Sai Dharam Tej: వంట చేస్తానని..అమ్మ ఇంట్లో నుంచి తోసేసింది: సాయిధరమ్‌ తేజ్‌

రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత హీరో సాయిధరమ్‌ తేజ్‌ నటించిన చిత్రం ‘విరూపాక్ష’ ఈ నెల 21న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయనతోపాటు హీరోయిన్‌ సంయుక్త, దర్శకుడు సందడి చేశారు.

Updated : 21 Apr 2023 14:14 IST

హైదరాబాద్‌: సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) హీరోగా నూతన దర్శకుడు కార్తిక్‌ దండు ( Karthik Dandu) తెరకెక్కించిన చిత్రం ‘విరూపాక్ష’ (Virupaksha). సంయుక్త కథానాయిక (Samyuktha). బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, దర్శకుడు సుకుమార్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చిత్ర బృందం పాల్గొంది.

‘‘కొత్త జానర్‌లో రూపొందిన చిత్రమిది. మేమంతా ఎంతో ఇష్టపడి పనిచేశాం. మీరు కొనే టికెట్టు విలువకు తగ్గట్టు ‘విరూపాక్ష’ ఉంటుంది. కచ్చితంగా మీరు ఎంజాయ్‌ చేస్తారు’’ అని సాయిధరమ్‌ తేజ్‌ నమ్మకంగా చెప్పారు. ‘‘కొవిడ్‌ తర్వాత థియేటర్‌ సినిమా, ఓటీటీ సినిమా అనే మాటలు వినిపిస్తున్నాయి. ‘విరూపాక్ష’ తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా. కథ తమలో ఆసక్తి రేకెత్తించడంతో నటీనటులు, సాంకేతిక నిపుణులంతా లీనమై పనిచేశారు. తెలుగులో ఇటీవల ఇలాంటి నేపథ్యమున్న సినిమాలు రాలేదు’’ అని కార్తిక్‌ అన్నారు. అనంతరం, విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆ వివరాలివీ..

* ఈ సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్‌రావడానికి కారణమేంటి?

దర్శకుడు: ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఒళ్లు జలదరించేలా ఉంటాయి. అందుకే సెన్సార్‌ బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్‌ ఇచ్చింది. అంతే తప్ప ఇందులో ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు లేవు.

* ‘విరూపాక్ష’ను పాన్‌ ఇండియా సినిమాగా ప్రకటించి.. కేవల తెలుగులోనే విడుదల చేస్తున్నారెందుకు?

నిర్మాత: సంబంధిత కార్యక్రమాలు పూర్తిచేసేందుకు మాకు సమయం సరిపోలేదు. అందుకే ముందుగా తెలుగులో విడుదల చేసి, వచ్చేవారం ఇతర భాషల్లో రిలీజ్‌ చేస్తాం.

* మీరు చేసిన సినిమాలన్నీ విజయం అందుకోవడంతో చాలామంది ‘గోల్డెన్‌ లెగ్‌’ హీరోయిన్‌ అంటున్నారు కదా. దానిపై మీ స్పందన?

హీరోయిన్: అదొక బ్యాడ్‌ కాన్సెప్ట్‌. సినిమా విజయం సాధించినా, ఫెయిల్‌ అయినా దానికి పనిచేసిన వారంతా బాధ్యులే. అంతేగానీ మూవీ హిట్‌ అయితే అదృష్టం వల్లే హీరోయిన్‌ విజయం అందుకుంటుందనడం సరైందికాదు.

* ఈ సినిమా మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకెళ్తుందనుకుంటున్నారు?

హీరో: ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలనే దాన్నే దృష్టిలో పెట్టుకుంటా తప్ప కమర్షియల్‌ హీరోగా ఎక్కడి వరకు వెళ్తాననే దాని గురించి ఆలోచించను. మీ ప్రశ్నకు ప్రేక్షకులే నా కంటే బాగా సమాధానం చెప్పగలరు.

* కొంత విరామం తర్వాత కెమెరా ముందుకు రావడం ఎలా అనిపించింది?

హీరో: ప్రతి విషయాన్ని మళ్లీ కొత్తగా నేర్చుకున్నా. నన్ను నేను అప్‌డేట్‌ చేసుకున్నా. అదో మంచి అనుభూతి.

*  జనసేన పార్టీకి మీ మద్దతు ఎంత వరకు ఉంటుంది?

హీరో: ఓ కార్యకర్తగా ఎంత సపోర్ట్‌ చేయాలో అంత చేస్తా. నాకు పాలిటిక్స్‌ గురించి తెలియదు. పవన్‌కల్యాణ్‌ మామయ్య పోటీ చేస్తున్నారు కాబట్టి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.

* మీరు ప్రమాదం నుంచి కోలుకున్నాక ‘ఇప్పుడే సినిమాలెందుకు? ఇంకా కొంతకాలం విశ్రాంతి తీసుకోవచ్చుగా’ అని మీ అమ్మ చెప్పారా?

హీరో: అలా చెబితే బాగుండేదనేది నా ఫీలింగ్. మా అమ్మ నాకంటే మొండిది. ‘నువ్వు వెళ్లి పని చేస్కో’ అంటూ నన్ను బయటకు తోసేసింది (నవ్వులు). ‘ఇంట్లో ఉంటే వంట చేయడానికి ప్రయత్నిస్తావ్‌.. దాన్ని నేను తినలేను’ అని చెప్పింది. ప్రమాదం జరిగిన తర్వాత మా అమ్మ నన్ను మళ్లీ చిన్నపిల్లాడిలా నడిపించింది. ఆవిడే నాకు స్ఫూర్తి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని