Sankranti Festival: సౌదీలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబురాలు

సౌదీలోని తెలుగువారంతా సంక్రాంతి పండుగను అట్టహాసంగా నిర్వహించుకున్నారు. 

Updated : 29 Jan 2024 10:04 IST

దుబాయ్‌: తెలుగువారికి అతిపెద్ద పండగ సంక్రాంతి (Sankranti Festival). సంక్రాంతి సంబురాలు నిర్వహించుకునేందుకు పల్లె, పట్టణం తేడాలేకుండా అందరూ జరుపుకొంటుంటారు. ఎక్కడెక్కడో నివాసముండే వారంతా ఒక్కచోటుకు చేరుకుని కుటుంబ సమేతంగా సంతోషంగా, ఉల్లాసంగా గడుపుతారు. అలాగే సౌదీలోని తెలుగువారంతా కూడా ఈ ఏడాది సంక్రాంతి పండుగను అట్టహాసంగా నిర్వహించుకున్నారు. 

సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య  (శాట్స్ ) (SATS) నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో 600 మందికిపైగా తెలుగువారు పాల్గొన్నారు. అచ్చమైన పల్లెటూరు వాతావరణం ప్రతిబింబించేలా భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అట్టహాసంగా నిర్వహించుకున్నారు. సభా వేదికను భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా అలంకరించారు.

ఈ సంక్రాంతి వేడుకలను అధ్యక్షుడు నాగ శేఖర్ చందగాని, తెలుగు శత పుస్తక కర్త చిగురుమళ్ల శ్రీనివాస్ దీప ప్రజ్వలనతో ఆరంభించారు. ఆ తర్వాత కె.వి.ఎన్ రాజు ఆధ్వర్యంలోని మహిళా బృందం తెలుగు తల్లి గీతాలాపన చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించారు. పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని పండుగకు నిండు శోభను తెచ్చారు. ముగ్గుల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. పిల్లలకు ప్రత్యేకంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో 75 మంది చిన్నారులు తమ ప్రతిభను చాటుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన వారందరికీ పండగ పిండి వంటలతో ప్రత్యేక విందు ఇచ్చారు. రుచికరమైన తెలుగు వంటకాలను వడ్డించారు. 

చివరగా చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. పండుగ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులు, దాతలకు శాట్స్‌ నిర్వాహక మండలి తరఫున కోనేరు ఉమా మహేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు సమాఖ్య కార్యవర్గ సభ్యులైన కందిబేడల వరప్రసాద్, కోనేరు ఉమా మహేశ్వరరావు, కె.వి.ఎన్ రాజు, జుజ్జవరపు పాపారావు, హరికిషన్, పారేపల్లి ఎన్.వి.బి కిషోర్, చివుకుల శర్మ, నరసింహారావు రాంపల్లి, నెట్టెం దిలీప్, రోహిత్ నంద సిబ్బాల, గుబ్బల శ్రీనివాస్, గులాం షేఖ్ తదితరులు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఈ వేడుకల సందర్భంగా ‘సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య’ వెబ్ సైట్‌ని అతిథులుగా వచ్చిన మీర్జా జహీర్  బేగ్, అనిల్ కుమార్ సమక్షంలో నిర్వాహకులు ప్రారంభించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని