
Skylab review: రివ్యూ: స్కైలాబ్
చిత్రం: స్కైలాబ్; నటీనటులు: నిత్యామేనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి, తులసి, విష్ణు, అనూష తదితరులు; సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి, ఛాయాగ్రహణం: ఆదిత్య జవ్వాది; కూర్పు: రవితేజ గిరిజాల, ప్రొడక్షన్ డిజైన్: శివం రావ్; సౌండ్ రికార్డిస్ట్: నాగార్జున తల్లపల్లి, సౌండ్ డిజైన్: ధనుష్ నయనార్, కాస్ట్యూమ్స్: పూజిత తాడికొండ; సహ నిర్మాత: నిత్యామేనన్; నిర్మాత: పృథ్వీ పిన్నమరాజు; మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విశ్వక్ ఖండేరావు; సంస్థ: బైట్ ఫ్యూచర్స్, నిత్యామేనన్ కంపెనీ; విడుదల: 04-12-2021
1970 దశకం చివర్లో స్కైలాబ్ సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. నాసా ప్రయోగించిన ఆ అంతరిక్ష నౌక ఎప్పుడు భూమ్మీద పడిపోతుందో అంటూ కొన్ని దేశాలకి చెందిన ప్రజలు కొన్నాళ్లపాటు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఆ గండం గట్టెక్కిన సమయంలో పుట్టిన చిన్నారులకి తెలుగు రాష్ట్రాల్లో స్కైలాబ్ పేరుతో పేర్లు కూడా పెట్టుకున్నారు. కొన్ని ఊళ్లల్లో సంబరాలు కూడా చేసుకున్నారు. అందులో కరీంనగర్ జిల్లా, బండలింగంపల్లి కూడా ఒకటి. ఆ ఊరి నేపథ్యంలోనే యువ దర్శకుడు విశ్వక్ ఖండేరావు ‘స్కైలాబ్’(Skylab) పేరుతో సినిమాని రూపొందించాడు. ఇటీవల చిత్రసీమకి నవతరం కొత్త ఆలోచనలతో వస్తోంది. అందుకు తగ్గట్టే చిత్ర పరిశ్రమ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. తరచూ భిన్నమైన ప్రేక్షకుల ముందుకొస్తూ విజయాన్ని అందుకుంటున్నాయంటే కారణం అదే. మరి ‘స్కైలాబ్’(Skylab review) కూడా ఆ జాబితాలో చేరబోతోందా? ఆసక్తి రేకెత్తించిన ప్రచార చిత్రాలకి తగ్గట్టే సినిమా ఉందా?
కథేంటంటే: ఆనంద్ (సత్యదేవ్)(Satyadev) వైద్యం చదువుకున్న యువకుడు. తన తాతగారి ఊరైన బండ లింగంపల్లికి వస్తాడు. ఆ ఊరికి చెందిన సుబేదార్ రామారావు (రాహుల్ రామకృష్ణ)(Rahul Ramakrishna)తో పరిచయం పెంచుకుని క్లినిక్ ప్రారంభించే పనిలో ఉంటాడు. సుబేదార్ రామారావుది మరో కథ. ఒకప్పుడు బాగా బతికిన తన కుటుంబాన్ని కష్టాల్లో నుంచి గట్టెక్కించడం కోసం పోరాటం చేస్తుంటాడు. ఇద్దరూ క్లినిక్ ప్రారంభిస్తారో లేదో ఆ వెంటనే ఊళ్లో స్కైలాబ్ పడుతుందనే భయాలు మొదలవుతాయి. దాంతో వాళ్లిద్దరి కథ మొదటికి వస్తుంది. ఆ ఊరి దొరబిడ్డే గౌరి (నిత్యమేనన్)(Nithya Menen)ది ఇంకో కథ. ఆమె పాత్రికేయురాలిగా రాణించే ప్రయత్నంలో ఉంటుంది. ఆ ఉద్యోగం లేకపోతే తన తండ్రి పెళ్లి చేసేస్తాడేమో అనే భయం ఆమెది. పట్నం నుంచి ఊరికి వచ్చిన గౌరి అక్కడి నుంచే వార్తలు రాయడం మొదలు పెడుతుంది. కానీ, పత్రికలో మాత్రం ప్రచురణ కావు. మరి ఆమె రాసిన కథలు ఎప్పుడు ప్రచురణకి నోచుకున్నాయి? ఆనంద్ క్లినిక్ పెట్టాడా? రామారావు కష్టాలు తీరాయా? స్కైలాబ్(Skylab) భయాలు ఆ ఊరిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: అరుదైన నేపథ్యంతో కూడిన కథ ఇది. కామెడీతోపాటు బలమైన భావోద్వేగాలు, డ్రామాకి చోటుండేలా కథల్ని అల్లుకున్నాడు దర్శకుడు(Skylab review). కానీ వాటిని తెరపైకి పక్కాగా తీసుకురావడంలో తడబడ్డాడు. సగం సినిమా తర్వాత కానీ అసలు కథ మొదలు కాకపోవడం, ప్రథమార్ధంలో సున్నితమైన కామెడీ పెద్దగా ప్రభావం చూపించకపోవడం సినిమాకి మైనస్‌గా మారింది. పతాక సన్నివేశాలకి ముందు కథ హృదయాల్ని కాస్త బరువెక్కిస్తుంది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఇలాంటి కథలకి రచన, నిర్మాణం పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా కీలకం. ఆ విషయంలో చిత్రబృందం చేసిన ప్రయత్నం మెచ్చుకోదగ్గ స్థాయిలోనే ఉంటుంది. సహజమైన మాటలు, మూడు ప్రధాన పాత్రల కథలు, 1970 దశకాన్ని గుర్తు చేసేలా సహజమైన వాతావరణాన్ని సృష్టించిన తీరు, సంగీతం... ఇలా అన్నీ మెచ్చుకోదగ్గ స్థాయిలోనే ఉంటాయి.
కానీ, ఆరంభంలోనే పాత్రల్ని పరిచయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, ఆయా సన్నివేశాలు మరీ నత్తనడకలా సాగడంతో సినిమా ఏ దశలోనూ రక్తికట్టదు. ప్రధాన పాత్రలకి ప్రత్యేకంగా కథలున్నా, అవి భావోద్వేగాల పరంగా మాత్రం పెద్దగా ప్రభావం చూపించవు. ఊళ్లో స్కైలాబ్(Skylab) హడావుడి మొదలు కావడం నుంచే కాస్త కథలో వేగం పుంజుకుంటుంది. భయం బతుకుని ఎలా నేర్పుతుందనే విషయాల్ని పతాక సన్నివేశాల్లో చక్కగా ఆవిష్కరించారు. డబ్బున్నోళ్లంతా వాటిని కాపాడుకోవడం కోసం దాక్కోవడం, లేనివాళ్లంతా తమ తమ చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడం, దళితులు దేవాలయాల్లోకి ప్రవేశించడం, ఆ నేపథ్యంలో పండే భావోద్వేగాలు హత్తుకుంటాయి. కచ్చితంగా ఇదొక కొత్త రకమైన సినిమానే. ఆస్వాదించడానికి కాస్త ఓపిక కావాలంతే(Skylab review).
ఎవరెలా చేశారంటే: నిత్యమేనన్ (Nithya Menen) నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. గౌరి పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. ఈ సినిమా నిర్మాణంలోనూ ఆమె భాగస్వామి కావడంతో అందరిలోనూ ఆసక్తి వ్యక్తమైంది. ఆమె ఈ కథని ఎంతగా నమ్మారో ఆమె నటన, తెరపై కనిపించిన విధానం స్పష్టం చేసింది. సత్యదేవ్(Satyadev), రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) వాళ్ల పాత్రల్లో ఒదిగిపోయారు. ఇద్దరూ కూడా పతాక సన్నివేశాల్లో సినిమాపై బలమైన ప్రభావమే చూపించారు. గౌరి అసిస్టెంట్‌గా కనిపించే విష్ణు, తులసి, తనికెళ్ల భరణి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ప్రొడక్షన్ డిజైనింగ్ పనితనం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించిన తీరు చాలా బాగుంది. ప్రశాంత్ ఆర్. విహారి నేపథ్య సంగీతంతోపాటు పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆదిత్య కెమెరా పనితనం కూడా మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. సినిమాకి స్పష్టత అవసరం. కానీ దర్శకుడు విశ్వక్ ఆ విషయంలో మరీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపిస్తోంది. చిన్న చిన్న పాత్రల్ని కూడా మరీ డీటెయిల్డ్‌గా మలిచే ప్రయత్నం చేశారు. కానీ, ఆయన ఎంచుకున్న నేపథ్యం, ఆయన రచనలోని ప్రతిభ మాత్రం ఆకట్టుకుంటుంది.
బలాలు
+ పతాక సన్నివేశాలు
+ 1970ల వాతవరణం
+ నిత్యమేనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణల నటన
బలహీనతలు
- సాగదీతగా అనిపించే సన్నివేశాలు
- ప్రథమార్ధంలో కామెడీ పండకపోవటం
చివరిగా: స్కైలాబ్... కొత్త ప్రయత్నమే కానీ, ఇంకాస్త పర్ఫెక్ట్గా ల్యాండ్ చేయాల్సింది!(Skylab review)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!