Sivaji: నేను ఏ రాజకీయ పార్టీలో లేను.. ప్రజల గొంతుకగా ఉంటా!: నటుడు శివాజీ

‘#90s: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ (A Middle Class Biopic) ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో శివాజీ పాల్గొన్నారు. అందులో మాట్లాడుతూ తాను ఏ రాజకీయ పార్టీలోనూ లేనన్నారు.

Updated : 30 Dec 2023 18:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను ఏ రాజకీయ పార్టీలో లేనని నటుడు శివాజీ అన్నారు. ఆయన ప్రధానపాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ ‘#90s: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ (A Middle Class Biopic). ఇది జనవరి 5వ తేదీ నుంచి ‘ఈటీవీ విన్‌’ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. తాజాగా దీని ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ జరిగింది. అందులో పాల్గొన్న శివాజీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘నేను ప్రజల్లో ఉన్నానా.. రాజకీయాల్లో ఉన్నానా అనేది ముఖ్యం కాదు. ప్రజల్లో ఉంటే ప్రజల కోసం మాట్లాడతాం. రాజకీయాల్లో ఉంటే ఎవరో ఒకరినీ తిట్టాల్సి వస్తుంది. నేను ఒకప్పుడు భాజపాలో ఉన్నమాట వాస్తవమే. ఏపీ కోసం భాజపా ఇచ్చిన హామీలను విస్మరించడంతో నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు ఏ రాజకీయపార్టీలోనూ లేను. ప్రజల గొంతుకగా ఉంటా. యువత భవిష్యత్తు, ప్రత్యేక హోదా కోసం పోరాడాను. ఈతరానికి రావాల్సిన వనరులు, మౌలిక సదుపాయాలు రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయి. ప్రజల్లో ప్రశ్నించే తత్వం పోయింది. పదేళ్లపాటు నేను ఏపీ కోసం పోరాడాను. మెగాస్టార్‌ కుటుంబానికి ఏపీలో భారీగా అభిమానులున్నారు. సీఎం అవ్వాలంటే మెగా కుటుంబానికి పెద్ద కష్టమేమీ కాదు. ఎక్కడో లోపం ఉంది. దాన్ని సరిదిద్దుకుంటే ఆ కుటుంబంలో ఒకరు సీఎం అవ్వొచ్చు’’ అని చెప్పారు.

‘‘ఈ వెబ్‌సిరీస్‌ కథ వినగానే ఓకే చెప్పాను. దీని షూటింగ్‌ మొదలుపెట్టే సమయానికి నాకు బిగ్‌బాస్‌లో అవకాశం వచ్చింది. ఆ కార్యక్రమానికి వెళ్లడానికి ముందే ఇది పూర్తి చేశా. నాకోసం దీని షూటింగ్‌ త్వరగా మొదలుపెట్టారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకూ ఒకేలా ఉన్నా. కొన్ని సందర్భాల్లో మనకు తెలియని వాళ్లు కూడా మన గురించి ఏవేవో మాట్లాడుకుంటారు. బిగ్‌బాస్‌లో నా క్యారెక్టర్‌ను అందరూ చూశారు. నేను రియల్‌ లైఫ్‌లో కూడా అలానే ఉంటాను. నాకు వచ్చింది నలుగురికి పంచే తత్వం. అది నాకు దగ్గరగా ఉండే వాళ్లకు తెలుసు. ఇండస్ట్రీకి వచ్చాక ఇన్ని సంవత్సరాలకు ‘శివన్నా’ అనే పేరుతో మంచి గుర్తింపు వచ్చింది. దీని వెనుక చాలా బాధలు, అవమానాలు ఉన్నాయి.  ‘#90s: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ టీమ్‌లో వారంతా చాలా ప్రతిభావంతులు. ఈ సిరీస్ ETV WINను మరో స్థాయికి తీసుకువెళ్తుంది’’ అని శివాజీ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని