Sri Vishnu: ఆ కథలు చేయడం అంత సులభం కాదు

వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలు ఎంచుకుంటూ.. ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటారు కథానాయకుడు శ్రీవిష్ణు. అదే తన బలమంటారాయన. ఈ పంథాలోనే ఇటీవల ‘రాజ రాజ చోర’ చిత్రంతో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

Updated : 30 Dec 2021 07:27 IST

వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలు ఎంచుకుంటూ.. ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటారు కథానాయకుడు శ్రీవిష్ణు. అదే తన బలమంటారాయన. ఈ పంథాలోనే ఇటీవల ‘రాజ రాజ చోర’ చిత్రంతో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడీ జోష్‌లోనే ‘అర్జున ఫల్గుణ’ సినిమాతో సినీప్రియుల ముందుకొస్తున్నారు. తేజ మార్ని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. ఈనెల 31న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు శ్రీవిష్ణు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..

‘‘గోదావరి జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయాలని నాకెప్పటి నుంచో ఉండేది. నేనిప్పటి వరకు ఆ ఊరి బ్యాక్‌డ్రాప్‌ నుంచి సిటీకి వచ్చిన కథలు చేశా. పూర్తిగా ఆ గ్రామీణ నేపథ్యంలోనే సాగే కథ చేయలేదు. స్క్రిప్ట్‌ వింటున్నప్పుడే తేజ మార్నిలో మంచి   దర్శకుడు కనిపించాడు. తేజ 55రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసి నాకు షాకిచ్చాడు. అంత తక్కువ రోజుల్లో ఇలాంటి చిత్రం చేయడం నిజంగా చాలా కష్టం. కచ్చితంగా తేజ చాలా పెద్ద దర్శకుడవుతాడు’’.

ఎవరికి వారే హీరో..

‘‘సినిమాలో ప్రతి పాత్రకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. నేను, అమృతా అయ్యర్‌, రంగస్థలం మహేష్‌, చైతన్య, చౌదరి స్నేహితులుగా కనిపిస్తాం. ఎవరికి వారు హీరో అన్నట్లుగానే చేశారు. అలాగే పెద్ద నరేశ్‌, శివాజీ రాజా, సుబ్బరాజు అద్భుతంగా   నటించారు. సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ‘ముల్కల లంక’ అనే ఊర్లోకి వెళ్లిపోతారు ప్రేక్షకులు’’.

‘‘ప్రస్తుతం ‘భళా తందనాన’ సినిమా చేస్తున్నా. చాలా పెద్ద స్పాన్‌ ఉన్న యాక్షన్‌ డ్రామా చిత్రమిది. లక్కీ మీడియాలో ఓ చిత్రం చేస్తున్నా. కొందరు పోలీస్‌ ఆఫీసర్ల  జీవితాల నుంచి అల్లుకున్న ఫిక్షనల్‌ బయోగ్రఫీ ఇది. ఇందులో ఐదు ఏజ్‌ గ్రూప్‌లుంటాయి’’.

బలహీనతగా భావించను

‘‘నేను పెద్దగా ప్రయోగాలేమీ చేయలేదు. కాకపోతే మామూలు కథనే కాస్త కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తుంటా. రియలిస్టిక్‌ కథలే నా బలం. దాన్ని బలహీనతగా ఎప్పుడూ భావించను. నిజానికి రియలిస్టిక్‌ చిత్రాలు చేయడం అంత ఈజీ కాదు. అలాంటి కథలు కెరీర్‌లో ఒకటో రెండో వస్తుంటాయి. నా దగ్గరకొచ్చిన ప్రతి కథనూ మరింత వాస్తవికంగా చెప్పే ప్రయత్నం చేస్తుంటా. అందుకే నా    సినిమాలన్నీ చాలా సహజంగా ఉంటాయని అందరూ అంటుంటారు’’.

గోదావరి ఎటకారం

‘‘నర్సీపట్నంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం. డిగ్రీ అయిపోయి.. ఊర్లోనే ఉంటూ సంపాదించుకుందామనుకునే ఐదుగురు మిత్రుల కథ ఇది. వాళ్లు అనుకోని పరిస్థితుల్లో ఊరు దాటాల్సి వస్తుంది. దాని వల్ల అనుకోని సమస్యల్లో చిక్కుకుంటారు. మరి ఆ సమస్యేంటి? దాని నుంచి ఎలా బయటపడ్డారన్నది తెరపై చూడాలి. ఈ చిత్రంలో నేను పూర్తిగా గోదావరి యాసలోనే మాట్లాడతా. ఆ యాసలోని ఎటకారం కనిపిస్తుంది’’.

అందుకే ఆ టైటిల్‌..

‘‘అర్జున ఫల్గుణ’ అనేది భారతంలోని టాపిక్‌. అర్జుణ, ఫల్గుణ, పార్థ, కిరీటీ, కృష్ణ.. ఇలా ఓ పది పేర్లు తలచుకుంటే ధైర్యం వస్తుందని పురాణాల్లో చెప్పారు. రాను రాను అది అర్ణున, ఫల్గుణ వరకే చెప్పారు. ఉరుములు మెరుపులు వస్తే అందరూ ఆ పేర్లే తలచుకోమనేవారు. దాని వల్ల ధైర్యం వచ్చేది. అందుకే ఆ పేరులోని వైబ్రేషన్స్‌ నచ్చే ఈ టైటిల్‌ పెట్టాలనుకున్నాం. దానికి తోడు సినిమాలో నా పాత్ర పేరు అర్జున్‌. కథ రిత్యా ఈ పేరు సరిపోతుందనిపించి ఓకే చేశాం. నా ప్రతి చిత్రానికీ తెలుగు పేర్లు పెట్టేందుకే మొగ్గు చూపుతుంటా. మధ్య మధ్యలో సంస్కృత పదాలు పెడుతుంటాను. ఈతరం వాళ్లకు అర్జున ఫల్గుణ అనేది అంతగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ, ఒకరో ఇద్దరో ఇప్పుడీ చిత్రం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని