BRS: 21న భారాస జాబితా?

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తిచేసిన భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 21వ తేదీన మొదటి జాబితాను ప్రకటించనున్నట్లు తెలిసింది.

Updated : 18 Aug 2023 07:40 IST

తొలి విడతలో 87 మంది పేర్లు వెల్లడి!
కొందరు సిట్టింగ్‌ల మార్పు తప్పదు..
మొత్తంగా 10 స్థానాల్లో కొత్తముఖాలు
గజ్వేల్‌ నుంచే కేసీఆర్‌ పోటీ!

ఈనాడు, హైదరాబాద్‌: రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తిచేసిన భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 21వ తేదీన మొదటి జాబితాను ప్రకటించనున్నట్లు తెలిసింది. ముందుగా ఈ నెల 18న అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని భావించినా.. 21న వెల్లడించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 20న సూర్యాపేట జిల్లాలో కలెక్టరేట్‌ భవనం, ఎస్పీ కార్యాలయం, భారాస పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాలతో పాటు బహిరంగసభలో పాల్గొననున్నారు. అందువల్ల 21వ తేదీనే అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటిస్తారని భావిస్తున్నారు. కేసీఆర్‌ 2018లో 105 శాసనసభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈసారి మాత్రం మొదటి విడతలో అంతమంది పేర్లు ప్రకటించకపోయినా.. సుమారు 87 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్ని స్థానాలకూ ప్రకటించేస్తే పూర్తిస్థాయిలో ఎన్నికలబరిలోకి దిగవచ్చని, ఎవరైనా వెనకబడితే మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండోస్థానంగా కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా ఆయన గజ్వేల్‌ నుంచి మాత్రమే పోటీలో ఉంటారని సమాచారం. మొత్తంమీద సుమారు పది మంది మాత్రమే కొత్త అభ్యర్థులుండే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.

ఏయే జిల్లాల్లో ఎలాంటి మార్పులు?

ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో అభ్యర్థులెవరినీ మార్చకపోవచ్చని తెలుస్తోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ఒకరికి మాత్రమే అవకాశం ఉండదని, అక్కడ ఇతర పార్టీ నుంచి వచ్చి చేరే ఓ నాయకుడికి టికెట్‌ ఇస్తారని సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పలు సర్వేల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కూడా ఒకటి రెండు మార్పులకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డోర్నకల్‌ నుంచి రెడ్యానాయక్‌ లేదా ఆయన కుమార్తె, మహబూబాబాద్‌ ఎంపీ కవిత.. ఇద్దరిలో ఎవరో ఒకరు అనే ప్రచారం జరిగినా చివరకు రెడ్యానాయక్‌నే పోటీ చేయించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. మహబూబాబాద్‌లో మాత్రం సిట్టింగ్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ లేదా మంత్రి సత్యవతి రాథోడ్‌లలో ఒకరికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. సత్యవతి రాథోడ్‌కే ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనగామలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేను మార్చితే ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డిలలో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. పల్లాకే ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తున్నా.. స్పష్టత రావడానికి మరో రెండు రోజులు పట్టవచ్చు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక స్థానంలో మాత్రమే మార్పు చేయవచ్చని సమాచారం.

ఇల్లెందులో గుమ్మడి నరసయ్య కుమార్తె!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మార్పుపై చర్చ జరిగినట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కుమార్తె, ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయకళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అనూరాధ పేరు తెరపైకి వచ్చినట్లు తెలిసింది. అక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలుపొందిన హరిప్రియ తర్వాత భారాసలో చేరారు. ఈసారి ఇల్లెందు అభ్యర్థిని మార్చాలని కొన్నాళ్ల క్రితమే భారాస నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈమెకు ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ జిల్లా నాయకులు గుమ్మడి అనూరాధ పేరు సూచించినట్లు తెలిసింది. బుధవారం రాత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు ముఖ్యమంత్రితో సమావేశమైనప్పుడు కూడా ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ నియోజకవర్గానికే చెందిన జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కనకయ్య కాంగ్రెస్‌లో చేరి.. అసెంబ్లీ బరిలోకి దిగనున్నందున కొత్త అభ్యర్థి కంటే సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే టికెట్‌ ఇవ్వడం మంచిదన్న అభిప్రాయం కూడా వ్యక్తమైనట్లు తెలిసింది. వైరా నుంచి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది తర్వాత భారాసలో చేరిన రాములునాయక్‌ను కూడా ఈ ఎన్నికల్లో మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక్కడి నుంచి మదన్‌లాల్‌కు అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. మొత్తంమీద ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకరిని మార్చడం ఖాయమని తెలుస్తోంది. రెండో స్థానంలో మార్పు గురించి అభ్యర్థుల ప్రకటన నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని