Pushpa: నీ చూపులపైనే.. రెప్పలు వేసి కప్పేస్తావే

‘‘నిను చూస్తూవుంటే కన్నులు రెండు తిప్పేస్తావే... నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే’’... ఎక్కువ మంది అబ్బాయిల కాలర్‌ ట్యూన్‌గా మారిపోయాయీ వాక్యాలు. ‘‘చూపే బంగారమాయెనే.. శ్రీవల్లీ... మాటే మాణిక్యమాయెనే’’... ఎక్కువ మంది అమ్మాయిల రింగ్‌ ట్యూనై పల్లవిస్తోంది ఈ పాట. అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా, రష్మిక మందాన నాయికగా దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ చిత్రంలోని ఈ గీతం యువ

Updated : 18 Nov 2021 07:23 IST

‘‘నిను చూస్తూవుంటే కన్నులు రెండు తిప్పేస్తావే... నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే’’... ఎక్కువ మంది అబ్బాయిల కాలర్‌ ట్యూన్‌గా మారిపోయాయీ వాక్యాలు. ‘‘చూపే బంగారమాయెనే.. శ్రీవల్లీ... మాటే మాణిక్యమాయెనే’’... ఎక్కువ మంది అమ్మాయిల రింగ్‌ ట్యూనై పల్లవిస్తోంది ఈ పాట. అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా, రష్మిక మందాన నాయికగా దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ చిత్రంలోని ఈ గీతం యువ హృదయాల్లో రోజూ మోగుతూనే ఉంది. యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్‌తో ప్రేక్షకాదరణ పొందుతోంది. ప్రేమికుడెవరైనా సరే... అతని మనసులోకి వెళ్లి... అతని భావనలు తెచ్చి... మన కళ్లకు అక్షరాలుగా అలంకరించే విద్య గీత రచయిత చంద్రబోస్‌కు బాగా తెలుసు. అలా సంగీత ప్రియులను అలరిస్తున్న ‘శ్రీవల్లి’ పాటలోని సాహిత్యం, నేపథ్యం గురించి చంద్రబోస్‌ ‘ఈనాడు సినిమా’తో ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

చిత్రం: పుష్ప

గీతరచన: చంద్రబోస్‌
సంగీతం: దేవీశ్రీప్రసాద్‌
గాయకుడు: సిద్‌ శ్రీరామ్‌
దర్శకుడు: సుకుమార్‌


పల్లవి:

నిను చూస్తూవుంటే
కన్నులు రెండు తిప్పేస్తావే
నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే
కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే
కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే
చూపే బంగారమాయెనే.. శ్రీవల్లీ
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయెనే.. శ్రీవల్లీ
నవ్వే నవరత్నమాయెనే...


చరణం 1:

అన్నిటికీ ఎప్పుడూ ముందుండే నేను
నీ ఎనకే ఇపుడూ పడుతూ ఉన్నాను
ఎవ్వరికీ ఎపుడు తలవంచని నేను
నీ పట్టీ చూసేటందుకు తలనే వంచాను
ఇంతబతుకు బతికి నీ ఇంటిసుట్టూ తిరిగానే
ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే
।।చూపే బంగారమాయెనే।।


చరణం 2 :

నీ స్నేహితురాళ్లు ఓ మోస్తరుగుంటారు
అందుకనే ఏమో నువ్వు అందంగుంటావు
పద్దెనిమిది ఏళ్లు వచ్చాయా చాలు
నువ్వేకాదెవ్వరైనా ముద్దుగా వుంటారు
ఎర్రచందనం చీర కడితే
రాయి కూడా రాకుమారే
ఏడురాళ్ల దుద్దులు పెడితే
ఎవరైన అందగత్తే...
అయినా... ।।చూపే బంగారమాయెనే।।


యువకులు ఓ అమ్మాయిని ఇష్టపడతారు. ఆమె కళ్లలో పడేందుకు ఎంతో ప్రయత్నిస్తారు. అయినా ఆ అమ్మాయి చూడలేదనుకో... అప్పుడేమంటారు? నేనూ గొప్పవాణ్నే... అయినా నీ వెంట పడుతున్నా అని చెబుతూ... ‘ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే’ అంటాడు పుష్పరాజ్‌. అత్యంత సాధారణమైన భావ వ్యక్తీకరణ ఇది. అందుకే ప్రేక్షకులకు అంత బాగా కనెక్టయ్యింది. నేను ఇంతగా వెంటపడుతున్నా... నువ్వు చూడటం లేదు కదా? నువ్వేమన్నా అందగత్తెవు అనుకుంటున్నావా? అని ‘ఎర్రచందనం చీర కడితే... రాయి కూడా రాకుమారే’ అంటూ ప్రేయసిని ఉడికిస్తాడు. అలా పుష్ఫరాజ్‌ పాత్ర తాలుకు భావనలే పాటలో కన్పిస్తాయి.


‘రంగస్థలం’లో రామలక్ష్మి ఎంత అందగత్తో... ఆమె తనకు ఎంత అపురూపమో చెబుతూ చిట్టిబాబు పాడుకొనే పాట.. ‘ఎంతసక్కగున్నావే..’. చిట్టిబాబులా మెత్తనైన వ్యక్తి కాదు... పుష్పరాజ్‌. పొగరున్నోడు. బిరుసున్నోడు. మరి అతను తన ప్రియురాలి పట్ల ఎలా స్పందిస్తాడు? ‘నువ్వేం పెద్ద అందగత్తెవు కాదు... పద్దెనిమిది ఏళ్లు వచ్చాయా చాలు నువ్వే కాదెవ్వరైనా అందంగుంటారు’ అంటాడు. ఏ పాట రాసినా అందులో రచయిత కన్పించకూడదు. పాత్ర స్వభావమే దర్శనమివ్వాలి. అప్పుడు అది ఎక్కువ మందికి చేరవవుతుంది. ‘పుష్ప’ చిత్రంలో పుష్పరాజ్‌ చాలా మొండివాడు. ఎవరికీ తలవంచని మనస్తత్వం. అయినా శ్రీవల్లి అంటే ఇష్టం. తను ఎక్కడా తగ్గకుండా ... తన ప్రేయసి కోసం పాట పాడాలి. ఇందులో అదే సవాల్‌. మామూలుగా అయితే ప్రియురాలు అద్భుతం.. దేవదూత అంటూ పొగుడుతూ పాటలు చాలా రాశా. ఇక్కడ అలా కాదు... ‘ఎవ్వరికీ ఎపుడు తలవంచని నేను... నీ పట్టీ చూసేటందుకు తలనే వంచాను’ అని మొదటి చరణంలో రాశా.


‘పలుకే బంగారమాయెనే’ అనే రామదాసు కీర్తన స్ఫూర్తిగా ‘చూపే బంగారమాయెనే’, ‘మాటే మాణిక్యమాయెనే’, ‘నవ్వే నవరత్నమాయెనే’ అంటూ పల్లవి రాసుకుంటూ వచ్చా. సుకుమార్‌ గారు, నేను కలసి మూడు నాలుగు సార్లు కూర్చొని చర్చించుకొని ఆ పాట పూర్తిచేశా. ఆత్మాశ్రయ కవిత్వం.. వస్త్వాశ్రయ కవిత్వం... అని ఉంటాయి. ఒక వస్తువు, సంఘటన.. చూసినప్పుడు మన మనసులో కలిగే భావన రాస్తే అది ఆత్మాశ్రయ కవిత్వం. అదే వస్తువు, సంఘటన గురించి రాస్తే వస్త్వాశ్రయ కవిత్వం. ‘శ్రీవల్లి’ పాట వస్త్వాశ్రయ కవిత్వానికి దగ్గరగా ఉంటుంది. దేవీశ్రీ


ప్రసాద్‌ సంగీతం, సిద్‌ శ్రీరామ్‌ గాత్రం దీనికి తోడై పాటను ప్రేక్షకరంజకంగా మార్చాయి. సాధారణంగా స్నేహితులు, పరిశ్రమ పెద్దల నుంచి ప్రశంసలు వస్తుంటాయి. ఈ పాట విడుదలైన వెంటనే అలా ఎంతో మంది అభినందించారు. అమెరికాలో ఎం.ఎస్‌. చదువుతున్న యువకులు కొందరు ఫోన్‌ చేసి ఇందులోని సాహిత్యాన్ని మెచ్చుకోవడం నేను మరచిపోలేని అనుభూతి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని