జులై 3, 4 తేదీల్లో ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ వార్షికోత్సవాలు

సాహిత్య, సంగీత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, నాటక రంగాల్లో, సుమారు 24 కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, తనకంటూ

Updated : 01 Jul 2021 18:47 IST

సింగపూర్‌: సాహిత్య, సంగీత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, నాటక రంగాల్లో, సుమారు 24 కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సింగపూర్‌కు చెందిన ప్రవాస తెలుగు సంస్థ ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’. సంస్థ ఏర్పాటై ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో అత్యంత ఘనంగా వార్షికోత్సవాలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా జులై 3, 4 తేదీల్లో ‘అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021’ అనే బృహత్‌ కార్యానికి శ్రీకారం చుట్టింది.

ప్రపంచ నలుమూలల్లో వివిధ దేశాల్లోని తెలుగువారి ప్రతిభకు పట్టం కట్టే విధంగా, అన్ని దేశాల తెలుగు కళాకారులు ఒక కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయమయ్యే విధంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. సుమారు 34 దేశాల నుండి 45 తెలుగు సంస్థలు ఇందుకు సహకారం అందించనున్నాయి. అమెరికాలోని తానా, వంగూరి ఫౌండేషన్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, హాంకాంగ్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్డమ్, నార్వే, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, కెనడా, మారిషస్ మొదలైన 34 దేశాల నుంచి తెలుగు కళాకారులు రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు తమ అనుగ్రహభాషణం ఇవ్వనుండటం ఈ సారి ప్రత్యేకత.

సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ ‘భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమానికి ప్రారంభోపన్యాసం చేస్తారని, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు సామవేదం షణ్ముఖశర్మ, గరికిపాటి నరసింహారావు ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయనున్నారని వెల్లడించారు. రామ్ మాధవ్, మండలి బుద్ధ ప్రసాద్ , జేడీ లక్ష్మీనారాయణ, వామరాజు సత్యమూర్తి , వంగూరి చిట్టెన్ రాజు, వంశీ రామరాజు వంటి పెద్దలు  కూడా కార్యక్రమానికి విచ్చేసి ప్రసంగిస్తారని రత్నకుమార్‌ తెలిపారు. వీరితో పాటు, సురేఖ మూర్తి, ఎల్లా వెంకటేశ్వరరావు, మాండోలిన్ రాజేష్, నేమాని పార్థసారథి వంటి సంగీత దిగ్గజాలు, తనికెళ్ళ భరణి, భువనచంద్ర, మురళీ మోహన్, సాయి కుమార్, సాలూరు కోటి వంటి సినీ ప్రముఖులు ఈ ప్రపంచ వేదికను అలంకరించనున్నారు. రాధిక మంగిపూడి, చామిరాజు రామాంజనేయులు కార్యక్రమ ముఖ్య సమన్వయకర్తలుగా,  ఊలపల్లి భాస్కర్, గణేశ్న రాధాకృష్ణ ముఖ్య సాంకేతిక నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. ‘శుభోదయం’ సంస్థ స్పాన్సర్‌గా, సింగపూర్ తెలుగు టీవీ, ఈ క్షణం, మా గల్ఫ్, మొదలైన వారు మీడియా పార్ట్నర్స్‌గా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా రెండు రోజులపాటు యూట్యూబ్, ఫేస్‌బుక్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానుందని కవుటూరి రత్నకుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని