YS Sharmila: వైఎస్‌ షర్మిల గృహనిర్బంధం.. పోలీసులకు హారతిచ్చి నిరసన..

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళ్లాలనుకున్న వైతెపా అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

Updated : 18 Aug 2023 11:26 IST

గజ్వేల్‌: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళ్లాలనుకున్న వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. దళితబంధులో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల గజ్వేల్‌లోని జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌ గ్రామస్థులు ఆందోళన చేశారు. వారికి మద్దతుగా అక్కడ పర్యటించాలని నిర్ణయించుకున్న షర్మిలను అనుమతి లేదంటూ పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆమె నివాసం లోటస్‌పాండ్‌ వద్ద పోలీసులు మోహరించారు. గజ్వేల్‌ వెళ్లి తీరుతానంటూ పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగగా.. అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు.

BRS: 21న భారాస జాబితా?

దేనికోసం అనుమతి తీసుకోవాలి?

పోలీసులు గృహనిర్బంధం చేయడంపై షర్మిల వినూత్నంగా నిరసన తెలిపారు. గజ్వేల్‌ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులకు హారతి ఇచ్చారు. డ్యూటీ సరిగా చేయండి సార్‌ అని వ్యాఖ్యానించారు. గజ్వేల్‌లో నిరసన తెలుపుతున్న భారాస నేతలను ఎందుకు అరెస్టు చేయడం లేదని షర్మిల ప్రశ్నించారు. ‘‘పోలీసులు సీఎం కేసీఆర్‌ తొత్తుల్లా పనిచేయడం మానుకోవాలి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలి మమ్మల్ని పట్టుకుంటున్నారు. దేనికోసం అనుమతి తీసుకోవాలి? ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాం. ప్రజలను కలవడానికి అనుమతి తీసుకోవాలా? కేసీఆర్‌ నన్ను చూసి భయపడుతున్నారు’’ అని షర్మిల అన్నారు. 

ఇంటి వద్దే దీక్షకు దిగిన షర్మిల

గజ్వేల్ పర్యటనను అడ్డుకున్నందుకు నిరసనగా లోటస్‌పాండ్‌లోని తన నివాసం వద్ద షర్మిల దీక్షకు దిగారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తానని ఆమె చెప్పారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని