మాపై ధనం పన్ను విధించండి

ఆన్‌లైనులో దావోస్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సభ పేరిట బుధవారం ఓ అసాధారణ లేఖ వెలువడింది. 

Published : 20 Jan 2022 11:16 IST

102 మంది కుబేరుల అసాధారణ డిమాండ్‌
ప్రపంచ శిఖరాగ్ర సదస్సుకు బహిరంగ లేఖ

దావోస్‌: ఆన్‌లైనులో దావోస్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సభ పేరిట బుధవారం ఓ అసాధారణ లేఖ వెలువడింది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా కష్టకాలమైన గత రెండేళ్లలో ఆర్థిక అసమానతలు బాగా హెచ్చి, పేదల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. మరోవైపు.. ప్రపంచ కుబేరులు పదిమంది సంపద రూ.111.57 లక్షల కోట్లు (1.5 ట్రిలియన్‌ డాలర్లు) పెరిగిందంటూ ఆక్స్‌ఫామ్‌ సంస్థ నివేదిక ఇటీవల వెల్లడించింది. ఈ నివేదికపై పెద్దమనసుతో స్పందిస్తూ 102 మంది మిలియనీర్లు ఓ లేఖ రాశారు. ‘ప్రపంచ ధనవంతులపై ‘ధనం పన్ను’ విధిస్తే.. ఏటా రూ.186 లక్షల కోట్లు (2.5 ట్రిలియన్‌ డాలర్లు) వసూలవుతుంది. ఈ డబ్బుతో అందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్లు వేయడమే కాకుండా, 230 కోట్ల అభాగ్యులను పేదరికం నుంచి బయటికి తీసుకురావచ్చ’ని లేఖలో సూచించారు. ప్రతి దేశమూ స్థానిక ధనవంతుల నుంచి పన్ను రూపంలో న్యాయమైన వాటా రాబట్టాలని అభిప్రాయపడ్డారు. లేఖ రాసిన మిలియనీర్లలో ఒకరైన అబిగైల్‌ డిస్నీ మాట్లాడుతూ.. ‘ఇపుడున్న పన్ను విధానం న్యాయసమ్మతం కాదు. సంపన్నులను మరింత సంపన్నులు చేసేలా దీన్ని రూపొందించారు’ అని తెలిపారు. అమెరికా, కెనడా, జర్మనీ, బ్రిటన్, డెన్మార్క్, నార్వే, ఆస్ట్రియా, నెదర్‌ల్యాండ్స్, ఇరాన్‌ దేశాల మిలియనీర్లు ఈ అప్పీలు చేశారు. ‘ధనం పన్ను’ ఏవిధంగా వేయాలో కూడా ఇందులో వివరించారు. 50 లక్షల డాలర్లకు పైగా సంపద ఉన్నవాళ్లకు రెండు శాతం, 500 లక్షల డాలర్లకు పైగా ఉన్నవాళ్లకు మూడు శాతం, వందకోట్ల డాలర్లు దాటితే అయిదు శాతం పన్ను విధించాలని లేఖలో సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని