Bunny Vas: సామాజిక మాధ్యమాలతో మానసిక క్షోభ అనుభవించా..!

ఇంటర్నెట్‌ స్వేచ్ఛ కారణంగా తనలాంటి ఎంతోమంది వ్యక్తులు, వారి కుటుంబాలు తీవ్ర మానసిక క్షోభకు గురి అవుతున్నాయని టాలీవుడ్‌ నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఇంటర్నెట్‌ స్వేచ్ఛకు సపోర్ట్‌ చేస్తూ ఇటీవల...

Updated : 25 Jul 2021 16:57 IST

గూగుల్‌ సీఈవోని ప్రశ్నిస్తూ లేఖ రాసిన టాలీవుడ్‌ నిర్మాత

హైదరాబాద్‌: ఇంటర్నెట్‌ స్వేచ్ఛ కారణంగా తనలాంటి ఎంతోమంది వ్యక్తులు, వారి కుటుంబాలు తీవ్ర మానసిక క్షోభకు గురి అవుతున్నాయని టాలీవుడ్‌ నిర్మాత బన్నీ వాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నెట్‌ స్వేచ్ఛకు మద్దతుగా ఇటీవల గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. ‘సామజిక మాధ్యమాలు ఉపయోగించటం మొదలుపెట్టిన రోజుల్లో నా ఆలోచనా విధానాలు, భావాలు పంచుకోవటానికి ఇది మంచి వేదిక అవుతుందని నమ్మాను. భావప్రకటనా స్వేచ్ఛకి, ఇంటర్నెట్ స్వేచ్ఛకు అవధులు ఉండకూడదని భావించాను. కానీ.. గడిచిన రెండేళ్లుగా సామాజిక మాధ్యమాల్లో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. బాధ్యతలేని భావ ప్రకటనా స్వేచ్ఛ, ఇంటర్నెట్ స్వేచ్ఛ వల్ల మానసికంగా నేను పడ్డ క్షోభను తెలియచేయడం కోసమే ఈ లేఖ రాస్తున్నాను’ అని వివరించారు.

‘సామాజిక మాధ్యమాల్లో ఉంటున్న వాళ్లందరూ విచక్షణతో ఉంటున్నారా? విచక్షణ ఉన్న వాళ్లనే సామాజిక మాధ్యమాల్లోకి అనుమతిస్తున్నారా? అబద్ధాలు, అసత్యాలను పోస్టులు, వీడియోల రూపంలో పెట్టి ప్రజలను ఇబ్బందిపెడ్తున్న వాళ్లది తప్పా?.. లేదా అలాంటి వాళ్లు చేస్తున్న క్రూరమైన పనులను నియంత్రించకుండా ప్రపంచం ముందు పెడుతున్న సామాజిక మాధ్యమాలది తప్పా?’ అంటూ బన్నీవాస్‌.. సుందర్‌ పిచాయ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బన్నీ వాస్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకుడు. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా షూట్‌ ఇటీవల పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని