HD Kumaraswamy : కాంగ్రెస్‌ ఓటమే లక్ష్యం.. భాజపాతో ఇంకా పొత్తు కుదర్లేదు : కుమారస్వామి

భాజపా-జేడీఎస్‌ (BJP-JDS) పొత్తు ఇంకా ఖరారు కాలేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (HD Kumaraswamy) చెప్పారు. తమ పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని ఆయన పేర్కొన్నారు.

Published : 10 Sep 2023 16:20 IST

బెంగళూరు : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను (Congress) ఓడించడమే జేడీఎస్‌ (JDS) లక్ష్యమని ఆ పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (HD Kumaraswamy) వ్యాఖ్యానించారు. జేడీఎస్‌లో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని స్పష్టం చేసిన ఆయన.. మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా భాజపా-జేడీఎస్‌ పొత్తు (BJP-JDS) వార్తలపై స్పందించారు. ‘సీట్ల పంపకం గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది. రాబోయే ఎన్నికల్లో అవినీతి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఓడించడమే మా లక్ష్యం. అందుకే మా పార్టీలో ఎలాంటి కుమ్ములాటలు లేవు. 19 మంది ఎమ్మెల్యేలు కలిసే ఉన్నారు. ఏదైనా సమస్య తలెత్తినా.. దాన్ని లోలోపలే పరిష్కరించుకుంటామని’ కుమారస్వామి వ్యాఖ్యానించారు. 

చంద్రబాబు అరెస్ట్‌.. ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు

ఇటీవల భాజపా సీనియర్‌ నేత యడియూరప్ప మాట్లాడుతూ జేడీఎస్‌ ఎన్డీయేలో చేరడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. జేడీఎస్‌, భాజపా కలిసి పోటీ చేస్తాయని, ఆ పార్టీకి మూడు నుంచి నాలుగు పార్లమెంటు స్థానాలు ఇస్తామని చెప్పారు. ఈ ప్రకటనపై కుమారస్వామి స్పందిస్తూ పొత్తుపై జేడీఎస్‌ ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆ విషయంపై వేచి చూస్తున్నామని, చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. కాగా.. జేడీఎస్‌-భాజపా పొత్తు పూర్తిగా అనైతికమని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. జేడీఎస్‌ భాజపాకు బీ టీమ్ అని ఆరోపించారు. ఈ విషయం గతంలోనే చెప్పానని, ప్రస్తుతం అది నిరూపణ అవుతోందన్నారు. ఉన్న విషయం చెబితే జేడీఎస్‌ నేతలు తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయన మండిపడ్డారు. జనతాదళ్‌ ‘సెక్యులర్’గా చెప్పుకొనే జేడీఎస్‌ మతతత్వ పార్టీతో చేతులు కలుపుతోందని సిద్ధరామయ్య ధ్వజమెత్తారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని