భావాన్నైనా తన కళ్లలో అలవోకగా పలికించి ‘అభినయ శారద’గా గుర్తింపు తెచ్చుకున్న నటి జయంతి. బాలనటిగా, నటిగా, సహాయనటిగా ఎన్నో ఏళ్లపాటు సినీ ప్రియుల్ని అలరించిన ఆమె సోమవారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో జయంతికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలను ఆమె మాటల్లోనే ఒక్కసారి మనందరం నెమరువేసుకుందాం. ఒకానొక సమయంలో ఈటీవీ వారితో జయంతి పంచుకున్న సరదా విశేషాలివే..
మద్రాస్ వెళ్లడానికి కారణమదే..
‘మాది కర్ణాటకలోని బళ్లారి. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. ఎలాగైనా డ్యాన్స్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులతో కలిసి మద్రాస్‌కి వెళ్లాను. చంద్రకళ అనే టీచర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాను. అదే సమయంలో ఓసారి మా టీచర్‌కి గోల్డెన్ స్టూడియోలో షూట్ ఉండటంతో మా టీమ్ మొత్తం ఆమెతోపాటు స్టూడియోలోకి అడుగుపెట్టాం’
అదే ఫస్ట్ ఛాన్స్..
‘టీచర్‌తో కలిసి గోల్డెన్ స్టూడియోలో ఉన్నప్పుడు ఓ నిర్మాత మా వద్దకు వచ్చారు. ‘ఈ అమ్మాయి చూడచక్కగా ఉంది. మా సినిమాల్లో అవకాశం ఇస్తే నటిస్తుందా?’ అని మా టీచర్‌ని ప్రశ్నించారు. దాంతో ఆమె.. ‘నాకేమీ తెలియదండి. ఒక్కసారి వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడండి’ అని చెప్పారు. ఆ తర్వాత కొన్నిరోజులకు ఆయన మా ఇంటికి వచ్చి ఓ సినిమాలో అవకాశమిస్తున్నట్లు చెప్పారు. అందులో నాది చాలా చిన్న పాత్ర. ఆ సినిమా విడుదలయ్యాక కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన ‘జగదేకవీరుని కథ’లో నాకు అవకాశం వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ కథానాయకుడు’
నా లవ్ గురూ ఆయనే..
‘‘జగదేకవీరుని కథ’ తర్వాత నేను నటించిన సినిమాల్లో నా మనసుకు బాగా హత్తుకున్నది ‘సుమంగళి’ . ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఏఎన్నార్, సావిత్రి, ఎస్వీఆర్ వంటి అగ్రతారలందరూ కీలకపాత్రలు పోషించారు. అందులో నేను ఓ స్పెషల్ సాంగ్ చేశాను. అగ్రతారలందరూ ఉన్నారన్న కారణంగా ఆ ప్రాజెక్ట్ ఓకే చేశాను. అయితే పాట చిత్రీకరణలో భాగంగా శోభన్‌బాబు నా మీద చేయి వేయగానే నాకు ఎలా నటించాలో అర్థం కాక.. అలా చూస్తూ ఉండిపోయాను. దాంతో దర్శకుడు కట్ చెప్పారు. వెంటనే అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్న కె.విశ్వనాథ్ నా వద్దకు వచ్చి.. ‘ఏయ్.. బండపిల్లా.. ఏంటి అలా నిల్చుంటావ్? అబ్బాయి చేయి ఒంటిమీద పడగానే ఎలా పులకరించాలో తెలీదా?’ అన్నారు. ‘నాకు తెలియదు సర్’ అనడంతో ఆయనే నాకు నటనకు సంబంధించిన అంశాలు నేర్పించారు. అందుకే ఆయనను నేను నా ప్రేమ గురువుగా అభివర్ణిస్తుంటాను’
గురువుగారు..
‘కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘శారద’, ‘స్వాతికిరణం’ సినిమాల్లో నేను కీలక పాత్రలు పోషించా. ఆ రెండు సినిమాల్లోని నా పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే ఆయనే నాకు గురువు’
ఆ కల తీరలేదు..
‘ఏఎన్నార్ పక్కన హీరోయిన్‌గా నటించాలని నాకు ఎప్పటి నుంచో ఓ కోరిక ఉండేది. ఓ సినిమా అనుకున్నప్పటికీ నేను కన్నడంలో వరుస చిత్రాల్లో నటిస్తుండటంతో డేట్స్ సర్దుబాటుకాక ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఏఎన్నార్ నటించిన ‘భార్యాభర్తలు’ చిత్రంలో ఆయనకు ప్రేయసిగా నటించాను. ఇక, మేమిద్దరం అన్నాచెల్లెళ్లుగా నటించిన చిత్రం ‘బంగారుబాబు’. అందులో నాది అంధురాలి పాత్ర. ఆ పాత్రకు అంత గుర్తింపు వచ్చిందంటే కారణం ఎస్వీఆర్, ఏఎన్నార్ ఇచ్చిన సలహాలు, సూచనలే’
అంత ఈజీ కాదు..
సంసారం సాగరంలో భానుమతితో జయంతి
‘జయంతి ఎప్పుడూ ఏడుపుగొట్టు పాత్రలే చేస్తుందని అందరూ చెప్పుకుంటారు. నిజం చెప్పాలంటే ఏడుస్తూ ప్రేక్షకుల్ని మెప్పించడమనేది అంత సులభమైన విషయం కాదు. పాత్రను అర్థం చేసుకోవాలి. అందులో లీనమవ్వాలి. ఆ కష్టాన్ని అనుభవించి.. మేము ఏడవడమే కాదు.. ప్రేక్షకుల చేత కూడా కన్నీళ్లు పెట్టించాలి. అలాంటి పాత్రలో కనుక మెప్పిస్తే.. ఏ పాత్రలోనైనా జీవించేయవచ్చు’
అలా నా ఆశ తీరింది..
మదన కామరాజు కథలో కాంతారావుతో జయంతి
‘భానుమతి, సావిత్రి, ఎస్వీరంగారావుతో స్క్రీన్ పంచుకుంటే చాలు అనే ఆశ నాలో ఎక్కువగా ఉండేది. అదే విధంగా వాళ్లందరితో సినిమాలు చేశాను. ఎస్వీఆర్ గారితో ‘సంసారం సాగరం’లో నటించాను. అది ఎంతో అద్భుతమైన పాత్ర. ఆయనకంటే బాగా నటించాలనే పోటీతత్వం నాకు బాగా ఉండేది. భానుమతి అయితే నన్ను మెచ్చుకున్నారు కూడా’
ఆ పాట వింటే కన్నీళ్లే..
టాలీవుడ్ చెందిన కృష్ణ, కృష్ణంరాజు, కాంతారావులతో ఎన్నో చిత్రాల్లో నటించాను. కృష్ణంరాజుతో నేను చేసిన చివరి సినిమా ‘విధాత’. కృష్ణ విషయానికి వస్తే మేమిద్దరం కలిసి నటించిన ‘రక్తసంబంధం’, ‘మాయదారి మల్లిగాడు’ నా హృదయానికి చేరువైన సినిమా. ‘మాయదారి మల్లిగాడు’ సినిమాలోని ‘మల్లెపందిరి నీడలోనే జాబిల్లి’ అనే పాట ఇప్పటికీ విన్నా సరే కన్నీళ్లు వచ్చేస్తుంటాయి’ అని ఒకానొక సమయంలో జయంతి తన సినీ మధుర ఘట్టాలను గుర్తుచేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Delimitation: దక్షిణాది వాణిని అణచివేయాలని చూస్తే మౌనం వహించేది లేదు: కేటీఆర్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Vasu Varma: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది నేను కాదు: ‘జోష్’ దర్శకుడు
-
RBI: ఆర్బీఐ కొరడా.. ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు పెనాల్టీ
-
నెట్టింట్లో బాలికల నకిలీ నగ్న చిత్రాలు.. AI చిత్రాలపై స్పెయిన్ దిగ్భ్రాంతి
-
Kishan Reddy: గవర్నర్ తమిళిసై నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కిషన్‌రెడ్డి