Jai Bhim: సూర్య.. క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు: కాట్రగడ్డ ప్రసాద్‌

కోలీవుడ్‌ నటుడు సూర్య లాయరుగా నటించిన చిత్రం ‘జై భీమ్‌’. ఇటీవల ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌’ వేదికగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

Published : 17 Nov 2021 01:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ నటుడు సూర్య లాయరుగా నటించిన చిత్రం ‘జై భీమ్‌’. ఇటీవల ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌’ వేదికగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ‘తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది’ అంటూ సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు, ఈ చిత్రంలోని సన్నివేశాలు ‘వన్నియార్లు’ అనే వర్గాన్ని అవమానించేలా ఉన్నాయని ఆ సంఘం అధ్యక్షుడు అన్బుమణి రామదాస్‌ ఆరోపించారు. సూర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యాఖ్యలపై దక్షిణాది చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్‌ స్పందించారు.

సూర్య ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వన్నియార్‌ సంఘం తెలిపిన అభ్యంతరంపై సూర్య స్పందించి వెంటనే ఆ లోగోను తొలగించారని తెలిపారు. అలా చేసినా అన్బుమణి రామదాస్ తమకు..  సూర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం అర్థరహితమన్నారు. సూర్యపై ఇలాంటి ఫిర్యాదులు రావడం విచారకరమని, అన్బుమణి తమ డిమాండ్‌ను ఉపసంహరించుకోవాలన్నారు. పేద ప్రజలు, గిరిజనులకు సూర్య ఎంతో సాయం చేశారని గుర్తు చేశారు. సూర్య చిత్రాల విషయంలో రాజకీయాలు చేయవద్దన్నారు. సినిమాలు, రాజకీయాలు వేరనే విషయాన్ని రాజకీయ నేతలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ న్యాయవాది చంద్రు కెరీర్‌లో కీలకంగా నిలిచిన ఓ కేసు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. త.శె.జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించారు. చేయని తప్పునకు జైలుపాలై, ప్రాణాలు కోల్పోయిన తన భర్త పరిస్థితి మరొకరికి రాకూడదని ఓ మహిళ చేసిన న్యాయం పోరాటమే ఈ సినిమా కథాంశం.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని