Idhe Maa Katha review: రివ్యూ: ఇదే మా కథ

Idhe Maa Katha review: శ్రీకాంత్‌, సుమంత్‌ అశ్విన్‌,భూమిక, తాన్యాహోప్‌లు నటించిన ‘ఇదే మా కథ’ సినిమా ఎలా ఉందంటే?

Updated : 07 Dec 2022 20:23 IST

చిత్రం: ఇదే మా క‌థ‌; న‌టీన‌టులు: సుమంత్ అశ్విన్‌, శ్రీకాంత్‌, భూమిక‌, తాన్య హోప్‌, స‌మీర్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, పృథ్వీ, సప్తగిరి, రాంప్రసాద్ త‌దిత‌రులు; సంగీతం: సునీల్ కశ్యప్‌; ఛాయాగ్రహ‌ణం: సి.రామ్ ప్రసాద్‌; నిర్మాత‌:  జి.మ‌హేశ్‌; ద‌ర్శకత్వం: గురు ప‌వ‌న్‌; విడుద‌ల తేదీ: 02-10-2021

తెలుగు చిత్రసీమ‌లో కొత్త సినిమాల సంద‌డి కొన‌సాగుతోంది. ఓవైపు పెద్ద చిత్రాలు.. మ‌రోవైపు చిన్న సినిమాలు బాక్సాఫీస్ ముందు ప్రేక్షకుల‌కు వినోదాలు పంచుతున్నాయి. ఈ శుక్రవారం సాయితేజ్ ‘రిప‌బ్లిక్’ సినిమాతో సినీప్రియుల్ని పల‌క‌రించ‌గా.. శ‌నివారం ఆ బాధ్యతను ‘ఇదే మా క‌థ’ అందిపుచ్చుకుంది. శ్రీకాంత్‌, సుమంత్ అశ్విన్‌, భూమిక‌, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో న‌టించిన చిత్రమిది. గురు ప‌వ‌న్ తెర‌కెక్కించారు. ఈ చిత్ర క‌థా నేప‌థ్యం.. ప్రచార చిత్రాలు ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. మ‌రి ఆ అంచ‌నాల్ని ఈ చిత్రం అందుకుందా? శ్రీకాంత్‌, సుమంత్ అశ్విన్ ఏ మేర‌కు ప్రేక్షకుల్ని ఆక‌ట్టుకున్నారు?

క‌థేంటంటే: హైద‌రాబాద్ నుంచి ల‌ద్దాఖ్ వ‌ర‌కూ న‌లుగురు బైక్  ట్రావెల‌ర్స్ చేసిన ప్రయాణ‌మే ఈ  చిత్రం. వారిలో ఒక‌రు మ‌హేంద్ర (శ్రీకాంత్‌). 25ఏళ్ల క్రితం మిస్సయిన త‌న  ప్రేయ‌సిని వెతుక్కుంటూ ల‌ద్దాఖ్ బ‌య‌ల్దేరుతాడు.  అజ‌య్ (సుమంత్ అశ్విన్‌) ఓ అడ్వెంచ‌ర్ బైక్‌ రైడ‌ర్‌.  ఇంట‌ర్నేష‌న‌ల్ అడ్వెంచ‌ర్  ఛాంపియ‌న్ షిప్‌లో పాల్గొనాల‌నేది త‌న క‌ల. ఆ పోటీల్లో పాల్గొనాలంటే ముందుగా ల‌ద్దాఖ్‌లో జ‌రిగే అడ్వెంచర్ రేస్‌లో గెల‌వాలి. కానీ, అత‌ని త‌ల్లిదండ్రులు మాత్రం త‌న  ఇష్టాన్ని కాదంటారు.  దీంతో ఇంట్లో  చెప్పకుండానే ఓ బైక్ దొంగ‌త‌నం చేసి ల‌ద్దాఖ్‌కి ప్రయాణ‌మ‌వుతాడు అజ‌య్‌.  అలాగే ల‌క్ష్మీ (భూమిక‌)కి ఓ క‌ల ఉంటుంది. రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై త‌న తండ్రి చేసిన ఓ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ల‌ద్దాఖ్‌లో జ‌రిగే ఈవెంట్‌లో పొందుప‌రిచేందుకు వ‌స్తుంది. వేర్వేరు ల‌క్ష్యాలతో  ప్రయాణం ప్రారంభించిన ఈ ముగ్గూరు ఎలా క‌లిశారు. ఒక‌రి స‌మ‌స్యను మ‌రొకరు ఎలా పంచుకున్నారు. ల‌క్ష్య సాధ‌న‌లో వారికెదురైన స‌వాళ్లేంటి?  వాటినెలా అధిగ‌మించారు? ఈ ముగ్గురి ప్రయాణంలో మేఘ‌న (తాన్య హోప్) ఎలా భాగ‌మైంది? అన్నది తెరపై చూడాలి.

ఎలా ఉందంటే: జీవితం అంటే ఏమిటి? మ‌నం క‌న్న క‌ల‌ల‌ను సాకారం చేసుకునేందుకు ఏం చేయాలి? వాటి కోసం ఎంత‌లా క‌ష్టప‌డాలి? అన్నది ఈ సినిమాతో యువ‌త‌రానికి చెప్పే  ప్రయ‌త్నం చేశారు ద‌ర్శకుడు గురు ప‌వ‌న్‌. దీనికి రోడ్డు జ‌ర్నీ నేపథ్యాన్ని క‌థాంశంగా ఎంచుకున్నారు. ద‌ర్శకుడిగా  త‌న‌ తొలి ప్రయ‌త్నంలోనే ఇలాంటి  స‌బ్జెక్ట్‌ను ఎంచుకోవడం అభిన‌ందనీయ‌మైన విష‌యం.  అయితే ఆయ‌న‌ చెప్పాల‌నుకున్న క‌థ‌ను ఎక్కడా గాడి త‌ప్పకుండా న‌డిపించే ప్రయ‌త్నం చేసినా.. దాన్ని జ‌నరంజ‌కంగా తెర‌పై ఆవిష్కరించ‌డంలో త‌డ‌బ‌డ్డాడు.  ఇటు మ‌హేంద్ర  ప్రేమ‌క‌థ నుంచి కానీ.. అటు ల‌క్ష్మీ జీవితం నుంచి కానీ బ‌ల‌మైన భావోద్వేగాలు పండించ‌గ‌లిగే ఆస్కార‌మున్నప్పటికీ  వాటిని స‌రిగా వాడుకోలేక‌పోయాడు. ఇక  అడ్వెంచ‌ర్ బైక్ రైడ‌ర్‌గా అంద‌రి మెప్పు పొందాల‌న్న అజ‌య్ ల‌క్ష్యంలోనూ ఎక్కడా క‌సి, ప‌ట్టుద‌ల క‌నిపించ‌వు. దీనికి తోడు మేఘ‌న‌తో అత‌ని ల‌వ్‌ట్రాక్ మ‌రీ రొటీన్‌గా అనిపిస్తుంది. ఫ‌లితంగా  ప్రేక్షకులు ఏ ఒక్కరి క‌థ‌తోనూ ప్రయాణించే ప‌రిస్థితి క‌నిపించ‌దు.

ఆరంభంలో న‌లుగురి క‌థ‌ను చ‌క‌చ‌కా ప‌రిచ‌యం చేసి ప్రేక్షకులను నేరుగా క‌థ‌లోకి తీసుకెళ్లినా.. ఆ త‌ర్వాత భావోద్వేగ‌భ‌రితంగా క‌థ ముందుకు సాగ‌క‌పోవ‌డంతో ప్రథమార్ధమంతా బోరింగ్‌గా సాగుతున్న అనుభూతి కలుగుతుంది.  మ‌ధ్య మధ్యలో వ‌చ్చే సప్తగిరి కామెడీ  ట్రాక్  న‌వ్వులు పంచినా.. అదీ మ‌రీ రొటీన్‌గానే అనిపిస్తుంది. అయితే ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్ధం క‌థ కాస్త భావోద్వేగ‌భ‌రితంగా సాగిన‌ట్లుగానే అనిపిస్తుంది. మ‌హేంద్రకు క్యాన్సర్‌ అని తెలిశాక వ‌చ్చే ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు, ఆఖ‌ర్లో త‌న ప్రేమ‌క‌థ‌లో  వ‌చ్చే  ట్విస్ట్ ప్రేక్షకుల మ‌న‌సుల్ని హ‌త్తుకుంటాయి. అయితే ల‌క్ష్మీ, అజ‌య్‌లు త‌మ ల‌క్ష్యాల్ని సాధించిన తీరు మ‌రీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. వారిద్దరి క‌థ‌ల్ని మ‌రింత భావోద్వేగ‌భ‌రితంగా తీర్చిదిద్దుకుని ఉంటే ఫ‌లితం మ‌రోస్థాయిలో ఉండేద‌నిపిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: ఈ చిత్రానికి  ప్రధాన ఆకర్షణ శ్రీకాంత్‌, భూమిక‌ల న‌ట‌నే. మహేంద్ర‌, ల‌క్ష్మీ పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయారు.  అడ్వెంచర‌స్ అజ‌య్‌గా సుమంత్ క‌నిపించిన తీరు, ఆయ‌న లుక్ ఆక‌ట్టుకున్నా.. కొన్ని స‌న్నివేశాల్లో అత‌ని న‌ట‌న మ‌రీ అతిగా అనిపిస్తుంది. తాన్య హోప్ పాత్రను ద‌ర్శకుడు అంత బ‌లంగా రాసుకోలేక‌పోయాడు. హీరోకి ఓ ప్రేమ‌క‌థ ఉండాలి కాబ‌ట్టి ఆమె పాత్రని సృష్టించాడనిపిస్తుంది. రోడ్డు జ‌ర్నీ నేప‌థ్య చిత్రాలన‌గానే ప్రేక్షకులు ఓ భావోద్వేగ‌భ‌రిత‌మైన ప్రయాణాన్ని, ఉత్కంఠ‌భ‌రిత‌మైన మ‌లుపుల్ని ఆశిస్తారు.  అందుకు త‌గ్గట్లుగా క‌థ‌నాన్ని తీర్చిదిద్దుకోవ‌డంలో ప‌వ‌న్ త‌డ‌బ‌డ్డాడు. అయితే ద్వితీయార్థాన్ని న‌డిపిన తీరు ప‌ర్వాలేద‌నిపించింది. స‌ప్తగిరి, పృథ్వి, స‌మీర్‌, శ్రీకాంత్ అయ్యంగార్ ప‌రిధి మేర న‌టించారు రోడ్డు జ‌ర్నీ సీన్స్‌లో కొన్నింటిని సి.రామ్‌ ప్రసాద్ త‌న కెమెరాలో అందంగా బంధించాడు. సునీల్ క‌శ్యప్‌ నేప‌థ్య సంగీతం బాగున్నా.. పాట‌లు అంత‌గా ఆక‌ట్టుకోవు. నిర్మాణ విలువ‌లు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

బ‌లాలు

+ క‌థా నేప‌థ్యం

+ శ్రీకాంత్‌, భూమిక న‌ట‌న‌

+ ద్వితీయార్ధం

బ‌లహీన‌త‌లు

- సాదాసీదాగా సాగే క‌థ‌నం

- ప్రథమార్ధం

చివ‌రిగా: అక్కడక్కడా మెప్పించే నలుగురి ‘ఇదే మా కథ’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని