Shekar: బాగుందంటేనే చూడండి: రాజశేఖర్‌

రాజశేఖర్‌ హీరోగా జీవిత తెరకెక్కించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘శేఖర్‌’. మలయాళ సినిమా ‘జోసెఫ్‌’కు రీమేక్‌గా రూపొందింది. బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, బొగ్గారం వెంకట శ్రీనివాస్‌

Updated : 06 May 2022 14:02 IST

రాజశేఖర్‌ హీరోగా జీవిత తెరకెక్కించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘శేఖర్‌’. మలయాళ సినిమా ‘జోసెఫ్‌’కు రీమేక్‌గా రూపొందింది. బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, బొగ్గారం వెంకట శ్రీనివాస్‌ సంయుక్తంగా నిర్మించారు. మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో హీరో అడివి శేష్‌ ట్రైలర్‌   విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ చాలా బాగుంది. రాజశేఖర్‌ అంటే నాకు చాలా గౌరవం. ఆయన చేసిన ‘మగాడు’ బాగా ఇష్టం. మంచి కంటెంట్‌తో వస్తున్న ‘శేఖర్‌’ ఆయనకు, చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. హీరో రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ‘‘మేమంతా ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాం. సంక్రాంతికే విడుదల చేద్దామనుకున్నాం. కొన్ని పరిస్థితుల వల్ల కుదర్లేదు. ఈనెల 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ప్రేక్షకులకు మేము చెప్పేది ఒకటే.. థియేటర్‌కు వచ్చి సినిమా చూసిన వారు బాగుందంటేనే మా చిత్రం చూడండి. మా సినిమాపై మాకు నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సినిమా తప్ప మాకు ఏమీ తెలియదు. ఇందులోనే మేము చాలా పోగొట్టుకున్నాం. ఇంతకు ముందు చేసిన వాటి కంటే ఈ సినిమాకే ఎక్కువ టెన్షన్‌. ఎందుకంటే దీనికి నేను దర్శకురాలిగానూ పనిచేశాను. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఎమోషనల్‌గా ఫీలవుతారు’’ అన్నారు దర్శకురాలు జీవిత. ఈ కార్యక్రమంలో ముత్యాల రాందాసు, పవన్‌ సాదినేని, ఈషా రెబ్బా, అనూప్‌ రూబెన్స్‌, రవి వర్మ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని