Tollywood: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

Tollywood: ఎప్పట్లాగే ఈ వారం కూడా పలు చిత్రాలు అటు థియేటర్.. ఇటు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమయ్యాయి!

Updated : 14 Sep 2021 15:36 IST

హైదరాబాద్‌: కరోనా పరిస్థితులను ఎదుర్కొంటూనే వరుస చిత్రాలు తెలుగుతెరపై సందడి చేస్తున్నాయి. కొన్ని థియేటర్‌ వైపు అడుగులు వేస్తుంటే, మరికొన్ని ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమయ్యాయి. గత కొన్ని రోజులుగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీల్లో వినోదం సమతూకంలో కొనసాగుతోంది. ఈ వారం కూడా అలా అలరించే చిత్రాలేంటో చూసేద్దామా!

‘గల్లీ రౌడీ’ హంగామా

సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఫుల్‌టైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘గల్లీ రౌడీ’. నేహాశెట్టి కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 17న థియేటర్‌లలో సందడి చేయనుంది. ఇటీవల అగ్ర కథానాయకుడు చిరంజీవి విడుల చేసిన ట్రైలర్‌  అలరించేలా ఉంది. సందీప్‌ కిషన్‌ ఇందులో విశాఖ ‘గల్లీరౌడీ’గా కనిపించనున్నారు. సందీప్‌ డైలాగులు, కామెడీ టైమింగ్‌, బాబీ సింహా యాక్షన్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.  కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమాస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కోన వెంకట్‌, ఎంవీవీ సత్యనారాయణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రామ్‌ మిరియాల, సాయికార్తిక్‌ స్వరాలు అందిస్తున్నారు.


విజయ్‌ ఆంటోనీ వైవిధ్యం చూపిస్తారా?

వైవిధ్య కథా చిత్రాలతో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌ ఆంటోని. తమిళంలో ఆయన నటించే ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది. ఆనంద్‌ కృష్ణన్‌ దర్శకత్వంలో విజయ్‌ నటించిన తాజా చిత్రం ‘విజయ రాఘవన్‌’.ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు  సెప్టెంబరు 17న థియేటర్‌లలో విడుదల కానుంది. ఇందులో విజయ్‌ ట్యూషన్‌ మాస్టర్‌గా కనిపించనున్నారు. టి.డి. రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నివాస్‌ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్నారు.


హర్భజన్‌.. అర్జున్‌ ఒకే తెరపై..

క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌, నటుడు అర్జున్‌ కథానాయకులు నటించిన చిత్రం ‘ఫ్రెండ్‌షిప్’. జాన్‌పాల్‌ రాజ్‌, శ్యామ్‌ సూర్య దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కూడా సెప్టెంబరు 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నేటి సమాజంలో మహిళల్ని ఎలా చూస్తున్నాం? వాళ్లని మనం ఎలా గౌరవించాలనే అంశం ఆధారంగా రూపొందిన చిత్రమే ‘ఫ్రెండ్‌షిప్‌’ అని నిర్మాత ఎ.ఎన్‌.బాలాజీ చెబుతున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది.


సీమ నేపథ్యంలో.. ‘జెమ్‌’

విజయ్‌రాజా, రాశీసింగ్‌, నక్షత్ర నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘జెమ్‌’. సుశీల సుబ్రహ్మణ్యం తెరకెక్కించారు. పత్తికొండ కుమార స్వామి నిర్మాత. ఈ సినిమాని ఈనెల 17న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ‘‘రాయలసీమ నేపథ్యంగా సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఒకరంటే ఒకరికి పడని ఇద్దరు అమ్మాయిల మధ్యలోకి హీరో వస్తే ఏమైంది? వాళ్లిద్దరి వల్ల అతనెలాంటి సమస్యల్లో చిక్కుకున్నాడు? అన్నది ఈ చిత్ర కథాంశం. ఆద్యంతం థ్రిల్‌ పంచుతుంది. ఇందులో ఓ ఎపిసోడ్‌ కోసం విజయ్‌ నగ్నంగా నటించారు’’ అని అన్నారు.


‘ప్లాన్‌ బి’ ఏంటి?

శ్రీనివాస్‌రెడ్డి ప్రధాన పాత్రధారిగా కె.వి.రాజమహి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్లాన్‌ బి’. ఎ.వి.ఆర్‌ నిర్మాత. సూర్య వశిష్ఠ, మురళీశర్మ, రవిప్రకాష్‌ ముఖ్యపాత్రలు పోషించారు. నేర నేపథ్యంలో ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను కూడా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘‘కథ ‘ప్లాన్‌ బి’ చుట్టూ నడుస్తుందంటే, ప్లాన్‌ ఎ విషయంలో ఏం జరిగిందనేది తెరపైనే చూడాలి. శ్రీనివాస్‌రెడ్డి, మురళీశర్మ తదితరుల నటన, పాత్రలు ఆకట్టుకుంటాయి’’ అని దర్శకుడు రాజమహి చెబుతున్నారు.


‘హనీట్రాప్‌’లో చిక్కిందెవరు?

‘సొంతవూరు’, ‘గల్ఫ్‌’..లాంటి  సందేశాత్మక చిత్రాలతో సినీప్రియుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న దర్శకుడు పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి. ఓ సమకాలీన కథతో ఇప్పుడాయన తెరకెక్కించిన కొత్త చిత్రం ‘హనీ ట్రాప్‌’. వివి వామనరావు కీలక పాత్రలో నటిస్తూ.. స్వయంగా నిర్మించారు. రిషి, శిల్ప నాయక్‌, తేజు  అనుపోజు, శివ కార్తీక్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘నేనెప్పుడూ నా సొంత కథలతోనే సినిమాలు చేస్తుంటా. కానీ, ఈసారి మా నిర్మాత వామనరావు చెప్పిన కథ నచ్చి ఈ చిత్రం తెరకెక్కించా. ఇందులో నటీనటులందరూ చక్కగా నటించారు. ఈ చిత్రానికి ప్రవీణ్‌ ఇమ్మడి స్వరాలందించారు.


మరోసారి ఊపిరి సలపనివ్వని ఉత్కంఠతో..

స్టీఫెన్‌ లాంగ్‌ కీలక పాత్రలో సయేగస్‌ దర్శకత్వం వహించిన అమెరికన్‌ హారర్‌ థ్రిల్లర్‌ ‘డోంట్‌ బ్రెత్‌2. ఆగస్టు 13, 2021 అమెరికాలో విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కాగా, భారత్‌లో ఈ సినిమా సెప్టెంబరు 17 థియేటర్‌లలో విడుదల కానుంది. హారర్‌ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారికి కచ్చితంగా నచ్చుతుందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.


ఓటీటీలో అలరించే చిత్రాలివే!

నితిన్‌ సాహసం

నితిన్‌, నభా నటేశ్‌ జంటగా రూపొందిన చిత్రం ‘మ్యాస్ట్రో’. తమన్నా కీలక పాత్ర పోషించారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా సెప్టెంబరు 17 నుంచి స్రీమింగ్‌ కానుంది.. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ‘కళ్లు కనపడకపోతే ఉండే ఇబ్బందులు అందరికీ తెలుసు’ అంటూ నితిన్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం అలరించింది. అంధుడిగా నితిన్‌ నటన మెప్పిస్తోంది. మహతి స్వర సాగర్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ఈ చిత్రం హిందీలో విజయవంతమైన ‘అంధాధున్‌’ రీమేక్‌గా రూపొందింది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు.


ఈ నెలలో విజయ్‌సేతుపతి మూడో చిత్రం

తమిళనటుడు విజయ్‌ సేతుపతి జోరుమీదున్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన రెండు చిత్రాలు ‘లాభం’, ‘తుగ్లక్‌ దర్బార్‌’ ఈ నెలలోనే తెలుగు ప్రేక్షకులను అలరించగా, ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రంతో అలరించనున్నారు. తాప్సీతో కలిసి ఆయన కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అనబెల్‌.. సేతుపతి’. దీపక్‌ సుందర్‌రాజన్‌ దర్శకుడు. అన్న కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా సెప్టెంబరు 17న స్ట్రీమింగ్‌ కానుంది.


అప్పుడు థియేటర్‌.. ఇప్పుడు ఓటీటీ

సుశాంత్‌ కథానాయకుడిగా ఎస్‌.దర్శన్‌ తెరకెక్కించిన రొమాంటిక్‌ డ్రామా థ్రిల్లర్‌ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. మీనాక్షి చౌదరి కథానాయిక. వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి తదితరలు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కామెడీ.. రొమాన్స్‌.. యాక్షన్‌.. థ్రిల్లింగ్‌.. ఇలా అన్ని అంశాల‌ను స‌మ‌పాళ్లలో మేళ‌విస్తూ ద‌ర్శకుడు ఈ కథను తీర్చిద్దిన విధానం మెప్పించింది. కాగా, ఈ చిత్రం త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా సెప్టెంబరు 17వ తేదీ నుంచి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ స్ట్రీమింగ్‌ కానుంది.


అమెజాన్‌ ప్రైమ్‌లో..

అక్షయ్‌కుమార్‌ రహస్య ఏజెంట్‌గా నటించిన చిత్రం ‘బెల్‌బాటమ్‌’. ఆగస్టు 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఇది ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకులకు     కనువిందు చేయనుంది. రంజిత్‌ ఎం. తివారి తెరకెక్కించిన ఈ సినిమాను ఈ నెల 16న స్ట్రీమింగ్‌కు ఉంచుతున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. లారా దత్త, హ్యూమా కురేషి, వాణి   కపూర్‌లు ముఖ్యపాత్రలు పోషించారు. 200 మంది ప్రయాణికులతో ఉన్న విమానం హైజెక్‌ అయితే... దాన్ని విడిపించే భారత ఏజెంట్‌గా  అక్షయ్‌కుమార్‌ నటించారు.


స్పార్క్‌ ఓటీటీలో ‘కనబడుటలేదు’


మరికొన్ని చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు ఇలా..!

డిస్నీ+ హాట్‌స్టార్‌

* అన్‌ హియర్డ్‌- సెప్టెంబరు 17

* కన్ఫెషన్స్‌ ఆఫ్‌ ఎ షోఫాహోలిక్‌- సెప్టెంబరు 17

సోనీ లివ్‌

* ప్రియురాలు - సెప్టెంబరు 17

నెట్‌ఫ్లిక్స్‌

* నైట్‌ బుక్స్‌ -సెప్టెంబరు 15

* అన్‌కహీ కహానియా- సెప్టెంబరు 17

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

* సెర్చింగ్‌ -సెప్టెంబరు 14

* వీడ్స్‌ - సెప్టెంబరు 15

* ఆజ్‌ ఎబౌ సో బిలో -సెప్టెంబరు 16

* డోర్‌ ఏ అండ్‌ మీ -సెప్టెంబరు 17

జీ5

* సర్వైవర్‌- సెప్టెంబరు 12(రియాల్టీ షో)

* బుక్‌ మై షో - ది సూసైడ్‌ స్క్వాడ్‌ -సెప్టెంబరు 16

హెచ్‌బీవో మ్యాక్స్‌

* హథీ మేరీ సాథీ (సెప్టెంబరు 18)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని