పిఠాపురం నుంచే పవన్‌ కల్యాణ్‌

జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గం నుంచి శాసనసభకే పోటీ చేయనున్నారు.

Updated : 25 Mar 2024 06:48 IST

13 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసిన జనసేన
రైల్వేకోడూరు అసెంబ్లీ స్థానానికి డాక్టర్‌ యనమల భాస్కరరావు

ఈనాడు, అమరావతి: జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గం నుంచి శాసనసభకే పోటీ చేయనున్నారు. తాజా జాబితాతో కలిపి.. 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి పోటీచేసే అభ్యర్థుల పేర్లను జనసేన ఇప్పటివరకు ప్రకటించింది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నుంచి డాక్టర్‌ యనమల భాస్కరరావు పేరు ఖరారు చేశారు. మిగిలిన 12 మందికి ఇప్పటికే వ్యక్తిగతంగా చెప్పారు. మరో అయిదు స్థానాలకు అభ్యర్థుల్ని తొలి జాబితాలో ప్రకటించారు. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. ఇంకా మూడు అసెంబ్లీ స్థానాలకు, మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది.

విశాఖ దక్షిణకు దాదాపు ఖరారైనా..

కాకినాడ లోక్‌సభ స్థానానికి జనసేన అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ పేరును పార్టీ ఇటీవలే ఖరారు చేసింది. అయితే మోదీ, అమిత్‌షా చెబితే కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి తాను పోటీచేస్తానని పవన్‌ కల్యాణ్‌ గతంలో ప్రకటించారు. జనసేన ఇంకా మచిలీపట్నం లోక్‌సభతో పాటు అవనిగడ్డ, పాలకొండ (ఎస్టీ), విశాఖపట్నం దక్షిణ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాలి. విశాఖపట్నం దక్షిణం నుంచి చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్‌ పేరు దాదాపుగా ఖరారైంది. ఆయనకు ఇప్పటికే వ్యక్తిగతంగా చెప్పి, ఎన్నికల నియమావళి పత్రాలను అందజేశారు. అక్కడున్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పి.గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి తొలుత తెదేపా అభ్యర్థిగా మహాసేన రాజేశ్‌ పేరును ఆ పార్టీ ప్రకటించింది. అయితే, పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణను ప్రకటించారు. తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఆరణి శ్రీనివాసులు పోటీచేస్తారని పవన్‌ కల్యాణ్‌ గతంలోనే ప్రకటించారు. స్థానిక పార్టీ నేతలతో పాటు తెదేపా నాయకులూ ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆయన్నే కొనసాగించాలని జనసేన అధిష్ఠానం నిర్ణయించింది.

దాదాపు అందరూ విద్యావంతులే

జనసేన రెండో జాబితాలో.. అందరూ విద్యావంతులే. రాజోలు నుంచి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి దేవ వరప్రసాద్‌ బరిలో దిగనున్నారు. ఆర్థికశాస్త్రంలో ఎంఏ చేసిన మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేశ్‌ నిడదవోలు నుంచి పోటీ చేయనున్నారు. యలమంచిలి నుంచి రంగంలో దిగనున్న సుందరపు విజయ్‌కుమార్‌ ఎంబీయే చదివారు. మిగిలిన వారికి ఇంజినీరింగ్‌, డిగ్రీ, ఐటీఐ, పదోతరగతి విద్యార్హతలు ఉన్నాయి.


జనసేన అభ్యర్థుల మలి జాబితా విడుదల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని