Updated : 04 Jul 2022 07:55 IST

Tollywood: అందాల భామ...ఆ జోరు ఏదమ్మా!

సీనియర్‌ భామలు... కొత్తతరం తారలే కాదు... చిత్రసీమలో మరో శ్రేణి కథానాయికలూ కనిపిస్తుంటారు. వీళ్లు అటు స్టార్‌ కథానాయకుల(Star Hero) చిత్రాల్లో సందడి చేస్తుంటారు, ఇటు యువ హీరోలతోనూ జట్టు కడుతుంటారు. సినిమాలో రెండో కథానాయికకి చోటు ఉందన్నప్పుడు దర్శకనిర్మాతలకి గుర్తొచ్చే భామలు వీళ్లే. వీరిలో కొద్దిమంది అప్పుడప్పుడూ ప్రత్యేక  గీతాలతోనూ సందడి చేస్తుంటారు. ఇలా దేనికైనా రెడీ అంటూ.... ఎప్పుడూ ఏదో ఒక సినిమాతో బిజీగా ఉండే ఈ భామలు అనూహ్యంగా జోరు తగ్గించారు. అప్పుడెప్పుడో ఒప్పుకొన్న సినిమాలు తప్ప... కొత్త కబుర్లేవి వినిపించలేదు.

నిత్యమేనన్‌ (Nithya Menon), నివేదా థామస్‌ (Nivetha Thomas), నివేదా పేతురాజ్‌ (Nivetha Pethuraj), రెజీనా, రీతూ వర్మ(Ritu Varma)... అటు అందంతోనూ, ఇటు నటనతోనూ కట్టి పడేసే ఈ ముద్దుగుమ్మలంతా తరచూ సందడి చేస్తుంటే తెరకి అదో నిండుదనం. నిధి అగర్వాల్‌ (Nidhi Agarwal), ఈషా రెబ్బా (Eesha Rebba), నభా నటేష్‌ (Nabha Natesh)... వీళ్లంతా వరుసగా మూడు నాలుగు సినిమాలతో సందడి చేసినవాళ్లే. స్టార్‌ భామలకి దీటుగా కనిపించారు. ఇప్పుడూ చిత్రాలు చేస్తున్నారు. కానీ కొత్త అవకాశాల విషయంలోనే కాస్త వెనకబడినట్టు కనిపిస్తున్నారు. కొద్దిమంది పొరుగు భాషల్లోనూ... మరికొంతమంది వెబ్‌సిరీస్‌ల్లోనూ(Web Series) నటిస్తూ కెరీర్‌ని కొనసాగిస్తున్నారు.

నివేదా థామస్‌ ఒకప్పుడు కథానాయికగా వరుసగా అవకాశాలు అందుకుంది. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, నాని తదితర కథానాయకులతో ఆడిపాడిన ఆమె, ‘వి’ తర్వాత మరో అవకాశం అందుకోలేదు. ‘వకీల్‌సాబ్‌’లో మెరిసింది. చాలా కాలం కిందట చేసిన ‘శాకిని ఢాకిని’ విడుదల కావల్సి ఉంది. కొత్తగా ఆమె తెలుగులో ఒప్పుకొన్నవి లేవు. ‘భీమ్లానాయక్‌’ తర్వాత నిత్యమేనన్‌ మరో సినిమా చేయలేదు. తమిళం, మలయాళంతోపాటు, వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తోంది. నివేదా పేతురాజ్‌ అటు అందంతోనూ, ఇటు నటనతోనూ ఆకట్టుకునే భామ. ఇటీవల విడుదలైన ‘విరాటపర్వం’లో  ఓ చిన్న పాత్రలో మెరిసింది. గతేడాది విడుదలైన ‘రెడ్‌’, ‘పాగల్‌’ చిత్రాల తర్వాత తెలుగులో ఆమె కథానాయికగా ఒప్పుకొన్న చిత్రాలేవీ లేవు. ‘బ్లడీ మేరీ’ సిరీస్‌లో నటించింది. రెజీనా ఒకప్పుడు తెలుగులో వరుస  అవకాశాలతో సత్తా చాటింది. ‘ఆచార్య’లో ప్రత్యేక గీతం చేసిన ఆమె ‘శాకిని ఢాకిని’లో నివేదా థామస్‌తో కలిసి నటించింది. తమిళంలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తోంది. తెలుగమ్మాయి రీతూవర్మ సినిమాల జాబితాలో కొత్త ప్రాజెక్టులు లేవు. ద్విభాషా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ విడుదల కావల్సి ఉంది. ఇటీవల ‘మోడర్న్‌ లవ్‌ హైదరాబాద్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. మరో తెలుగమ్మాయి ఈషా రెబ్బా తమిళం, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తోంది. మరోవైపు సిరీస్‌ల్లో నటిస్తోంది.


ఆచితూచి...

కొద్దిమంది కథల విషయంలో ఆచితూచి  అడుగులేస్తుండగా, కొద్దిమందికి అవకాశాలే కరవయ్యాయి. పరాజయాలు పలకరించడం, ప్రత్యామ్నాయాలుగా కొత్త భామలు రేసులోకి రావడంతో పలువురుకి ప్రస్తుతకాలం భారంగా మారింది. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ తదితర భామలు వరుస అవకాశాలతో ఆరంభంలో సత్తా చాటారు. ప్రస్తుతం కెరీర్‌లో మునుపటి జోరు కనిపించడం లేదు. ‘హరి హర వీరమల్లు’తో పవన్‌కల్యాణ్‌కి జోడీగా నటించే అవకాశం అందుకుంది నిధి. ఆ చిత్రం చాలా రోజులుగా సెట్స్‌పైనే ఉంది. ఈ ఏడాది ఆరంభంలో ‘హీరో’తో సందడి చేసిన ఆమె ఆ తర్వాత కొత్తగా సినిమాలేవీ ఒప్పుకోలేదు. నభా నటేష్‌ గతేడాది ‘అల్లుడు అదుర్స్‌’, ‘మేస్ట్రో’ సినిమాలతో మెరిసింది మినహా, ఈ ఏడాది ఆమె సందడే లేదు. ఒకప్పుడు కథానాయికలు ఖాళీగా కనిపించేవారు కాదు. ఎవరు కాల్షీట్లు సర్దుబాటు చేస్తారా? అన్నట్టు ఉండేది పరిస్థితి. ఇప్పుడు దర్శకనిర్మాతలకు కావల్సినంత మంది భామలు కనిపిస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని