Tollywood: ఈ జోరు కొనసాగనీ..

ఈ డిసెంబరు ఎంతో ప్రత్యేకం. ఎన్నడూ లేని విధంగా ఈ నెలలో కీలకమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.

Updated : 04 Dec 2023 09:41 IST

బాక్సాఫీస్‌కి వసూళ్ల కళ
ఒక్కనెలలోనే రూ.వందల కోట్ల వ్యాపారం

ఈ డిసెంబరు ఎంతో ప్రత్యేకం. ఎన్నడూ లేని విధంగా ఈ నెలలో కీలకమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. సంక్రాంతి, వేసవిలాంటి సీజన్లని తలపించేలా రూ.వందల కోట్ల ముందస్తు వ్యాపార లావాదేవీలతో చిత్రసీమ తలమునకలైంది. కొన్ని నెలలుగా స్తబ్దుగా కనిపిస్తున్న తెలుగు సినిమా బాక్సాఫీసుకి ఇది మంచి పరిణామం. సినిమాకి క్లైమాక్స్‌లాంటి డిసెంబరు మాసం విజయాల్ని నమోదు చేసిందంటే వచ్చే సంక్రాంతికీ ఇది శుభసంకేతం అవుతుంది. మొన్న శుక్రవారమే వచ్చిన రణ్‌బీర్‌ ‘యానిమల్‌’ వసూళ్లతో ఇప్పటికే అదరగొడుతోంది. ఓ బాలీవుడ్‌ హీరో సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధిస్తుండడం ఆషామాషీ కాదు. మరోవైపు రాబోయే సినిమాలు ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి. ఈ జోరు ఈ నెలంతా కొనసాగిందంటే 2023 విజయవంతంగా ముగిసినట్టే.

సంఖ్యాపరంగా చూస్తే డిసెంబరులో డజనుకిపైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అనువాదాలు మొదలుకొని చిన్నాపెద్దా అన్నీ ఇందులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల హక్కుల రూపంలో ఇవి దాదాపు రూ. 280 కోట్ల వ్యాపారం చేసినట్టు ట్రేడ్‌ వర్గాల లెక్క. ఇందులో ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘సలార్‌’ ప్రదర్శన హక్కులు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి సుమారు రూ.175 కోట్ల మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది.

సినిమాల దూకుడు

తొలి శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘యానిమల్‌’ సినిమా సంచలన విజయం దిశగా దూసుకెళుతోంది. తెలుగు స్టార్ల సినిమాలకి దీటుగా దీనికి ప్రారంభ వసూళ్లు దక్కాయి. అందుకు ప్రధాన కారణం దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. ‘అర్జున్‌రెడ్డి’తో ఆయన ప్రేక్షకులపై చెరిగిపోని ముద్ర వేశారు. దాంతో ఆయన కొత్త సినిమాపై పెద్దఎత్తున అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌తో ఆయన జట్టు కట్టగానే దేశవ్యాప్తంగా సినిమాపై అంచనాలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రభావం మరింతగా కనిపించింది. అందుకే తొలి ఆట నుంచే థియేటర్లు హోరెత్తాయి. పంపిణీ హక్కుల్ని తెలుగు రాష్ట్రాల్లో రూ.16 కోట్లకి దిల్‌రాజు సొంతం చేసుకోగా, తొలి రోజే రూ.15 కోట్లు గ్రాస్‌ వసూళ్లు వచ్చాయి. తొలి వారాంతంలోనే రూ.35 నుంచి రూ.50 కోట్ల వరకూ గ్రాస్‌ వసూళ్లు రావొచ్చని దిల్‌రాజు అంచనా వేస్తున్నారు. రానున్న సినిమాల జోరు... ప్రేక్షకుల హుషారు ఇలాగే కొనసాగిందంటే ఈ నెలంతా బాక్సాఫీసు కళకళలాడటం ఖాయం.

భిన్నమైన కథలతో...

ఇక అందరి చూపూ రానున్న వారాల్లో విడుదలవుతున్న పక్కా తెలుగు సినిమాలపైనే. వచ్చే గురు, శుక్రవారాల్లో నాని ‘హాయ్‌ నాన్న’ చిత్రంతో, నితిన్‌ ‘ఎక్స్‌ట్రా- ఆర్డినరీమేన్‌’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇవి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్‌ హక్కుల రూపంలో రూ.80 కోట్లకిపైగా వ్యాపారం చేసినట్టు అంచనా. నాని ‘హాయ్‌ నాన్న’ భావోద్వేగాలే ప్రధానంగా రూపొందిన ఓ ప్రేమకథ. శౌర్యువ్‌ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించారు. నితిన్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీమేన్‌’ నవ్వించడమే ప్రధానంగా రూపొందిన చిత్రం. డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘సలార్‌’ పాన్‌ ఇండియా హంగులతో రూపొందిన చిత్రం. ఓ ప్రత్యేకమైన ప్రపంచం నేపథ్యంలో, యాక్షన్‌ ప్రధానంగా సాగుతుంది. ప్రభాస్‌ - ప్రశాంత్‌ నీల్‌ కలయిక అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు మరో స్థాయిలో ఉంటాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ఈ సినిమా స్థాయిని చాటింది. త్వరలోనే మరో ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్టు సమాచారం. క్రిస్మస్‌కి ముందు షారుక్‌ ఖాన్‌ ‘డంకీ’తోపాటు, హాలీవుడ్‌ నుంచి ‘అక్వామ్యాన్‌ అండ్‌ ది లాస్ట్‌ కింగ్‌డమ్‌’ అనే చిత్రం వస్తోంది. మల్టీఫ్లెక్స్‌ ప్రేక్షకులు ఈ సినిమాల కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారు. ఇవి కాకుండా ‘పిండం’, ‘బబుల్‌గమ్‌’, ‘జోరుగా హుషారుగా’ తదితర పరిమిత వ్యయంతో రూపొందిన తెలుగు సినిమాలూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని