The Boy in the Striped Pajamas: కంచెకు అల్లుకున్న స్నేహ పరిమళం

స్నేహానికి కుల, మత బేధాలుండవు ఉన్నదల్లా రెండు ప్రాణాలు... ప్రాంతం, దేశం విభేదాలుండవు కావాల్సిందిల్లా రెండు హృదయాలు ఆంక్షలు, హద్దులు స్నేహాన్ని అడ్డుకోలేవు కక్షలు, వివక్షలు దాన్ని బంధించలేవు...

Published : 02 Aug 2021 10:50 IST

ప్రేక్షకాలమ్‌

సినిమా: ది బాయ్‌ ఇన్‌ ది స్ట్రిప్డ్‌ పజామస్‌; భాష: ఇంగ్లీష్; దర్శకత్వం: మార్క్‌ హెర్మన్‌; నటీనటులు: బట్టర్‌ఫీల్డ్, జాక్‌ స్కాన్లన్, వెరా ఫెర్మిగా, తదితరులు; సంగీతం: జేమ్స్‌ హార్నర్‌; సినిమాటోగ్రఫీ: బెనొయిట్‌ డెల్హొమ్‌; విడుదల: 2008; నిడివి: 98 నిమిషాలు;

స్నేహానికి కుల, మత బేధాలుండవు ఉన్నదల్లా రెండు ప్రాణాలు... ప్రాంతం, దేశం విభేదాలుండవు కావాల్సిందిల్లా రెండు హృదయాలు ఆంక్షలు, హద్దులు స్నేహాన్ని అడ్డుకోలేవు కక్షలు, వివక్షలు దాన్ని బంధించలేవు... అలాంటి కల్మషం లేని హృదయాలను చూడాలని ఉందా? స్నేహం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని పసి మనసుల గురించి తెలుసుకోవాలనుందా?

సినిమాలోని నేపథ్యానికి తగ్గట్లు అందించిన జేమ్స్‌ హార్నర్‌ సంగీతం మనసుల్ని తడి చేస్తుంది. బెనొయిట్‌ డెల్హొమ్‌ తన కెమెరాతో ఆ నాటి విషాద కాలాన్ని కళ్లకు కట్టాడు. ఇక పతాక సన్నివేశాల్లో వచ్చే సన్నివేశాలు చూసి తట్టుకోవడం కష్టమవుతుంది. గుండెలను తడిపేసే కన్నీళ్లు కొన్నాళ్ల పాటు వెంటాడతాయి. కంచెలు తెంచుకుని విరబూసిన వీరి స్నేహ  పరిమళం మాత్రం చిరకాలం మదిలో నిలిచిపోతుంది.

రెండో ప్రపంచ యుద్ధం  సమయంలో జరిగిన మారణహోమం గురించి తెలిసిందే. యూదులను గుట్టలుగా గదుల్లో కుక్కి జరిపిన దారుణ మారణకాండను తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్లు వణికిపోతుంది. ఆ  హోలోకాస్ట్‌ మీద ఇప్పటి వరకు వందల్లో చిత్రాలు తెరకెక్కాయి. స్టీఫెన్‌ స్పీల్‌బర్గ్‌ ‘ది సిండ్లర్స్‌ లిస్ట్‌’,   ‘ది పియానిస్ట్‌’, ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ లాంటి క్లాసిక్‌ సినిమాలు ఈ ఉదంతం మీద తెరకెక్కినవే. ఆనాటి విషాదాన్ని కళ్లకు కట్టిన సినిమాలివి. ‘ది బాయ్‌ ఇన్‌ ది స్ట్రిప్డ్‌ పజామస్‌’ అనే పుస్తకం 2006లో వచ్చింది. దాని ఆధారంగానే అదే పేరుతో తెరకెక్కిన చిత్రం 2008లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. చుట్టూ ద్వేషం నిండుకున్న వాతావరణంలో రెండు పసిహృదయాలు స్నేహాన్ని   ఏర్పరుచుకున్న తీరు ముచ్చటగొలుపుతుంది. అందులో ఒకరు నిర్బంధ శిబిరంలో బాధితుడైన యూదు బాలుడు అయితే, మరొకరు నాజీ వర్గానికి చెందిన కుటుంబంలో పుట్టిన పిల్లాడు. ఇద్దరూ రెండు విరుద్ధమైన జాతులకు చెందినవాళ్లు. అయినా వారిద్దరిని ఒక్కటి చేసి కలిపింది స్నేహబంధం. కంచెలు దాటుకొని, జాతి వైరాన్ని తెంచుకొని నిలుపుకొన్న అరుదైన, అమోఘమైన స్నేహం వారిది. ఆ స్నేహితులపైన తెరకెక్కిన సినిమానే ‘ది బాయ్‌ ఇన్‌ ది స్ట్రిప్డ్‌ పజామస్‌’.

కథ: బ్రూనో.. 8 ఏళ్ల పసిబాలుడు. బెర్లిన్‌లో స్నేహితులతో ఆటలు ఆడుతూ, వీధుల్లో జాలీగా తిరిగే ఆనందకర బాల్యమతడిది. రెండో ప్రపంచయుద్ధం జరిగే ఆ సమయంలో అక్కడి దారుణాలేమీ తెలియని అమాయకుడు. అతడి తండ్రి నాజీ సైన్యంలో అధికారి. జర్మనీ రాజధాని బెర్లిన్‌ నుంచి పొలాండ్‌కు బదిలీపై వెళ్లాల్సి వస్తుంది. అతడితో పాటే కుటుంబమూ వెంట వెళ్తుంది. ఇన్నాళ్లు స్నేహితులతో ఆడుతూ పాడుతూ తిరిగినా బ్రూనోకు అక్కడి వాతావరణం అంతగా నచ్చదు. ఇంటి చుట్టుపక్కల ఎవరూ ఉండరు. కనీసం ఆడుకోడానికి ఒక్కరైనా కనిపించరు. స్నేహితులు లేకపోవడంతో బ్రూనోను ఒంటరితనం బాధిస్తుంటుంది. ఆ ఏకాకితనం భరించలేక తిరిగి బెర్లిన్‌కు వెళ్లిపోదామని అమ్మానాన్నలను అడుగుతూ ఉంటాడు. వీళ్లింటికి కొంత దూరంలోనే యూదుల నిర్బంధ శిబిరం ఉంటుంది.  కిటికీలోంచి చూసినప్పుడు ఆ శిబిరం బ్రూనోకు కనిపిస్తుంది. అది వ్యవసాయ క్షేత్రమని అబద్ధం చెబుతారు తల్లిదండ్రులు. శిబిరంలోని చిమ్నీల నుంచి నిరంతరం పొగ వెలువడుతూనే ఉంటుంది. యూదులను వందలాదిగా కాల్చాక వెలువడే పొగ అది. ఈ విషయం ఆ పిల్లాడికి తెలియదు. బ్రూనోకు అడ్వెంచర్‌ బుక్స్‌ చదవడం అంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలను అన్వేషించాలనే కోరిక సహజంగానే అతడిలో ఉంటుంది. అందుకే తను ఆ శిబిరానికి వెళ్లాలనుకుంటాడు. దానికి వాళ్లమ్మ అంగీకరించదు. ఒకరోజు తల్లి బయటకు వెళ్లిన సమయంలో ఇంటి వెనక ద్వారం నుంచి బయటపడతాడు. అలా వెళ్తూ ఉండగానే ఒక కంచె కనిపిస్తుంది. మరింత దగ్గరికి వెళ్లి చూస్తే మాసిపోయిన నీలిరంగు చారల దుస్తుల్లో ష్మూల్‌ కనిపిస్తాడు. ష్మూల్‌ యూదు బాలుడు. అక్కడే నిర్బంధ శిబిరంలో బానిసగా ఉంటాడు. కొన్ని రోజులుగా నాన్న జాడ  కనిపించదు. ఒంటరితనంతో నీరసంగా కనిపిస్తాడు. ఇద్దరికీ స్నేహం ఏర్పడుతుంది. మంచి స్నేహితులు అవుతారు. వీరిద్దరి మధ్య ఉండే జాతి అనే కంచెను తొలగించి ఒక్కటవుతారు. ఆ స్నేహం ఎటు దారితీసింది? కలకాలం నిలిచిందా? కాలానికి బలి అయ్యిందా? అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

పుట్టుకతోనే ఎవరూ బద్ధశత్రువులుగా పుట్టరు. మనుషులుగా అందరం ఒకటే అనే కోణంలో ఈ సినిమా సాగుతుంది. బ్రూనో, ష్మూల్‌గా నటించిన  బాలనటులు నిజంగా ఏడిపించేస్తారు. బాల్యంలో ఉండే అమాయకత్వం, కల్మషం లేని మనసులు వీరి పాత్రల్లో కనిపిస్తాయి. అక్కడ యూదులను ఆహుతిగా చేస్తేనే ఆ చిమ్నీల్లోంచి పొగ వస్తుందనే విషయం ఆ పసి  హృదయాలకు తెలియదు. ఏవో దుస్తులు కాలుస్తున్నారని అనుకుంటారు. కంచెకు చెరో పక్క ఉంటూనే   ఒకరిపై ఒకరు అభిమానాన్ని పెంచుకుంటారు. ఆ  నిష్కల్మషమైన స్నేహం మనల్ని మెలిపెడుతుంది. భావోద్వేగంలో ముంచెత్తుతుంది. మరొక సందర్భంలో బ్రూనో ఇంట్లో పాత్రలు తుడిచేందుకు ష్మూల్‌ వస్తాడు. అక్కడా మనస్ఫూర్తిగా స్నేహం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. నాజీలతో మాట్లాడే అర్హత లేదని ఆంక్షలుంటాయి. ష్మూల్‌ తన స్నేహితుడు కాడని చెప్పి అతడి శిక్షకు కారణమయ్యాక బ్రూనో పశ్చాత్తపపడే తీరు కదలిస్తుంది. వీరిద్దరి స్నేహంతో పాటే ఆ కాలంలో యూదులపై ఎంతటి వివక్ష ఉండేదో తెరపై చూపించాడు దర్శకుడు. ఇక ఒకప్పుడు డాక్టర్‌గా పనిచేసిన ఆ ఇంట్లో ఆలుగడ్డలు కోసే వృద్ధ యూదుడి కథ బాధిస్తుంది. ఆయన తెరపై కనిపించిన ప్రతిసారి కన్నీటి తెర కమ్ముకుంటుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని