Updated : 30 Nov 2021 19:25 IST

sirivennela: జగమంత కుటుంబం మీది.. మీరులేక ఏకాకి జీవితం మాది 

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు సినిమా సాహిత్యానికి కొత్త అర్థం చెప్పిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మరణం చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్నో హృదయాల్ని కలచివేసింది. ఆయన్ను, ఆయన కలం నుంచి జారువారిన అక్షరాల్ని గుర్తుచేసుకుంటూ సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం ప్రకటించారు.

* ఇది నమ్మలేని నిజం. సిరివెన్నెల మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు కుడి భుజాన్ని కోల్పోయాననిపించింది. ఇప్పుడు నా ఎడమ భుజాన్ని కోల్పోయా. ఏం చేయాలో, ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఎంతో సన్నిహితంగా ఉండే ఆయన అనుకోకుండా మనల్ని వదిలి వెళ్లిపోయాడంటే నమ్మశక్యంకావడంలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. - దర్శకుడు కె. విశ్వనాథ్‌.

* సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆస్పత్రిలో చేరకముందు ఆయనతో మాట్లాడా. తన ఆరోగ్య పరిస్థితి తెలిసి మద్రాసులో నాకు తెలిసిన ఓ హాస్పిటల్‌కు వెళ్ధామని చెప్పా. ‘ప్రస్తుతానికి ఇక్కడ జాయిన్‌ అవుతా ఉపశమనం పొందకపోతే నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం’ అన్నారు. అలా వెళ్లిన మనిషి ఇలా జీవం లేకుండా వస్తారని ఊహించలేకపోయా. వేటూరిగారి తర్వాత అంత గొప్ప సాహిత్య విలువలను ఈ తరానికి అందించిన రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన భాషను అర్థం చేసుకోవడానికి మనకున్న పరిజ్ఞానం సరిపోదు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించిన రోజు నేను ఆయన ఇంట్లో చాలాసేపు గడిపాను. ఓ ఆత్మీయుడ్ని కోల్పోయా. గుండె బరువెక్కిపోతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. నా ‘రుద్రవీణ’ చిత్రంలో ‘తరలిరాద తనే వసంతం.. తన దరికిరాని వనాల కోసం’ అంటూ ఓ పాట రాశారు. ఇప్పుడు ఆయన మనందర్నీ వదిలి వెళ్లిపోయారు. భౌతికంగా ఆయన దూరమైనా తన పాటలతో బతికే ఉన్నారు.  - నటుడు చిరంజీవి.

* సినీ పాటకు సాహితీ గౌరవం కల్పించిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి. తెలుగు పాటను దశదిశలా వ్యాపింపజేసిన ఘనత సిరివెన్నెలకే దక్కుతుంది. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా.  - నటుడు నందమూరి బాలకృష్ణ.

* సిరి వెన్నెల సీతారామశాస్త్రి నా సన్నిహితుడు. సరస్వతీ పుత్రుడు.  విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. - నటుడు మోహన్‌ బాబు.

* సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా ఉంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని  భగవంతుడ్ని మనసారా ప్రార్థిస్తున్నా. - నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌.

* ఏం మాట్లాడాలో తెలియడంలేదు. అన్నయ్యతో నా అనుబంధం ఇప్పటిది కాదు. నిర్మాతగా నా తొలి చిత్రం ‘లేడీస్‌ టైలర్‌’లో అన్ని పాటలూ ఆయనే రాశారు. బహుశా ఏ నిర్మాతకూ రాయనన్ని పాటలు నా చిత్రాలకు రాశారని చెప్పొచ్చు. ఎంత బాగా రాసినా ఇంకా బాగా రాయాలని పరితపించేవారు. కరోనా తర్వాత ఆయన్ను కలవడం కుదర్లేదు. కోలుకుని త్వరలోనే తిరిగి వస్తారనుకున్నా. కానీ, ఇంతలో విషాద వార్తని వినాల్సి వస్తుందని ఊహించలేదు. - నిర్మాత స్రవంతి రవికిశోర్‌.

* ఇంకెక్కడి వెన్నెల.. తెలుగు పాటకు అమావాస్య. - దర్శకుడు హరీశ్‌ శంకర్‌.

* ఆయన సాహిత్యంలోని ‘సిరివెన్నెల’ మన మనసుల మీద ఎప్పటికీ అలానే వుంటుంది. వీడ్కోలు గురువు గారు. - నటుడు నాని.

* గొప్ప ప్రతిభ.. అంతకు మించి గొప్ప వ్యక్తిత్వం.. రెండూ ఒకే దేహంలో ఇమిడిన వ్యక్తివి నువ్వు. అన్నయ్యా! అందర్నీ వదిలిపెట్టి వెళ్లిపోయావ్. నువ్వు రాసిన ప్రతీ పాట, ప్రతీ మాట ఎప్పటికీ మాతో ఉంటాయి. వాటిని ఆచరించే మాలో నువ్వు ఉంటావు. - నటుడు నాగబాబు.

* సిరివెన్నెలగారు చనిపోయారన్న వార్త వినగానే షాక్‌కు గురయ్యా.  తన సాహిత్యంతో తెలుగు సినిమాకు ఎంతో సేవ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరకుంటున్నా. - నటుడు నితిన్‌.

* తెలుగు జాతిని విషాదంలో ముంచిన వార్త ఇది. మిమ్మల్ని మిస్‌ అవుతున్నాం సర్‌. మీరు లేని తెలుగు సినిమా సాహిత్యాన్ని ఊహించుకోలేం. ఓం శాంతి. - నటుడు సుధీర్‌బాబు.

* మీ సాహిత్యంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేసినందుకు ధన్యవాదాలు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు. మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోం. మీతో కలిసి పనిచేసినందుకు గౌరవంగా ఫీల్‌ అవుతున్నా. -నటుడు రామ్‌ పోతినేని.

* నా తొలి సినిమా సమయంలో తెలుగు నేర్చుకుంటున్నప్పుడు కవిత్వాన్ని ఎలా చదివాలో చెప్పారు. తెలుగు భాషపై నాకు ప్రేమ కలిగేలా చేశారు. ఆయనో లెజెండ్‌. - నటుడు సిద్ధార్థ్‌.

* సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు లేరన్న విషయం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎవరూ తీర్చలేని లోటు ఇది. తెలుగు సినిమాకి సిరివెన్నెలగారు చేసిన సేవే ఆయన్ను ఎప్పటికీ గుర్తుండేలా చేస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. - నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌.

* గురూజీ! అందర్నీ వదిలిపెట్టి వెళ్లిపోయావ్. నువ్వు రాసిన ప్రతీ పాట, ప్రతీ మాట ఎప్పటికి మాతో ఉంటాయి. వాటిని ఆచరించే మాలో నువ్వు ఉంటావు. - నటుడు బండ్ల గణేశ్‌.

* జగమంత కుటుంబం మీది. మీరు లేక ఏకాకి జీవితం మాది. మా జీవితాల్లో కవిత్వాన్ని నింపినందుకు ధన్యవాదాలు గురూజీ! సిరివెన్నెలగారు లేని లోటు తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. - నటుడు ప్రకాశ్‌రాజ్‌.

* పాటే శ్వాసగా జీవిస్తూ.. వెండితెర మీద సిరివెన్నెలలు కురిపించిన మా సీతారామశాస్త్రి ఇక లేరు అనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నా. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, దివ్యలోక ప్రాప్తికలగాలని కోరుకుంటున్నా - పరుచూరి గోపాలకృష్ణ.

* సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిస్తున్నా. - నటుడు నందమూరి కల్యాణ్‌రామ్‌.

* సాహిత్య లెజెండ్‌ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా. - సంగీత దర్శకుడు తమన్‌.

* సిరివెన్నెల మా అందరికీ ఆదర్శనీయుడు, మార్గదర్శకుడు. 1995 నుంచి ఆయనతో నాకు పరిచయం ఉంది. సిరివెన్నెల చీకట్లో కలిసిపోయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఆయన సిరా.. వెన్నెల. ఆయన ఏ పాట రాసినా మాకు మార్గదర్శకంగా ఉండేది. ‘నమస్తే అన్న’లో నేను రాసిన మొదటి పాట చూసి నన్ను ఆశీర్వదించిన గొప్ప మనసు ఆయనది. తెలుగు సినిమా పాటకు, సాహిత్యలోకానికి చాలా పెద్ద నష్టం. ఈ నష్టం పూరించేది కాదు. ఎవరూ ఆయన్ను అనుకరించలేరు. మా పెద్ద దిక్కు కోల్పోయినట్టు అనిపిస్తుంది. - సుద్దాల అశోక్‌ తేజ, గేయ రచయిత.

* సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి. - శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ.

* మీ పాటలే మేం నేర్చుకున్న పాఠాలు. మీ సూక్తులు మేం రాసుకొనే మాటలు. బ్రహ్మ ఒక్కడే కష్టపడుతున్నాడు అని  సాయంగా ఇంత తొందరగా వెళ్లిపోయారా? నా పాట పూర్తి చేసి వెళ్లిపోయారు కానీ పాఠం మధ్యలోనే వదిలేసారు గురూజీ! భరించలేని నిజాన్ని చెవులు వింటున్నాయి కానీ మనసు ఒప్పుకోవటం లేదు. - దర్శకుడు మారుతి.

* అక్షరానికి అన్యాయం చేసి, సాహిత్యాన్ని ఒంటరి చేసి అందనంత దూరం వెళ్లిపోయిన మహాకవి, మహా మనిషి.. గురువు గారు సీతారామశాస్త్రి గారికి కన్నీటి వీడ్కోలు. - రచయిత కోన వెంకట్‌.

* సిరివెన్నెల సీతారామశాస్త్రి లేరన్న వార్త హృదయాన్ని ముక్కలు చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. - దర్శకుడు గోపీచంద్‌ మలినేని.

Read latest Cinema News and Telugu News


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని